'పెళ్లిచూపులు'తో విజయ్ దేవరకొండని కథానాయకుడిగా నిలబెట్టాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇప్పుడేమో తరుణ్ భాస్కర్‌ని కథానాయకుడిగా మార్చేశాడు విజయ్ దేవరకొండ. తన సొంత నిర్మాణ సంస్థ 'కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్' పతాకంపై 'మీకు మాత్రమే చెప్తా' నిర్మించాడు విజయ్. ఈ చిత్రంతో తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా, షమీర్ సుల్తాన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆసక్తిపెంచిన ఈ కలయికలో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే..
రాకేష్(తరుణ్ భాస్కర్), కామేష్ (అభినవ్ గౌతమ్) స్నేహితులు. వీడియో జాకీలుగా పనిచేస్తుంటారు. పనిచేస్తున్న ఛానల్‌కు టీఆర్పీ రేటింగ్ రావాలని విచిత్రమైన వీడియోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే రాకేష్ ఒక దర్శకుడి మాట నమ్మి హనీమూన్ నేపథ్యంలో సాగే 'మత్తు వదలరా, నిద్దుర మత్తు వదలరా' అనే వీడియో చేస్తాడు. డాక్టర్ అయిన స్టెఫీ (వాణి భోజన్)తో ప్రేమలో పడిన రాకేష్ ఆమెతో పెళ్లికి సిద్ధమవుతాడు. కొన్ని గంటల్లో పెళ్లి అనగా 'మత్తు వదలరా' వీడియో బయటికొస్తుంది. అది వైరల్‌గా మారుతుంది. తాను మంచి వాడినని, ఎటువంటి అలవాట్లు లేవని స్టెఫీకి చెప్పి పెళ్లికి ఒప్పించిన రాకేష్‌కు ఆ వీడియో ఎలాంటి చిక్కులు తెచ్చిపెట్టింది? నిజం చెప్పలేక, ఆ వీడియోని తొలగించలేక ఎటువంటి సమస్యల్ని ఎదుర్కొన్నాడు? ఇంతకీ రాకేష్, స్టెఫీలకి పెళ్లి అయ్యిందా లేదా? వీళ్ల కథతో సంయుక్త(అనసూయ)కి సంబంధమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
చిన్న కథ ఇది. కథ కంటే కూడా సందర్భాల్ని ఆసరాగా చేసుకుని సన్నివేశాల్ని అల్లుకున్నాడు దర్శకుడు. దానిలో నుంచే హాస్యం పుట్టించడంలో సఫలమయ్యాడు. దాంతో సినిమా అంతా సరదాగా సాగుతుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి కొనసాగుతూ ఉంటుంది. అదే ఈ సినిమా ప్రత్యేకత. నా స్నేహితుడి జీవితంలో జరిగిన కథంటూ కామేష్ ఈ కథ చెప్పడంతో సినిమా మొదలవుతుంది. ఏ కథయినా ముందు ప్రేమతోనే మొదలవుతుందంటూ రాకేష్-స్టెఫీల ప్రేమకథని చూపెడతారు. అయితే, ఆ ప్రేమకథలో బలం లేదు. వీడియో బయటికి రావడం నుంచే కథ పరుగులు పెడుతుంది. పెళ్లిలో వెజ్ పెట్టాలా, నాన్ వెజ్ పెట్టాలా అనే గొడవలు.. నిజాలు దాస్తున్నావా అని ప్రేయసి పదే పదే అడిగే తీరు, ఆ క్రమంలో కథానాయకుడు పడే ఒత్తిడి హాస్యాన్ని పంచడంతో పాటు, ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రథమార్థం వరకు సినిమాని చాలా బాగా నడిపించాడు. ద్వితీయార్థంలోనే ఆసక్తి కొరవడుతుంది. కథలో ఊహించని మలుపులేమీ కనిపించవు. పతాక సన్నివేశాల్లో మలుపు ఉన్నప్పటికీ అది అంతా అప్పటిదాకా ఉన్న ఫీల్‌ని మాయం చేస్తుందే తప్ప, దానివల్ల సినిమాకి ఉపయోగమేమీ అనిపించదు. దర్శకుడికి కామెడీలో మంచి పట్టుందని ఈ సినిమా నిరూపిస్తుంది. దర్శకుడు, తరుణ్ భాస్కర్ కలిసి రాసిన సంభాషణలు సినిమాకి హైలెట్‌గా నిలిచాయి. ఎప్పుడూ వినిపించే మాటలే అయినా.. వాటిని సినిమాలో చాలా బాగా ఉపయోగించారు.
ఎవరెలా చేశారంటే..
తరుణ్‌భాస్కర్‌ని కథానాయకుడిని చేయడానికే నేను పరిశ్రమకొచ్చానని ఒకట్రెండు సందర్భాల్లో చెప్పాడు విజయ్ దేవరకొండ. ఆ మాట ఎందుకన్నాడో తరుణ్ నటనని చూస్తే అర్థమవుతుంది. చాలా సహజంగా నటించాడీ దర్శక హీరో. కామేష్ పాత్రలో అభినవ్ గౌతమ్ నటన చిత్రానికి ప్రధాన బలం. స్టెఫీ పాత్రలో వాణీ, కామేష్ లవర్‌గా పావని గంగిరెడ్డి పాత్రల పరిధి మేరకు నటించారు. మిగతా నటులంతా కొత్తవాళ్లే. వాళ్లంతా పాత్రల్లో ఒదిగిపోయారు. సంయుక్తగా అనసూయ తళుక్కున మెరిసింది. ఆమె స్థాయికి తగ్గ పాత్రయితే కాదు. సాంకేతికంగా సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. విజయ్ దేవరకొండ చాలా పరిమిత వ్యయాన్ని కేటాయించినట్టున్నాడు. దాంతో నిర్మాణ విలువలు సాధారణంగా అనిపిస్తాయి. శివకుమార్ సంగీతం, మదన్ గుణదేవా ఛాయాగ్రహణం సినిమా స్థాయిలో ఉన్నాయి. దర్శకుడు షమీర్ సుల్తాన్ చిన్న కథనే ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో సఫలమయ్యాడు.