తొలి చిత్రం `ఆర్‌ఎక్స్100`లో ఘాటైన పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది పాయల్ రాజ్‌పుత్. ఆ సినిమాతోనే ఆమెకి అవకాశాలు వెల్లువెత్తాయి. `ఆర్డీఎక్స్‌లవ్` ప్రచార చిత్రాల్లో ఆమె హంగామా చూశాక... తెలుగులో బోల్డ్ పాత్రలకి పెట్టింది పేరన్నట్లుగా మారింది. తొలి చిత్రంతో ఆమెకొచ్చిన ఇమేజ్‌కి తగ్గట్టుగానే ఈ చిత్ర కథని సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు. `అర్ధనారి`వంటి ఒక విభిన్నమైన కథని తెరకెక్కించిన శంకర్‌భాను ఈ మూవీకి దర్శకుడు కావడం, ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటం వల్ల అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ మూవీ అందుకుందా? 'ఆర్డీఎక్స్'లాగా పాయల్ అందచందాలు పేలాయా? లేదా? తదితర విషయాలు తెలుసుకునేముందు కథలోకి వెళదాం..
కథ
అలివేలు (పాయల్ రాజ్‌పుత్) విజయవాడలో సామాజిక కార్యకర్తగా పనిచేస్తుంటుంది. తోటి అమ్మాయిలతో కలిసి హెచ్.ఐ.వీ నిర్మూలన, మద్యపానం, గుట్కా నిషేధం గురించి పాటు పడుతూ ఉంటుంది. ఆ క్రమంలో చాలా సమస్యలు ఎదురైనా వెనక్కి తగ్గదు. తాము చేస్తున్న మంచి పనులు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లాలనేదే ఆమె కోరిక. ముఖ్యమంత్రిని కలిశాక తన సొంత గ్రామమైన చంద్రన్నపేట సమస్య గురించి వివరించాలనేది అలివేలు ఆలోచన. ఇంతలోనే ఆమె జీవితంలోకి సిద్ధు (తేజస్ కంచర్ల) వస్తాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడతాడు. అది అలివేలు ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతుంది. ఆమెపై దాడి చేయడమే కాకుండా.. విజయవాడని వదిలిపెట్టి వెళ్లమని హుకుం జారీ చేస్తారు. మరి అలివేలు వెళ్లిందా? ఇంతకీ సిద్ధు ఎవరు? అలివేలు అతన్ని ప్రేమించిందా లేదా? చంద్రన్నపేట సమస్య ఏమిటి? ఆ సమస్య కోసం అలివేలు కుటుంబం ఏం చేసింది? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
ఊరి సమస్యని ఎప్పుడూ కథానాయకుడు తన భుజాన వేసుకుంటాడు. అందుకోసం పోరాటం చేస్తాడు. ఈ చిత్రంలో మాత్రం కథానాయిక ఆ బాధ్యతని తీసుకుంటుంది. తన ధైర్య సాహసాలతో పాటు, అందచందాల్నీ అస్త్రాలుగా మార్చేసుకుంటుంది. అమ్మాయి పోరాటం అంటే ఎక్కడో ఒక చోట ప్రేక్షకుల్ని కట్టిపడేయొచ్చు. కనీసం మహిళా ప్రేక్షకుల మెప్పు అయినా పొందేలా కథని నడిపించొచ్చు. కానీ దర్శకుడు ఏమాత్రం సినిమాపై ప్రభావం చూపించలేకపోయాడు. కేవలం కథానాయిక గ్లామర్‌ని నమ్ముకున్నాడా అన్నట్లుగా సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల ఆ గ్లామర్ కూడా ఏ దశలోనూ ప్రేక్షకుల్ని మెప్పించదు. ఆరంభంలోనే కథ పట్టు తప్పిపోయింది. ఒక సామాజిక కార్యకర్త పాత్రలో కథానాయికని ఆ స్థాయి హుందాతనం లేకుండానే తెరపై చూపించాడు దర్శకుడు. ఆరంభ సన్నివేశాలతోనే దాదాపుగా కథ చెప్పేశాడు. ఆ తర్వాత డ్రామా, ఎమోషన్స్‌పై దృష్టిపెట్టాల్సి ఉండగా, ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదు. కథానాయకుడు ఎవరు? అతని తండ్రి రంగంలోకి ఎందుకు దిగాల్సొచ్చిందనే విషయాలు తప్ప ద్వితీయార్థంలో కూడా ఆసక్తిని రేకెత్తించే అంశాలేమీ లేవు. పాయల్ రాజ్‌పుత్ మార్క్ రొమాంటిక్ సన్నివేశాలు మాత్రం కుర్రకారుని మెప్పించవచ్చు.