'రాజా ది గ్రేట్' తర్వాత వరుసగా మూడు ప్లాపులు మూటగట్టుకున్న మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'డిస్కో రాజా'. వి.ఐ ఆనంద్ దర్శకుడు. నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్లు. ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. కేవలం టీజర్లు మాత్రమే విడుదల చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన రవితేజ... 'డిస్కోరాజా'గా అలరించాడా? హ్యాట్రిక్ ప్లాపుల నుంచి బయటపడ్డాడా? లేదా అనేది ఈటీవీ భారత్ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
ఇదీ కథ
మద్రాసులో చిన్న చిన్న దొంగతనాల చేసే స్థాయి నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు డిస్కోరాజా(రవితేజ). అక్కడే ఉన్న బర్మా సేతు(బాబీ సింహా) డిస్కోరాజాకు పోటీకి వస్తాడు. ఇద్దరి మధ్య గ్యాంగ్ వార్స్ జరుగుతుంటాయి. అప్పుడే డిస్కోరాజాకు అనాథ అయిన హెలెన్ (పాయల్ )తో పరిచయం ఏర్పడుతుంది. ఒకరికొకరు దగ్గరవుతారు. సేతుతో గొడవల వల్ల తన కొడుకు అనాథ కాకూడదని భావించిన డిస్కోరాజా హెలన్తో లడఖ్ వెళ్లిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడా, డిస్కోరాజాపై దాడి జరుగుతుంది. అతడ్నిచంపేస్తారు. కానీ రీలైవ్ అనే బయోల్యాబ్ పరిశోధన వల్ల 35 ఏళ్ల తర్వాత డిస్కోరాజామళ్లీ బతికొస్తాడు. అయితే తనకు పాత జ్ఞాపకాలేవీ గుర్తుండవు. వయసు పాతికేళ్లలానే కనిపిస్తుంటుంది. ల్యాబ్ నుంచి బయటపడ్డ డిస్కోరాజా తననెవరు చంపారో తెలుసుకునే ప్రయత్నంలో అతడికి ఎలాంటి నిజాలు తెలిశాయి? డిస్కోరాజాను చూసిన సేతు ఏం చేశాడు? నభా(నభా నటాషా)తో ఉన్న సంబంధమేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే
డిస్కోరాజా... రవితేజ మాస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని అల్లిన కథ. 1980లో ఇద్దరు గ్యాంగ్ స్టర్ల మధ్య జరిగిన సంఘటనలను సైన్స్‌తో ముడిపెట్టి ప్రేక్షకులను అలరించేందుకు దర్శకుడు చేసిన కొత్త ప్రయోగం. కథ పరంగా పాత చింతకాయపచ్చడే అయినా... ఊహించని మలుపులతో కథనాన్ని ఆసక్తికరంగా మలిచి రవితేజ అభిమానులను ఫ్రీకౌట్ చేశాడు. లడఖ్‌తో మొదలైన ఫస్టాప్‌లో ప్రారంభ సన్నివేశాలతో భలే ఉందే అనిపించిన దర్శకుడు... ప్రకృతికి విరుద్దంగా జరిగే ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుడ్ని బతికించినట్టుగానే.. మంచు కొండల్లో 35 ఏళ్లుగా నిర్జీవంగా పడి ఉన్న డిస్కోరాజాను బతికిస్తాడు. ఆ తర్వాత తానెవరో తెలుసుకునేందుకు బయల్దేరిన డిస్కోరాజాకు తన పేరేంటో తెలియడం, తనను ఎవరు చంపారో తెలుసుకొన్న తర్వాత ఫస్టాప్‌ను ముగించాడు. సెకండాఫ్ కొచ్చేసరికి రివైండ్ బటన్ నొక్కాడు. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్లిస్తూ కథనాన్ని నడిపించాడు. సేతుతో డిస్కోరాజాకున్న గొడవ, ఆ గొడవల్లో డిస్కోరాజా ఎలా చనిపోయాడో తెలుసుకునేందు ప్రేక్షకుడ్ని 1980లోకి తీసుకెళ్లాడు. కట్ చేస్తే 35 ఏళ్ల తర్వాత బతికొచ్చిన డిస్కోరాజాకు దిల్లీలో కనిపించకుండా పోయిన వాసు(రవితేజ) డిస్కోరాజా కొడుకనే విషయం తెలుస్తుంది. డిస్కోరాజాను నమ్మిన వ్యక్తులు ఎలా మోసం చేశారో చూపించడంతో కథను క్లైమాక్స్‌కు చేర్చాడు.