తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినిమా రివ్యూ: ఇది రజనీ దర్బార్​..!

రజనీకాంత్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన దర్బార్ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఎలా ఉందో.. నటీనటులు ఎలా చేశారో ఓ లుక్కేద్దాం!

Rajanikanth Darbar Movie Review
దర్బార్

By

Published : Jan 9, 2020, 2:33 PM IST

Updated : Jan 9, 2020, 2:51 PM IST

ఈ ఏడాది సినీ సంక్రాంతి సంద‌డి ర‌జ‌నీ 'ద‌ర్బార్‌'తో మొద‌లైంది. తెలుగులో ర‌జ‌నీకాంత్ సినిమా అంటే టాలీవుడ్‌ అగ్ర క‌థానాయ‌కుల చిత్రాల స్థాయిలోనే క్రేజ్ ఉంటుంది. థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడ‌తాయి. ఇక మురుగ‌దాస్ ద‌ర్శక‌త్వంలో ర‌జనీ అన‌గానే సినీప్రియుల్లో ఆస‌క్తి మ‌రింత పెరిగింది. ఇద్దరికీ తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అందుకే 'ద‌ర్బార్' విడుద‌ల‌కి ముందే ప్రేక్షకుల దృష్టిని ప్రముఖంగా ఆక‌ర్షించింది. మురుగ‌దాస్ చేసిన తొలి పోలీస్ క‌థా చిత్రమిది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? ర‌జ‌నీని ఎలా చూపించాడు? తెలుసుకొందాం..!

క‌థేంటంటే:

ఎన్‌కౌంట‌ర్లకి పెట్టింది పేరు ఆదిత్య అరుణాచ‌లం(ర‌జ‌నీకాంత్‌). ప్రమాద‌క‌ర‌మైన రౌడీలను ఏరిపారేస్తుంటాడు. అది త‌ప్పని ఎవ‌రడ్డొచ్చినా లెక్కచేయ‌డు. నేను బ్యాడ్ పోలీస్‌ని అంటుంటాడు. మాద‌క ద్రవ్యాలు, మ‌హిళ‌ల అక్రమ ర‌వాణా ముఠాల్ని అంతం చేసే క్రమంలో అత‌నికి అస‌లు సిస‌లు స‌వాళ్లు ఎదుర‌వుతాయి. ఆ క్రమంలో అత‌ని ప్రాణానికి ప్రాణ‌మైన కూతురు వ‌ల్లి (నివేదా థామ‌స్) కూడా మ‌ర‌ణిస్తుంది. ముంబైలో ఎంతోమంది పోలీసుల్ని మ‌ట్టుబెట్టి, విదేశాల్లో స్థిర‌ప‌డిన హ‌రిచోప్రా (సునీల్ శెట్టి) దీని వెన‌క ఉంటాడు. మ‌రి ఆదిత్య అత‌న్ని ఎలా దేశానికి ర‌ప్పించాడు? ఎలా మ‌ట్టుబెట్టాడు? ర‌జ‌నీ జీవితంలోకి వ‌చ్చిన లిల్లీ (న‌య‌న‌తార) క‌థేమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

ఇందులోని క‌థ చాలా సినిమాల్లో చూసిందే. ర‌జ‌నీకాంత్ ఈ సినిమా వేడుక‌లో చెప్పిన‌ట్టు ఈ క‌థ‌తో సినిమా నిర్మించ‌డానికి నిర్మాత‌లు ముందుకు రావ‌డం సాహ‌స‌మే. ఆ మాట‌కొస్తే నిర్మాత‌దే కాదు, ర‌జ‌నీకాంత్‌లాంటి క‌థానాయ‌కుడు ఇలాంటి క‌థ‌ని న‌మ్మడం కూడా సాహ‌స‌మే. కానీ, మురుగ‌దాస్‌ పైన ఉన్న న‌మ్మకంతో, క‌థ‌నంలో ఆయ‌న‌కున్న పట్టు తెలిసిన క‌థానాయ‌కుడిగా ర‌జ‌నీ ఈ సినిమా చేయ‌డానికి అంగీకరించారు. ర‌జ‌నీ త‌నపై ఉంచిన న‌మ్మకానికి త‌గ్గట్టుగానే త‌న‌దైన శైలి స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు ద‌ర్శకుడు. ర‌జ‌నీతో సినిమా తీసే ద‌ర్శకుల్లో ఎక్కువ‌భాగం ఆయ‌న అభిమానులే. గుర్తుండిపోయే చిత్రాలు తీసిన మురుగ‌దాస్ కూడా ఒక అభిమానిగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అందుకే అడుగ‌డుగునా ర‌జ‌నీకాంత్ స్టైల్‌, ఆయ‌న్నుంచి అభిమానులు ఎలాంటి అంశాల్ని కోరుకుంటారో వాటికే ప్రాధాన్యమిచ్చాడు. దాంతో క‌థ లేక‌పోయినా, క‌థ‌నం, ర‌జ‌నీ సంద‌డితో సినిమా ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ముందుకు సాగిపోతుంది. డిప్యూటీ సీఎం కుమార్తె కిడ్నాప్‌ని ఛేదించ‌డం, ప‌నిలో ప‌నిగా మ‌హిళ‌ల అక్రమ రవాణా ముఠాని బ‌య‌టికి లాగే స‌న్నివేశాలు, ఆ నేప‌థ్యంలో మైండ్‌గేమ్ ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది.

తుపాకీ సినిమాని గుర్తు చేస్తూ ప్రథ‌మార్థంలో రెండు మూడు చోట్ల ఇంటెలిజెన్స్ స్క్రీన్‌ప్లేని వాడుకున్నాడు ద‌ర్శకుడు మురుగదాస్‌‌. ఆ స‌న్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌గా నిలిచాయి. తెలివిగా విదేశాలకి పారిపోయిన అజ‌య్ మ‌ల్హోత్రాని అంతే తెలివిగా దేశానికి ర‌ప్పించడం, అత‌న్ని జైల్లోనే మ‌ట్టుబెట్టడం నేప‌థ్యంలో వ‌చ్చే విరామ స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ద్వితీయార్థంలో మాత్రం ఆ జోరు క‌నిపించ‌దు. తండ్రీకూతుళ్ల మ‌ధ్య సెంటిమెంట్‌పైనే దర్శకుడు దృష్టిపెట్టాడు. అవి కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా అనిపించిన‌ప్పటికీ, క‌థ క‌థ‌నాల ప‌రంగా మాత్రం చిత్రం నెమ్మదిగా మారిపోయింది. అప్పటిదాకా ఎలాంటి స‌వాళ్లనైనా అల‌వోక‌గా ఛేదించిన పోలీస్‌ క‌మిష‌న‌ర్ మ‌తిస్థిమితం కోల్పోయిన‌ట్టు క‌నిపించ‌డం అంత‌గా ఆక‌ట్టుకోదు. క‌లుగులో దాక్కున్న హ‌రిచోప్రాని బ‌య‌టికి ర‌ప్పించ‌డం కోసం మ‌ళ్లీ మైండ్‌గేమ్‌ వైపు వెళ్లిపోయాడు ద‌ర్శకుడు. ఖైదీల‌కి సెల్‌ఫోన్లు ఇవ్వడం, వాళ్ల ఫోన్ కాల్స్ నుంచి హ‌రిచోప్రా అడ్రస్ క‌నుక్కోవ‌డం అంత ఆక‌ట్టుకునేలా లేవు. ప‌తాక స‌న్నివేశాలు మామూలే. న‌య‌న‌తారతో స‌న్నివేశాల నుంచి వినోదం పుట్టించే ప్రయ‌త్నం చేశారు. అంతే త‌ప్ప ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. ర‌జ‌నీ స్టైల్‌, ఆయ‌న జోష్ ఈ సినిమాకి ప్రధాన ఆక‌ర్షణ‌గా నిలిచింది.

ఎవ‌రెలా చేశారంటే:

ర‌జ‌నీకాంత్ వ‌న్‌మేన్ షో అని చెప్పొచ్చు. ఆయ‌న కుర్రాడిలాగా చాలా హుషారుగా క‌నిపించారు. ఫైట్ స‌న్నివేశాల్లోనూ, డ్యాన్సుల్లోనూ చాలా బాగా న‌టించారు. అభిమానుల్ని అది మ‌రింత‌గా మెప్పించే విష‌యం. బ్యాడ్ పోలీస్‌గా ఆయ‌న చేసే సంద‌డి అల‌రిస్తుంది. కూతురు నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్లోనూ చ‌క్కటి సెంటిమెంట్‌ని పండించారు. నివేదా థామ‌స్ అభిన‌యం మెప్పిస్తుంది. న‌య‌న‌తార పాత్ర ప‌రిధి చిన్నదే అయినా ఉన్నంత‌లో ఆక‌ట్టుకునే ప్రయ‌త్నం చేసింది. సునీల్ శెట్టి ప్రతినాయ‌కుడిగా మెప్పిస్తాడు. పేరుకు పెద్ద డాన్ కానీ ఆ ప్రభావం రెండు మూడు స‌న్నివేశాల్లో మాత్రమే క‌నిపిస్తుంది. యోగిబాబు ర‌జ‌నీతోపాటే క‌నిపిస్తూ న‌వ్వించాడు. ఇక మిగిలిన పాత్రలు మామూలే. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సంతోష్ శివ‌న్ కెమెరా ప‌నిత‌నం, అనిరుధ్ సంగీతం చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌గా నిలుస్తాయి. ముఖ్యంగా నేప‌థ్యం సంగీతం, దుమ్ము ధూళి పాట‌తో అనిరుధ్ చిత్రాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లాడు. ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌, ఆయన స్టైల్‌పైనే ఎక్కువ‌గా ఆధార‌పడ్డాడు మురుగ‌దాస్‌. తన మార్కుగా పేరున్న కొన్ని మైండ్‌గేమ్ స‌న్నివేశాల్ని మాత్రం ఇందులో బాగా చూపించారు.

బలాలు

  • ర‌జ‌నీకాంత్
  • క‌థ‌నం
  • సంగీతం
  • ప్రథ‌మార్థం

బ‌ల‌హీన‌త‌లు

  • చెప్పుకోదగ్గ క‌థ లేక‌పోవ‌డం
  • ద్వితీయార్థం

చివ‌రిగా: ఇది పోలీస్ ‘ద‌ర్బార్’

ఇదీ చదవండి: ఈ మేకింగ్ వీడియోకు 'సరిలేదు'..!

Last Updated : Jan 9, 2020, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details