చిత్రం: పుష్పక విమానం; నటీనటులు: ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వి మేఘన, హర్షవర్ధన్, నరేశ్, గిరి, కిరీటి తదితరులు; సంగీతం: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని; నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి; రచన-దర్శకత్వం: దామోదర; సమర్పణ: విజయ్ దేవరకొండ; విడుదల: 2021 నవంబర్ 12
విజయ్ దేవరకొండ తమ్ముడిగా 'దొరసాని' సినిమాతో పరిచయమయ్యారు ఆనంద్ దేవరకొండ. సహజమైన కథల్ని ఎంచుకొంటూ ప్రయాణం చేస్తున్నారు. 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో విజయాన్ని అందుకున్న ఆయన ఇటీవల 'పుష్పక విమానం'లో నటించారు. విజయ్ దేవరకొండ చిత్ర నిర్మాణంలో భాగం కావడం సహా స్వయంగా సినిమాకు ప్రచారం చేయడం వల్ల సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి ఈ నయా 'పుష్పక విమానం' ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం..
కథేంటంటే: చిట్టిలంక సుందర్ (ఆనంద్ దేవరకొండ) ప్రభుత్వ స్కూల్‌లో లెక్కల టీచర్. పెళ్లి గురించి ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాడు. పెద్దల సమక్షంలో మీనాక్షి (గీత్ సైనీ)తో పెళ్లి జరుగుతుంది. పెళ్లై ఎనిమిది రోజులవుతుందో లేదో ఆ వెంటనే ఆమె లెటర్ రాసి పెట్టి.. ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. పెళ్లాం లేచిపోయిందంటే పరువు పోతుందని, ఆమె లేకపోయినా ఉన్నట్టు నటిస్తూ కాలం వెళ్లబుచ్చుతాడు సుందర్. తప్పని పరిస్థితుల్లో లఘు చిత్రాల్లో నటించే రేఖను(శాన్వి మేఘన) తన భార్యగా నటించమని ఇంటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకీ మీనాక్షి ఎక్కడికి వెళ్లింది? ఆమె మిస్సింగ్ కేసు కోసం ఎస్సై రంగం (సునీల్) దర్యాప్తులోకి దిగాక ఎలాంటి నిజాలు తెలిశాయన్నదే మిగతా కథ.
ఎలా ఉందంటే: అమాయకత్వంతో కూడిన ఓ కొత్త జంట చుట్టూ సాగే కథ ఇది. చిట్టిలంక సుందర్, మీనాక్షి పెళ్లితోనే కథ మొదలవుతుంది. పెళ్లైన వెంటనే భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడం, ఆ విషయాన్ని బయటికి చెప్పుకోలేక సతమతమవడం వంటి సన్నివేశాలతో ఆరంభం ఆసక్తికరంగానే సాగుతుంది. హోటల్ భోజనాన్ని తీసుకువెళ్లి తన భార్య చేతి వంటగా చెప్పుకొంటూ తోటి ఉపాధ్యాయులకు పెట్టడం, దాన్ని వాళ్లు కనిపెట్టడం, కొత్త కాపురాన్ని చూసేందుకు వాళ్లంతా ఇంటికి రావడం, అక్కడ ఎదురయ్యే ఇబ్బందులతో సన్నివేశాలు సరదాగా సాగుతాయి. ముఖ్యంగా యాక్టింగ్ ప్యాషన్ ఉన్న అమ్మాయి రేఖ.. సుందర్ భార్యగా నటించిన సన్నివేశాలు, దాని వల్ల ఎదురయ్యే పరిణామాలన్నీ నవ్వులు పూయించేలా ఉన్నాయి. ప్రథమార్థంలో హీరో పడే పాట్లన్నీ హాస్యాన్ని పంచుతాయి.
మీనాక్షి వార్తల్లో కనిపించడం నుంచే కథ మలుపు తిరుగుతుంది. అప్పటిదాకా కుటుంబ నేపథ్యంలో సినిమా సాగినట్టు అనిపించినా, ఆ తర్వాత నేర పరిశోధన కథగా మలుపు తిరుగుతుంది. ద్వితీయార్థంలో ఎస్సై రంగంగా సునీల్, ప్రధానోపాధ్యాయుడిగా నరేశ్ చేసే హంగామా నవ్వులు పంచినప్పటికీ చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. కథనం అంతగా ఆసక్తి రేకెత్తించదు. పోలీసులు రంగ ప్రవేశం చేసినా ముందుకు కదలని మీనాక్షి కేసును కథానాయకుడు తనకు దొరికిన క్లూస్‌తో పరిశోధించడం వంటి అంశాలు చిత్రకథకు అంతగా అతకలేదనిపిస్తోంది. పెళ్లైన కొత్తలో యువతీయువకుల మధ్య కనిపించే గందరగోళం, వాళ్లు చేసే పొరపాట్ల గురించి మరింతగా చర్చించే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ విషయాలను పైపైనే తేల్చేశారు. సర్దుకుపోవడమే పెళ్లి అని ఓ చిన్న సందేశంతో సరిపెట్టేశారు. మొత్తంగా ఓ చిన్న కేస్ స్టడీ తరహా కథ ఇది.
ఎవరెలా చేశారంటే: పెళ్లాం లేచిపోయే ఇలాంటి కథల్ని భుజాలకు ఎత్తుకునే కథానాయకులు చాలా అరుదు. ఆనంద్ దేవరకొండ ధైర్యంగా ఈ కథలో నటించారు. ఆయన ప్రయత్నం అభినందనీయం. కథల విషయంలో ఆయన ఆలోచనా ధోరణికి అద్దం పట్టే విషయం ఇది. చిట్టిలంక సుందర్ పాత్రకు తనవంతు న్యాయం చేశారు. ఆ పాత్రలో ఒదిగిపోయిన విధానం ఆకట్టుకున్నా, కామెడీ టైమింగ్ విషయంలో మరికాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందనిపిస్తుంది. చాలా సన్నివేశాల్లో ఒకే రకమైన హావభావాలతో కనిపిస్తారు. కథానాయికలు గీత్ సైనీ, శాన్వి మేఘన పాత్రలకు తగ్గట్టుగా చక్కటి అభినయం ప్రదర్శించారు. ముఖ్యంగా శాన్వి మేఘన చేసే అల్లరి, నటనపై ప్యాషన్ ఉన్న అమ్మాయిగా ఆమె కనిపించిన విధానం ఆకట్టుకుంటుంది. పోలీస్ స్టేషన్‌లో సునీల్-శాన్విల మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. అమాయకత్వంతో కూడిన అమ్మాయిగా గీత్ సైనీ నటన మెప్పిస్తుంది. సునీల్, నరేశ్, గిరి తదితరుల పాత్రలు చక్కటి ప్రాధాన్యంతో కనిపిస్తాయి. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సంగీతం, కెమెరా పనితనం ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ విభాగం ద్వితీయార్థంపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. దర్శకుడు దామోదర కొన్ని సన్నివేశాలపై చక్కటి ప్రభావం చూపించారు. కథనం పరంగా ఆయన మరిన్ని కసరత్తులు చేయాల్సింది. అలాగే హాస్యం, ఉత్కంఠ పెంచేందుకు ఆస్కారమున్న సన్నివేశాలు చాలానే ఉన్నా, వాటిని సరిగ్గా వినియోగించుకోలేదు. నిర్మాణం బాగుంది.
బలాలు