సొంత నిర్మాణ సంస్థలో వరుసపెట్టి సినిమాలు తీస్తోన్న యువహీరో నాగశౌర్య. ఐరా క్రియేషన్‌లో 'ఛలో'తో ఘన విజయాన్ని అందుకున్న ఇతడు.. రెండో సినిమా 'నర్తనశాల'తో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నాడు. ఆ తప్పు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో తానే ఈసారి పెన్ను పట్టి, తన స్నేహితుడి చెల్లికి జరిగిన ఓ సంఘటన నేపథ్యంగా ఏడాదిన్నరపాటు శ్రమించి 'అశ్వథ్థామ' కథను సిద్ధం చేసుకున్నాడు. ఆ కథపై నమ్మకంతో.. సినిమా పేరును గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అంతలా గుండెలపై రాసుకున్న 'అశ్వథ్థామ'లో ఏముందో ఈటీవీ భారత్ సమీక్షలో తెలుసుకుందాం.
కథేంటంటే
అమెరికా నుంచి గణ(నాగశౌర్య) తన చెల్లెలి పెళ్లి కోసం హైదరాబాద్ వస్తాడు. నిశ్చితార్థం ఘనంగా జరిపిస్తారు. ఇక పెళ్లి అనేలోపు గణ చెల్లెలు ఆత్మహత్య యత్నం చేసుకుంటుంది. తన చెల్లెలు అలా ఎందుకు చేసిందో తెలుసుకున్న గణ.. అందుకు కారణమైన వారెవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో తన చెల్లెలిలాగే చాలా మంది అమ్మాయిలు మోసపోయారని, కానీ మోసం చేస్తుంది ఎవరో తెలియదని ప్రేయసి నేహా(మెహరీన్ )కు వివరిస్తాడు. ఆ రాక్షసున్ని పట్టుకునేందుకు అన్వేషిస్తుంటాడు. చివరకు అసలు వ్యక్తి ఎవరనేది కనిపెట్టిన గణ ఏం చేశాడు? తన చెల్లిని ఎలా సంతోషంగా ఉంచాడనేది అశ్వథ్థామ కథ.
ఎలా ఉందంటే
ఇదొక క్రైమ్ థ్రిల్లర్. ఇటీవలే 'రాక్షసుడు' లాంటి సినిమాను చూసిన ఆడియెన్స్.. సైకో కిల్లర్స్ ఎంత భయంకరంగా ఉంటారో తెరపై చూసి నివ్వరపోయారు. అలాంటి కోవకే చెందిన మరో కథే అశ్వథ్థామ. సమాజంలో అమ్మాయిలపై జరుగుతోన్న లైంగిక నేరాల్లో మరో కోణాన్ని ఆవిష్కరించిందీ చిత్రం. మానవ మృగాల బారినపడి ఒక అమ్మాయి తనకే తెలియకుండా గర్భవతి అవడం, ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేక ఆత్మహత్యకు పాల్పడటం వంటి సంఘటనలు దేశంలో అనేక చోట్ల జరుగుతున్నాయి. ఆయా పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులుగానే మిగిలిపోయి తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగుల్చుతున్నాయి. అలాంటి ఓ యథార్థ సంఘటన నేపథ్యంగా కథ రాసుకున్న నాగశౌర్య... తెరపై మానవ మృగాలు ఎలా ఉంటారో చూపించాడు. మాన, ప్రాణాల పట్ల అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలో వివరించే ప్రయత్నం చేశాడు. ప్రథమార్థంలో చెల్లెలికి జరిగిన అన్యాయం.. దానికి కారకులను వెతికిపట్టుకునే ప్రయత్నంతో సాగుతుంది. ద్వితీయార్థానికి వచ్చేసరికి అమ్మాయిలను మోసం చేస్తుంది ఎవరో రివీల్ చేసిన దర్శకుడు.. విలన్ ఆచూకీ కనిపెట్టి అతన్ని మట్టు పెట్టడంతో కథను క్లైమాక్స్‌కు చేర్చాడు. అయితే ఇటీవల నాగశౌర్య డైరెక్ట్ చేసిన భూమి లఘు చిత్రంలోని పాయింట్‌ను ఈ కథకు జోడించి ప్రేక్షకులను అశ్వథ్థాముడిగా ప్రశ్నించడం కొసమెరుపు.
ఎవరెలా చేశారు