రివ్యూ: రాజ్‌తరుణ్ 'పవర్‌ప్లే' ఎలా ఉందంటే? - రాజ్‌తరుణ్ పవర్‌ప్లే
ఇన్నాళ్లు ప్రేమకథలతో అలరించిన యువ కథానాయకుడు రాజ్ తరుణ్.. 'పవర్‌ప్లే' సినిమాతో సరికొత్త జోనర్‌తో ప్రేక్షకులను ముందుకొచ్చారు. తాను ఎంచుకున్న ఈ కొత్త పంథాలో విజయవంతమయ్యాడా? 'పవర్‌ప్లే' సినీఅభిమానులను అలరించిందా? అని తెలుసుకోవాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే!
మనసుకు హత్తుకునే ప్రేమకథలకు.. సరదాగా సాగిపోయే వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలుస్తుంటారు హీరో రాజ్‌తరుణ్, దర్శకుడు కొండా విజయ్ కుమార్. తొలినాళ్ల నుంచి ఇప్పటివరకూ ఈ ఇద్దరి సినీ ప్రయాణం ఇదే పంథాలో సాగింది. ఇప్పుడు 'పవర్ ప్లే'తో తొలిసారి థ్రిల్లర్ బాట పట్టారు. 'ఒరేయ్ బుజ్జిగా' వంటి వినోదాత్మక సినిమా తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న కొత్త చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లకు ఆదరణ దక్కడం వల్ల సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. సినీ ప్రియుల్ని ఏమేరకు థ్రిల్ చేసింది? రాజ్‌తరుణ్, విజయ్ కుమార్‌లకు ఎలాంటి ఫలితాన్ని రుచి చూపించింది?
కథేంటంటే?
విజయ్ కుమార్ కొండా (రాజ్‌తరుణ్) ఓ మధ్య తరగతి కుర్రాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతుంటాడు. స్వీటీ (హేమల్) అంటే చాలా ప్రేమ. ఆమెకీ తనంటే ఎంతో ఇష్టం. ఇద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కాలనుకుంటారు. కానీ, అబ్బాయికి ఉద్యోగం లేదన్న కారణంతో స్వీటీ తండ్రి పెళ్లికి అడ్డు చెబుతాడు. దీంతో విజయ్ తండ్రి తన ప్రభుత్వ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మంట్ ప్రకటించి.. ఆ జాబ్ తన కొడుక్కి వచ్చే ఏర్పాటు చేస్తాడు. దీంతో పెళ్లికి అన్ని అడ్డంకులు తొలగుతాయి.
ఇక ప్రేమించిన అమ్మాయితో కొత్త జీవితాన్ని ప్రారంభించడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో.. విజయ్ జీవితం అనుకోని చిక్కుల్లో పడుతుంది. తను చేయని నేరానికి జైలు పాలవుతాడు. ఒక్క రాత్రిలోనే అతని జీవితం తలకిందులై పోతుంది. సమాజం దృష్టిలో ఓ మోసగాడిగా నిలబడాల్సి వస్తుంది. ఓవైపు కుటుంబం రోడ్డున పడగా.. మరోవైపు ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుంది. మరి విజయ్‌ని అన్యాయంగా జైలు పాలు చేసిన ఆ వ్యక్తులెవరు? ఈ సమస్యల వల నుంచి అతనెలా బయటపడ్డాడు? మొత్తంగా ఈ కేసుకు ముఖ్యమంత్రి కూతురు పూర్ణకు ఉన్న లింకేంటి? అన్నది మిగతా కథ.
ఎలా ఉందంటే?
వాళ్లు చేసే తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి అధికారంలో ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకులు.. చట్టాల్ని, పోలీసు వ్యవస్థను ఎలా పావుగా వాడుకుంటారు? ఈ క్రమంలో సామాన్యుల్ని అన్యాయంగా ఎలా బలిచేస్తుంటారు? ఒకవేళ అలాంటి సామాన్యుడు తిరగబడితే ఎలా ఉంటుంది? అన్నది ఈ చిత్రంతో థ్రిల్లింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు విజయ్ కుమార్.
అయితే ఆలోచన బాగున్నా.. దాని చుట్టూ ఆకట్టుకునేలా కథ, కథనాలను అల్లుకోవడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డారు. ఆరంభంలో ఒక కారు యాక్సిడెంట్ జరగడం.. దాని వల్ల డ్రగ్స్ మాఫియాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి రావడం వంటి సన్నివేశాలతో సినిమాను ఆసక్తికరంగా మొదలుపెట్టారు దర్శకుడు. తర్వాత విజయ్ పాత్ర పరిచయం.. స్వీటీతో అతని ప్రేమ.. ఇంట్లో వాళ్లని పెళ్లికి ఒప్పించేందుకు తను చేసే ప్రయత్నాలతో నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే విజయ్, స్వీటీల మధ్య ఉన్న ప్రేమ అంత భావోద్వేగభరితంగా తీర్చిదిద్దినట్లు కనిపించదు. అదే సమయంలో విజయ్ అనుకోని విధంగా ఓ కేసులో జైలుకు వెళ్లడంతో కథ వేగం పుంజుకుంటుంది. తర్వాత అతను బెయిల్‌పై బయటకు రావడం.. కేసు నుంచి బయట పడేందుకు రకరకాలుగా ప్రయత్నించడం.. మరోవైపు విజయ్‌ని చంపడానికి ఓ వ్యక్తి ప్రయత్నిస్తుండటం.. వంటి సన్నివేశాలతో ప్రథమార్ధమంతా సాగిపోతుంటుంది.
అయితే దీంట్లో థ్రిల్లర్ చిత్రంలో ఉండాల్సినన్ని చిక్కుముళ్లు, ఆసక్తి రేకెత్తించే మలుపులు ఎక్కడా కనిపించవు. దీంతో ప్రేక్షకులకు ఓ మామూలు కమర్షియల్ సినిమా చూస్తున్న అనుభూతే కలుగుతుంది తప్ప.. ఏమాత్రం థ్రిల్లింగ్ దొరకదు. ఇక విరామ సమయానికి ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, అక్కడ ఇచ్చే ట్విస్ట్ ఆసక్తిగా అనిపించదు.
ద్వితీయార్ధంలో ముఖ్యమంత్రి కూతురిగా పూర్ణ పాత్ర రంగంలోకి దిగడం వల్ల కథలో కాస్త ఊపొచ్చినట్లు కనిపిస్తుంది. కానీ, ఇక్కడి నుంచే కథ పూర్తిగా గాడి తప్పింది. పూర్ణ పాత్రలో ప్రతినాయిక ఛాయలను చూపించడానికి దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు మరీ పేలవంగా అనిపిస్తాయి. ముఖ్యంగా విజయ్ కేసుకు, ఆమె నేపథ్యానికి లింక్ పెడుతూ దర్శకుడు రాసుకున్న విధానం లాజిక్‌గా అనిపించదు.
ఇక కేసు నుంచి బయట పడేందుకు విజయ్ చేసే ప్రయత్నాలు.. దాని వెనకున్న వ్యక్తుల్ని బయటకు లాగేందుకు అతనేసే ఎత్తుగడలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంటాయి. మధ్యలో ప్రిన్స్, పూర్ణల మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ కాస్త కనులవిందుగా అనిపిస్తుంది. ఇక దర్శకుడు సినిమాను ముగించిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది.
'పవర్ ప్లే' సినిమా పోస్టర్
ఎవరెలా చేశారంటే?
మధ్యతరగతి యువకుడిగా విజయ్ పాత్రలో రాజ్‌తరుణ్ చక్కగా ఒదిగిపోయారు. కథకు తగ్గట్లుగా ఆద్యంతం సీరియస్ లుక్‌లో కనిపిస్తూ.. తన పని తాను చేసుకుపోయాడు. హేమల్ పాత్ర పరిధి తక్కువే అయినా ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. పూర్ణ ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో ఆకట్టుకున్నా.. ఆమె పాత్రను ఆసక్తికరంగా తీర్చదిద్దడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యారు.
కోటా శ్రీనివాస్ కనిపించేది కొన్ని సన్నివేశాల్లో అయినా తనదైన నటనతో మెప్పిస్తారు. మధునందన్, అజయ్, రవి వర్మ తదితరులంతా పాత్రల పరిధి మేర నటించారు. థ్రిల్లర్ చిత్రానికి తగ్గట్లుగా కథ సిద్ధం చేసుకోవడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యారు. నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి. సురేశ్ బొబ్బిలి నేపథ్య సంగీతం చిత్రానికి బలాన్నిచ్చింది.