తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రివ్యూ: ఏనుగుల సంరక్షణ కోసం 'అరణ్య' ఏం చేశాడు? - రానా దగ్గుబాటి వార్తలు

అడవులు, అందులోని ఏనుగుల సంరక్షణ సారాంశంతో తెరకెక్కిన చిత్రం 'అరణ్య'. ఏనుగులను సంరక్షించే 'ఫారెస్ట్​ మ్యాన్​'గా రానా దగ్గుబాటి ఈ సినిమాలో నటించారు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? రానా మెప్పించారా? ఏనుగుల కథేంటి? తెలుసుకోవాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే!

Aranya movie review
అరణ్య రివ్యూ

By

Published : Mar 26, 2021, 9:19 AM IST

Updated : Mar 26, 2021, 9:37 AM IST

చిత్రం: అరణ్య

నటీనటులు: రానా, విష్ణు విశాల్‌, పులకిత్‌ సామ్రాట్‌, జోయా హుస్సేన్‌, రఘుబాబు తదితరులు

సంగీతం: శంతన్‌ మొయిత్రా

సినిమాటోగ్రఫీ: ఏఆర్‌ అశోక్‌కుమార్‌

ఎడిటింగ్‌:భువన్‌ శ్రీనివాసన్‌

రచన, దర్శకత్వం: ప్రభూ సాల్మన్‌

బ్యానర్‌: ఏరోస్‌ ఇంటర్నేషనల్‌

విడుదల: 26-03-2021

అరణ్య పోస్టర్​

క‌థ‌ల ఎంపిక‌లోనూ.. పాత్ర‌ల్లో ఒదిగిపోవ‌డంలోనూ ప్ర‌త్యేక‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నారు రానా ద‌గ్గుబాటి. ఆయ‌న ఏ సినిమా చేసినా ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెరిగిపోతుంటాయి. 'అర‌ణ్య' కోసం రానా అడ‌వి మ‌నిషిగా మారిపోయారు. 'నేనే రాజు నేనే మంత్రి' త‌ర్వాత ఆయ‌న క‌థానాయ‌కుడిగా ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న చిత్ర‌మిదే. లాక్‌డౌన్ త‌ర్వాత విడుద‌ల‌యిన తొలి పాన్ ఇండియా చిత్రం కూడా ఇదే. ఇలా ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌తో కూడిన ఈ చిత్రం ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాల‌తో ఆస‌క్తిని రేకెత్తించింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? రానా మెప్పించారా? ఏనుగుల కథేంటి?

క‌థేంటంటే?

విశాఖ స‌మీపంలోని చిల‌క‌ల‌కోన అడ‌వి అది. అక్క‌డ త‌ర‌త‌రాలుగా ఏనుగుల్ని ర‌క్షించే ఓ కుటుంబంలో పుట్టి పెరుగుతాడు న‌రేంద్ర ‌భూప‌తి (రానా). అడ‌వి, ఏనుగుల ర‌క్ష‌ణ కోసం పాటు ప‌డుతున్నందుకు 'ఫారెస్ట్ మేన్'‌గా రాష్ట్రప‌తి పుర‌స్కారం కూడా అందుకుంటాడు. కేంద్ర‌మంత్రి క‌న‌క‌మేడ‌ల రాజ‌గోపాలం (అనంత్ మ‌హ‌దేవ‌న్‌) చిల‌క‌ల‌కోన అడ‌విపై క‌న్నేస్తాడు. అక్క‌డ డీ.ఎల్‌.ఆర్ టౌన్‌షిప్ క‌ట్టేందుకు రంగంలోకి దిగుతాడు. ఏనుగులు నీటి కోసం వెళ్లే అటవీ ప్రాంతంలో గోడ కూడా క‌ట్టేస్తాడు. మ‌రి అడ‌వినే న‌మ్ముకున్న ఏనుగులు, అర‌ణ్య.. కేంద్ర‌మంత్రిపై ఎలా పోరాటం చేశారు? అడ‌విని ఎలా ద‌క్కించుకున్నార‌నే విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే?

అడ‌వులు.. ఏనుగుల సంర‌క్ష‌ణ ఆవ‌శ్య‌కాన్ని చాటి చెప్పే క‌థ ఇది. నిజానికి ఇలాంటి క‌థ‌లు ఇదివ‌ర‌క‌టి సినిమాల్లోనూ చూశాం. వాటితో పోలిస్తే.. అరుదైన అర‌ణ్య పాత్ర‌, అట‌వీ నేప‌థ్యమే ఈ సినిమాను ప్ర‌త్యేకంగా నిల‌బెడుతుంది‌. ముఖ్యంగా అర‌ణ్య‌కు, ఏనుగులకు మ‌ధ్య అనుబంధాన్ని తెర‌పై ఆవిష్క‌రించిన తీరు.. ఆ కోణంలో భావోద్వేగాల్ని రాబ‌ట్టిన విధానం చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. తొలి స‌న్నివేశం నుంచే 'అర‌ణ్య' ప్ర‌పంచంలో ప్రేక్ష‌కుడిని భాగం చేశాడు ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్‌. ఆహ్లాదాన్ని పంచే ప‌చ్చ‌టి అందాల్ని చూపెడుతూ క‌థ‌ను మొద‌లుపెట్టాడు. అభివృద్ధి, ఉపాధి పేరుతో అడ‌వుల్ని నాశ‌నం చేస్తున్న విధానాన్ని క‌ళ్ల‌కు క‌ట్టే ప్ర‌య‌త్నం చేశాడు. టౌన్‌షిప్ కాంట్రాక్ట‌ర్‌కు, అర‌ణ్య‌కు మ‌ధ్య పోరాటం నేప‌థ్యంలోనే ప్ర‌థ‌మార్ధం సాగుతుంది. కుమ్కీ ఏనుగు శింగ‌న్న (విష్ణు విశాల్‌), న‌క్స‌లైట్ మ‌ల్లి (జోయా) పాత్ర‌ల నేప‌థ్యంలో ఉపక‌థ‌ను కూడా జోడించారు. ఆ నేప‌థ్యంలో స‌న్నివేశాలు క‌థ‌ను మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార్చాయి.

రానా దగ్గుబాటి

అయితే ద్వితీయార్ధంలో ఆ పాత్ర‌లు అర్ధంత‌రంగా క‌నుమ‌రుగ‌వుతాయి. దాంతో ఆ ఉప‌క‌థ‌ల‌న్నీ అసంపూర్ణంగా ముగిసిన‌ట్టు అనిపిస్తాయి. ప‌తాక స‌న్నివేశాలు ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లం‌. చివ‌రి 30 నిమిషాలు పండిన భావోద్వేగాలు సినిమాను మ‌రోస్థాయికి తీసుకెళ్లాయి. ఏనుగులుంటేనే మ‌నిషి మ‌నుగడ అని.. ఊపిరే ఆగిపోతుందంటే ఉపాధి అంటున్నార‌ని రానాతో చెప్పించిన సంభాష‌ణ‌లు ఆలోచింప‌జేస్తాయి. మ‌ధ్య‌లో కొన్ని స‌న్నివేశాలు అంతంత మాత్రం అనిపించినా.. ఈ సినిమా అడుగడుగునా ఆస‌క్తికరంగానే సాగుతుంది. అట‌వీ నేప‌థ్యంలో ఈ క‌థ ప్రేక్ష‌కుల‌కు కొత్త‌ద‌నాన్ని పంచుతుంది. స‌మాజంలో ఇప్పుడు నెల‌కొన్న ప‌రిస్థితుల్లో చెప్పాల్సిన కథే ఇది. ప‌ర్యావ‌ర‌ణం గురించి విలువైన విష‌యాలెన్నో ఉన్నాయి.

ఎవ‌రెలా చేశారంటే?

రానా అర‌ణ్య పాత్ర‌లో జీవించారు. అడ‌వి మ‌నిషిగా క‌నిపించేందుకు ఆయ‌న తీసుకున్న శ్ర‌ద్ధ, ఆయ‌న ప‌డిన క‌ష్టం అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. హావ‌భావాలు, సంభాష‌ణ‌లు ప‌లికిన తీరులోనూ ప్ర‌త్యేక‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. రానా త‌ప్ప మ‌రొక‌రు చేయ‌లేరనిపించేలా ఆయ‌న ఆ పాత్ర‌పై ప్ర‌భావం చూపించారు. విష్ణు విశాల్ కూడా శింగ‌న్న అనే హుషారైన పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయాడు. జోయాతో ఆయ‌న ల‌వ్ ట్రాక్ ఆక‌ట్టుకునేలా ఉంటుంది. శ్రియ పిల్గ‌వోంక‌ర్ జ‌ర్నలిస్టుగా కీల‌క‌మైన పాత్ర చేసింది. కేంద్ర‌మంత్రిగా అనంత్ మ‌హ‌దేవ‌న్‌, శింగ‌న్న‌తో క‌లిసి ప్ర‌యాణం చేసే పాత్ర‌లో ర‌ఘుబాబు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. అశోక్‌కుమార్ కెమెరా అడ‌వి అందాల్ని అద్భుతంగా ఒడిసిప‌ట్టింది. ద‌ట్ట‌మైన అడ‌వుల్ని తెర‌పై చూపించిన తీరు చాలా బాగుంది. శంత‌ను మొయిత్రా సంగీతం, ర‌సూల్ పోకుట్టి సౌండ్ డిజైనింగ్ అడ‌విలో ఉన్న అనుభూతినిస్తుంది. వ‌న‌మాలి మాట‌లు.. పాట‌లు బాగున్నాయి. చిటికేసే ఆ చిరుగాలి పాట చిత్రీక‌ర‌ణ కూడా మెప్పిస్తుంది. ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్ క‌థ కంటే కూడా త‌న మార్క్ క్యారెక్ట‌రైజేష‌న్‌తో, ఓ మంచి సందేశంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు మెప్పిస్తుంది. ఆయ‌న ఎందుకు ప్ర‌త్యేక‌మైన ద‌ర్శ‌కుడో ఈ సినిమా మ‌రోసారి చాటి చెబుతుంది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

అరణ్య పోస్టర్​
బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ రానా న‌ట‌న - ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగే స‌న్నివేశాలు
+ క‌థా నేప‌థ్యం, ప‌తాక స‌న్నివేశాలు
+ సంగీతం.. ఛాయాగ్ర‌హ‌ణం

చివ‌రిగా: 'అర‌ణ్య‌' తన ప్రపంచంలోకి తీసుకెళ్లి అటు సందేశమిస్తూనే ఇటు ఆకట్టుకుంటాడు.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ఇదీ చూడండి:ఆ సినిమాలో విక్కీకి జోడీగా సారా!

Last Updated : Mar 26, 2021, 9:37 AM IST

ABOUT THE AUTHOR

...view details