తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రెడ్​' రివ్యూ: ద్విపాత్రాభినయంతో రామ్​ ఆకట్టుకున్నారా?

'ఇస్మార్ట్ శంకర్'​ సక్సెస్​తో జోష్​లో ఉన్న రామ్​.. 'రెడ్​'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి సినిమా ఎలా ఉంది? రామ్​ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నారా?

ram pothineni RED movie telugu review
'రెడ్​' రివ్యూ: నిజంగానే మంట మాములుగా లేదా?

By

Published : Jan 14, 2021, 3:25 PM IST

రివ్యూ: రెడ్‌

చిత్రం:రెడ్‌

నటీనటులు:రామ్‌, నివేదా పేతురాజ్‌,మాళవిక శర్మ,అమృత అయ్యర్‌, సోనియా అగర్వాల్‌, సంపత్‌ రాజ్‌ తదితరులు

సంగీతం:మణిశర్మ

సినిమాటోగ్రఫీ:సమీర్‌రెడ్డి

ఎడిటింగ్‌:జునైద్‌ సిద్ధిఖ్‌

నిర్మాత:స్రవంతి రవికిషోర్‌

దర్శకత్వం:కిషోర్‌ తిరుమల

విడుదల తేదీ:14-01-2021

'రెడ్​' లో రామ్

వెండితెరపై హుషారైన నటన కనబరిచే అతికొద్దిమంది యువ కథానాయకుల్లో రామ్‌ ఒకరు. వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న ఆయన 2019లో 'ఇస్మార్ట్‌ శంకర్‌' అంటూ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తమిళ సూపర్‌హిట్‌ 'తడమ్‌'ను పట్టాలెక్కించారు. 'రెడ్‌' పేరుతో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది వేసవి కానుకగా విడుదల కావాల్సి ఉన్నా, కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్‌ ద్విపాత్రాభినయం చేయటం, కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో హ్యాట్రిక్‌ చిత్రం కావడం వల్ల 'రెడ్‌'పై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమాలో రామ్‌ ఎలా నటించారు? కథేంటి? తమిళ 'తడమ్‌'లో ఏయే మార్పులు చేశారు?

ద్విపాత్రాభినయం

క‌థేంటంటే:ఆదిత్య (రామ్) ఇంట‌ర్ చ‌దివి జులాయిగా తిరిగే ఓ కుర్రాడు. పేకాట అంటే పిచ్చి. త‌న స్నేహితుడు వేమ (స‌త్య‌)తో క‌లిసి మోసాలకి పాల్పడుతుంటాడు. వేమ త‌న అప్పుల్ని తీర్చడం కోస‌మ‌ని దాచుకున్న రూ.8 లక్షల మొత్తాన్ని పేకాట‌లో పోగొడ‌తాడు ఆదిత్య‌. ఆ త‌ర్వాత ఆ డ‌బ్బు ఎలా స‌ర్దాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతాడు. ఇంత‌లో ఆకాశ్ అనే ఓ కుర్రాడు హత్యకు గుర‌వుతాడు. అత‌ని దగ్గర లాక‌ర్‌లో ఉన్న రూ. 11 లక్షల డ‌బ్బు కూడా క‌నిపించ‌దు. మ‌రి ఆ హత్య చేసింది ఆదిత్యేనా? కాదా? అచ్చం ఆదిత్య పోలిక‌ల‌తో ఉన్న సివిల్ ఇంజినీర్ సిద్ధార్థ్ (రామ్) కూడా ఈ కేసులో నిందితుడే. మరింత‌కీ ఈ హ‌త్య చేసిందెవ‌రు? ప‌రిశోధ‌న‌లో ఎలాంటి నిజాలు తెలిశాయి. ఆదిత్యపై మ‌న‌సు ప‌డిన గాయ‌త్రి (అమృత అయ్యర్‌), సిద్ధార్థ్‌ని ప్రేమించిన (మ‌హిమ‌)ల క‌థేమిటనేది తెర‌పై చూడాల్సిందే.

రామ్

ఎలా ఉందంటే:రామ్ ద్విపాత్రాభిన‌యం... ఆయ‌న తొలిసారి ఓ థ్రిల్లర్‌ క‌థ‌లో న‌టించ‌డం. - ఇలా ప‌లు ప్రత్యేకతలున్న సినిమా ఇది. తమిళంలో విజ‌య‌వంత‌మైన 'త‌డ‌మ్'కి రీమేక్‌గా తెర‌కెక్కింది. మాతృక‌తో పోలిస్తే అద‌నంగా కుటుంబ నేప‌థ్యాన్ని, ప్రేమ‌కి సంబంధించిన అంశాల్ని జోడించి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శకుడు తిరుమ‌ల కిశోర్‌. రామ్ ఇదివర‌కు చేసిన చిత్రాలతో పోలిస్తే పూర్తి భిన్నమైన అనుభూతినే పంచుతుంది. 'ఇస్మార్ట్ శంక‌ర్' త‌ర్వాత ఆ వైవిధ్యాన్ని కొన‌సాగించిన‌ట్టు అనిపిస్తుంది. సినిమాకి రామ్ ద్విపాత్రాభిన‌య‌మే ప్రధాన ఆకర్షణ‌. తిరుమ‌ల కిశోర్ త‌న మార్క్ ర‌చ‌న‌తో థ్రిల్లర్‌ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులే కాకుండా, అంద‌రికీ న‌చ్చేలా ఈ సినిమాని తీర్చిదిద్దే ప్రయ‌త్నం చేశారు.

'రెడ్' పోస్టర్

విరామానికి ముందు వ‌చ్చే స‌న్నివేశాలు, ద్వితీయార్ధం ఉత్కంఠ ఆక‌ట్టుకుంటాయి. ప్రథ‌మార్ధంలో స‌న్నివేశాలన్నీ కూడా ఆదిత్య‌, సిద్ధార్థ్‌ల పాత్రల నేప‌థ్యం ... వారి ప్రేమ‌క‌థ‌ల్ని ఆవిష్కరిస్తూ సాగుతాయి. క‌థేమీ లేకపోవ‌డంతో, అక్కడక్కడా సాగ‌దీత‌లా అనిపిస్తుంది. ఆకాశ్ హ‌త్య త‌ర్వాతే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ఆ హ‌త్య ఎవ‌రు చేశార‌నే ప‌రిశోధ‌న మొద‌ల‌వ‌డం, సిద్ధార్థ్‌, ఆదిత్య... ఇద్దరిపైనా స‌మానంగా అనుమానాలు రేకెత్తడంతో క‌థ ఆస‌క్తిక‌రంగా మారుతుంది. స‌గ‌టు థ్రిల్లర్‌ సినిమాల్లో ఒకొక్క క్లూ బ‌య‌ట ప‌డుతూ... కేసు కొద్దికొద్దిగా పురోగ‌తి సాధిస్తూ క‌థ ప‌తాక స‌న్నివేశాల‌వైపు వెళుతుంటుంది. ఈ క‌థ అలా కాదు. ఇద్దరు అనుమానితుల్లో ఒక‌రు హ‌త్య చేశార‌నే విష‌యంపై బ‌ల‌మైన ఆధారం ఉన్నా... అదెలా అనే‌దే అంతుచిక్కదు. ప‌తాక స‌న్నివేశాల్లోనే అస‌లు చిక్కుముడి వీడుతుంది. ద్విపాత్రాభిన‌యంతో కూడిన సినిమాలు చాలానే వ‌చ్చినా... ఈ క‌థా నేప‌థ్యం కొత్తదనాన్ని పంచింది. కేసు ప‌రిశోధ‌న సీరియ‌స్‌గా సాగుతున్న క్రమంలో ద్వితీయార్ధంలో సిద్ధార్థ్‌, ఆదిత్యల కుటుంబ నేప‌థ్యాన్ని చూపించడం సినిమాకి కాస్త బ్రేకులు వేసిన‌ట్టు అనిపించినా... వాటితో భావోద్వేగాలు పండించడంలో విజ‌య‌వంత‌మ‌య్యారు దర్శకుడు.

'రెడ్'

ఎవ‌రెలా చేశారంటే:రామ్ ద్విపాత్రాభిన‌యంతో అల‌రించారు. తెర‌పై ఇద్దరూ ఒకేలా క‌నిపించినా... అందులో వైవిధ్యం క‌నిపించేలా న‌టించాడు. ఆదిత్య పాత్ర కోసం ఆయ‌న ప‌డిన క‌ష్టం తెర‌పై క‌నిపిస్తుంది. క‌థానాయిక‌ల పాత్రలు ప‌రిమిత‌మే అయినా... ప్రతి పాత్రకీ క‌థ‌లో ప్రాధాన్యం ఉంది. ప్రతి పాత్ర ప్రేక్షకుల‌పై ప్రభావం చూపిస్తుంది. ఎస్సై యామినిగా నివేదా పేతురాజ్‌, సీఐ నాగేంద్రకుమార్‌గా సంప‌త్ కీల‌క‌మైన పాత్రల్లోలో క‌నిపిస్తారు. స‌త్య అక్కడక్కడా న‌వ్వించాడు.

సాంకేతిక విభాగాలు చక్కటి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. హెబ్బా పటేల్ 'డింఛక్' గీతంతో సంద‌డి చేసింది. సాంకేతిక విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. మ‌ణిశ‌ర్మ నేప‌థ్య సంగీతానికి తోడు 'డింఛక్ డింఛక్', 'నువ్వే నువ్వే' పాట‌లు అల‌రిస్తాయి. స‌మీర్‌రెడ్డి కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. దర్శకుడు తిరుమ‌ల కిశోర్ మాతృక‌లోని ఆత్మ ఇందులోకి ప‌క్కాగా తీసుకొచ్చారు. త‌న‌దైన శైలిలో మాస్ అంశాల్ని జోడించారు. 'అబ‌ద్ధం వినిపించింది... అవ‌స‌రం క‌నిపించింది'లాంటి మాట‌లు సినిమాలో చాలానే వినిపిస్తాయి. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా క‌నిపిస్తాయి.

రామ్, మాళవిక

బ‌లాలు:

రామ్ న‌ట‌న

ద్వితీయార్ధం

మాట‌లు

బ‌ల‌హీన‌త‌లు:

ప్రథమార్ధంలో కొన్ని స‌న్నివేశాలు

చివ‌రిగా:థ్రిల్‌ను పంచే 'రెడ్'

గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details