చిత్రం: ప్రతిరోజూ పండగే
నటీనటులు: సాయితేజ్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్ తదితరులు
దర్శకుడు:మారుతి
సంగీతం:తమన్
నిర్మాణ సంస్థలు: యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్
విడుదల తేది:2019 డిసెంబర్ 20
సాయితేజ, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'. సత్యరాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. మారుతి దర్శకత్వం వహించాడు. మరి ఈ సినిమా.. ప్రేక్షకులకు నిజంగా పండగలా అనిపించిందా లేదా? తెలియాలంటే ఈటీవీ భారత్ సమీక్షలోకి వెళ్లిపోదాం.
ఇదీ కథ:
రాజమండ్రిలో రఘురామయ్య(సత్యరాజ్) అనే రైతు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె. అమెరికా, ఆస్ట్రేలియా, హైదరాబాద్లో వారు స్థిరపడిపోయింటారు. ఎవరి ఉద్యోగాల్లో వారు తీరిక లేకుండా గడుపుతుంటారు. 70ఏళ్లు పైబడిన రఘురామయ్యకు ఉపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. ఇంకా ఐదు వారాల్లో చనిపోతాడని డాక్టర్లు చెబుతారు. ఈ విషయం తెలుసుకున్న రఘురామయ్య కొడుకులు, కుమార్తె కుటుంబసమేతంగా తండ్రి దగ్గరకు వస్తారు. రఘురామయ్య చనిపోతే తదనంతర కార్యక్రమాలు చేసి తిరిగి వెళ్లిపోయేందుకు ఎదురుచూస్తుంటారు. కానీ రఘురామయ్య మనవడు సాయి(సాయితేజ)కి అది నచ్చదు. చివరి రోజుల్లో తాతను ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటాడు. తాత చావు కోసం ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులను ఎలా మార్చాడు, ఏంజిల్ ఆర్నాతో సాయికి ఉన్న సంబంధం ఏంటి? చివరి రఘురామయ్య ఏమయ్యాడు అనేదే ప్రతిరోజూ పండగే కథ.
ఎలా ఉందంటే?
ఇది పాత కథే. అందరికి తెలిసిన కథే. ప్రతి ఇంట్లో జరిగే కథే అంటూ తన కథను మొదలుపెట్టిన దర్శకుడు మారుతి... తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని, తాత మనవళ్ల మధ్య అనుబంధాన్ని తెరపై ఆవిష్కరించాడు. దర్శకరత్న దాసరి నారాయణరావు తీసిన తాత-మనవడు కథను గుర్తుచేస్తూ తన కథను అల్లుకుంటుపోయాడు. చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్న ఆత్రేయ మాటలను చూపించే ప్రయత్నం చేశాడు. ఓ వ్యక్తి చివరి దశలో ఉంటే అతడి కుటుంబం ఎలా ప్రవర్తించింది. దాని వెనుక కారణాలేంటో తెరపై కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రథమార్థం రావురమేశ్- సాయితేజల మధ్య తండ్రి కొడుకులపై ఉన్న ప్రేమను, సత్యరాజ్- సాయితేజల మధ్య తాత మనవళ్ల మధ్య అనుబంధాన్ని చక్కటి వినోదంతో సాగుతుంది. ఆ తర్వాతే రెండో భాగంలో అసలు కథ మొదలవుతుంది. తండ్రి చనిపోకముందే ఆయనకు సమాధులు కట్టడం, అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేయడం, తులసి నీళ్లు పోయడం వంటి అనాగరిక చర్యలకు పాల్పడుతుంటారు. వాటన్నింటి పిల్లల తప్పటడుగులుగా భావించిన తండ్రి.. ఓ నవ్వు నవ్వి ఊరుకుంటాడు. కానీ తాతంటే ఎంతో గౌరవమున్న మనవడు మాత్రం తమ తల్లిదండ్రులు చేసిన తప్పులను తెలియజేయడంతో ఈ కథను ముగించాడు. అయితే ఈ కథ ప్రస్తుత పరిస్థితులను అద్దంపడుతూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ద్వితియార్థం కథ సందేశాలిచ్చినట్లు కనిపించినా బయట జరుగుతుంది నూటికి నూరుపాళ్లు అదే అని చెప్పాలి. తల్లిదండ్రులను విడిచి విదేశాల్లో స్థిరపడిన కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడిన సందర్భాలు అనేకం చూశాం. పిల్లల మాటలకు నొచ్చుకొని తల్లిడిల్లిన తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. మెకానికల్ లైఫ్లో బతుకుతున్న వారందరికి కనువిప్పు కలిగేలా ఆద్యంతం ఆసక్తిగా ప్రతీరోజూ పండగే సాగుతుంది.
ఎవరెలా చేశారు?