చిత్రం: నూటొక్క జిల్లాల అందగాడు
నటీనటులు: అవసరాల శ్రీనివాస్, రుహాని శర్మ, రోహిణి, శివన్నారాయణ, తదితరులు
కథ, రచయిత: అవసరాల శ్రీనివాస్
నిర్మాత: శిరీష్ రాజీవ్ రెడ్డి, సాయిబాబు
బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్,
సమర్పణ: దిల్‌రాజు, క్రిష్
దర్శకుడు: రాచకొండ విద్యాసాగర్
విడుదల తేదీ: 03-09-2021
దర్శకుడు క్రిష్.. నిర్మాత దిల్‌రాజు.. ఆల్‌రౌండర్ అవసరాల శ్రీనివాస్.. వీళ్లంతా కలిసి చేసిన చిత్రం కావడం వల్ల 'నూటొక్క జిల్లాల అందగాడు'(nootokka jillala andagadu review) ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించింది. బట్టతల సమస్య ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకుల్లో మరింత ఆత్రుతని రేకెత్తించాయి. మరి చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం పదండి..
కథేంటంటే?
గొత్తి సత్యనారాయణ అలియాస్ జి.ఎస్.ఎన్ (అవసరాల శ్రీనివాస్)(avasarala srinivas) ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. వంశ పారంపర్యంగా వచ్చిన బట్టతలతో సతమతమవుతూ ఉంటాడు. జుట్టు లేని తన తలని బయటికి చూపించడానికి ఇబ్బంది పడుతూ.. విగ్గు, టోపీ పెట్టుకుని మేనేజ్ చేస్తూ ఉంటాడు. జి.ఎస్.ఎన్ పనిచేస్తున్న చోటే ఉద్యోగంలో చేరుతుంది అంజలి (రుహాని శర్మ). కొన్నాళ్లకు ఇద్దరి మధ్య మాటలు కలుస్తాయి. ఆ తర్వాత వాళ్ల మనసులూ కలుస్తాయి. అయినా జి.ఎస్.ఎన్. తన బట్టతల గురించి చెప్పడు. ఒక సందర్భంలో బట్టతల రహస్యం అంజలికి తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది?ఆ ఇద్దరి ప్రేమకథ కంచికి చేరిందా లేదా? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే?
"చాలా మంది కథ. చాలా మంచి కథ" అంటూ ప్రచారం చేసింది చిత్రబృందం. నిజంగానే ఇది చాలా మంది కథ. ఈ కథతో చెప్పిన మంచి కూడా చాలా ఉంది. కానీ, ఆ కథని చెప్పిన విధానంలోనే కొత్తదనం ఏమీ కనిపించలేదు. తాను అందంగా లేనని భావించే కొద్దిమంది వ్యక్తుల్లో అభద్రతాభావం, ఆత్మన్యూనత భావం ఎలా ఉంటుందనే విషయాన్ని చర్చించిన విధానం.. బయట వ్యక్తులకు కాకుండా ముందు మనకు మనం నచ్చితే అప్పుడు అందగాడు, ఆనందగాడు అవుతామనే విషయాన్ని చెప్పిన తీరు బాగుంది. అయితే కథానాయకుడితోనూ, అతని సమస్యతోనూ కనెక్ట్ అయ్యేంత సంఘర్షణ కానీ, భావోద్వేగాలు కానీ ఈ స్క్రిప్టులో పండకపోవడం మైనస్‌గా మారింది. హాస్యం విషయంలో తీసుకున్న శ్రద్ధ మాత్రం ఉపశమనాన్నిస్తుంది. కథలో పెద్దగా డ్రామా పండకపోయినా, సందర్భానుసారం మాటలతో మేజిక్ చేస్తూ, నవ్విస్తూ సన్నివేశాల్ని అల్లిన తీరు మెప్పిస్తుంది. కథానాయికకి తెలుగు రాదంటూ హీరో, అతని ఫ్రెండ్ మాటల్ని పాట రూపంలో చెప్పుకోవడం మొదలుకొని చిన్ననాటి ఫ్రెండ్ సత్తిపండు చేసే సందడి వరకు చాలా సన్నివేశాలు నవ్విస్తాయి. విరామ సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ద్వితీయార్ధంలో కథ, కథనాలు ముందుకు సాగకపోయినా నాయకానాయికల తల్లిదండ్రుల పాత్రలు.. ఆ నేపథ్యంలో పండే డ్రామా, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. పతాక సన్నివేశాలు ఊహకు తగ్గట్టే సాగుతాయి.
ఎవరెలా చేశారంటే?
నాయకానాయికల పాత్రలు సినిమాకు కీలకం. అవసరాల శ్రీనివాస్.. గొత్తి సత్యనారాయణ పాత్రలో ఒదిగిపోయారు. అభద్రతాభావంతో సతమతమయ్యే యువకుడిగా చక్కటి అభినయం ప్రదర్శించారు. పాత్ర కోసం ఆయన చాలా శ్రద్ధ తీసుకున్నారన్న విషయం అడుగడుగునా కనిపిస్తుంది. కథానాయిక రుహానీ అభినయం కూడా మెప్పిస్తుంది. ఆమె పాత్రలో లీనమై సహజంగా నటించింది. రోహిణి పాత్ర పరిధి తక్కువే అయినా ఆమె పాత్రతో కొన్ని భావోద్వేగాలు పండాయి. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతం ఆకట్టుకుంటుంది. రామ్ కెమెరా పనితనం, కిరణ్ గంటి కూర్పు విభాగాలు చక్కటి పనితీరుని కనబరిచాయి. అవసరాల శ్రీనివాస్ నటుడిగానే కాకుండా.. రచయితగా కూడా తనదైన ప్రభావం చూపించారు. ఆయన కథ, మాటలు సినిమాపై ప్రభావం చూపించాయి. దర్శకుడు విద్యాసాగర్ కథని చాలా ఫ్లాట్‌గా ముందుకు నడిపించారు. కథనం, భావోద్వేగాల పరంగా ఆయన పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు.
బలాలు
అవసరాల, రుహానీ
హాస్యం
ప్రథమార్ధం
బలహీనతలు
భావోద్వేగాలు
కథనం
చివరిగా:ఈ అందగాడు అక్కడక్కడా నవ్విస్తాడు.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!