చిత్రం: మంచి రోజులు వచ్చాయి
నటీనటులు:సంతోష్ శోభన్, మెహ్రీన్, వెన్నెల కిషోర్, సప్తగిరి, వైవా హర్ష, అజయ్ ఘోష్, ప్రవీణ్ తదితరులు
సంగీతం:అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ:సాయి శ్రీరామ్
ఎడిటింగ్:ఎస్‌బీ ఉద్ధవ్
ఆర్ట్:రామ్ కుమార్
నిర్మాత:వి సెల్యులాయిడ్, ఎస్‌కేఎన్
బ్యానర్:యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్
విడుదల:04-11-2021
మారుతి సినిమా అనగానే నవ్వులు గ్యారెంటీ అనే ఓ భరోసా. కామెడీ విషయంలో ఆయనకంటూ ఓ బ్రాండ్ ఉంది. అగ్ర తారలతో కూడా సినిమాలు తీసి నవ్వించారు. వీలు చిక్కినప్పుడు చిన్న సినిమాలూ చేస్తుంటారు. ఒక పక్క గోపీచంద్‌తో 'పక్కా కమర్షియల్' చేస్తూనే కరోనాతో వచ్చిన విరామంలో ఆయన ఓ చిన్న సినిమా చేశారు. అదే.. 'మంచి రోజులు వచ్చాయి'(Manchi Rojulu vchayi review). దీపావళి పండగ సందర్భంగా.. మంచి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఇంతకీ 'మంచి రోజులు'(Manchi Rojulu vchayi review) ఎవరికి వచ్చాయి?
కథేంటంటే?
తిరుమలశెట్టి గోపాల్ అలియాస్ గుండు గోపాల్ (అజయ్ ఘోష్ Ajay Ghosh)కు తన కూతురు పద్దు అలియాస్ పద్మ (మెహ్రీన్) అంటే ప్రాణం. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే తన కూతురుపై ఎంతో నమ్మకం. కానీ, ఆమె తన సహోద్యోగి అయిన సంతోష్(సంతోష్ శోభన్)కి మనసిస్తుంది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉంటారు. ఎప్పుడూ సంతోషంగా కనిపించే గోపాల్‌ను చూసి అసూయ పడిన ఇద్దరు పక్కింటి వ్యక్తులు ఆయనలో లేనిపోని భయాల్ని సృష్టిస్తారు. దాంతో గోపాల్ తన కూతురు విషయంలో ఆందోళన చెందడం మొదలుపెడతాడు. దానికితోడు కరోనా భయం కూడా తోడవుతుంది. ఇన్ని చిక్కుల మధ్య సంతోష్, పద్దుల ప్రేమాయణం ఎలా సాగింది? గోపాల్ భయాల్ని ఈ జంట ఎలా దూరం చేసింది? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
'భలే భలే మగాడివోయ్' సినిమాలో మతిమరుపు చుట్టూ కథని నడిపాడు మారుతి. 'మహానుభావుడు'లో అతిశుభ్రత అనే అంశం కనిపిస్తుంది. ఇక్కడ భయం అనే అంశాన్ని తీసుకున్నారు. కథగా చూస్తే ఇందులో చెప్పుకోదగినంత సంక్లిష్టత ఏమీ కనిపించదు. కథ కంటే కూడా సందర్భాల్నే కీలకంగా మలుచుకుని సన్నివేశాల్ని అల్లారు దర్శకుడు. ఎప్పటికప్పుడు కొత్త సందర్భాన్ని, కొత్త పాత్రల్ని తెరపైకి తీసుకొచ్చి లాజిక్‌ని పక్కనపెట్టి ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశారు. చాలా చోట్ల ఆ ప్రయత్నం విజయవంతమైంది. అజయ్ ఘోష్ మనసులో తన కూతురు ప్రేమలో పడిందనే ఆందోళన మొదలయ్యాకే ఈ కథ పట్టాలెక్కుతుంది. అజయ్ ఘోష్ భార్య చేసే కొత్త వంటల ప్రయోగాలు మొదలుకొని అప్పడాల విజయలక్ష్మి ఫోన్ సంభాషణ, డాక్టర్‌గా వెన్నెల కిషోర్(Vennela Kishore) ఫ్రస్ట్రేషన్, అంబులెన్స్‌తో సప్తగిరి(Sapthagiri) చేసే హంగామా.. ఇలా ఎప్పటికప్పుడు నవ్వించే ప్రయత్నం చేశారు. ఇది కరోనా చుట్టూ సాగే సినిమాగా ప్రచారమైనా.. ఆ అంశానికి పెద్దగా ప్రాధాన్యం లేదు.
కరోనాతో కొత్త భయం పుట్టించినా.. ఆ సన్నివేశాలు సాగదీతగానే అనిపిస్తాయి తప్ప వాటితో సినిమాకి పెద్దగా ఫన్ పండలేదు. కథ పరిధి తక్కువ కావడం వల్ల కొన్ని చోట్ల సన్నివేశాలు రిపీటెడ్‌గా, ద్వితీయార్ధంలో అయితే చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి ఎక్కడా కలగదు. కానీ సందర్భానుసారం నవ్వించడంలో మాత్రం మారుతి విజయవంతమయ్యాడు. ఆయన మార్క్ అడల్ట్ కామెడీ ఇందులోనూ ఉంది, కానీ అది ఇబ్బందికరం అనిపించేంత స్థాయిలో లేకుండా సన్నివేశాల్ని అల్లారు. భయం గురించి సాగిన చర్చ, సందేశం ఆలోచన రేకెత్తించేలా ఉన్నా.. ప్రస్తుత పరిస్థితులకి మనం చూస్తున్న చాలా మంది జీవితాలకి అద్దం పట్టేలా ఉన్నా.. కథ విషయంలో చేసిన కసరత్తులే చాలలేదనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
అజయ్ ఘోష్ పాత్రే ఈ సినిమాకి కేంద్ర బిందువు. ఆయన చుట్టూనే సింహభాగం సన్నివేశాలు సాగుతాయి. అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా తనవైన హావభావాలు, మాటల్లో విరుపుతో నవ్వించారాయన. ఆయన ఫ్రెండ్స్ పాత్రలు కూడా కీలకం. కానీ వాళ్లు చెప్పే మాటలు, ఆ నేపథ్యంలో సన్నివేశాలు రిపీటెడ్‌గా అనిపిస్తాయి. సంతోష్, మెహ్రీన్ జోడీ ఆకట్టుకుంటుంది. పాటలతోనూ అలరించారు. వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్ష, సప్తగిరి, రజిత తదితరులు అంచనాల మేరకు నవ్వించారు. సాంకేతిక విభాగంలో అనూప్ సంగీతం, సాయిశ్రీరామ్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. పరిమిత వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా స్థాయికి తగ్గట్టుగా నిర్మాణం పరంగా జాగ్రత్తలు తీసుకున్నారు. దర్శకుడు మారుతి తక్కువ వ్యవధిలో ఈ సినిమాని తీశారు. నవ్వించాలనే ఆయన ప్రయత్నం కొంతవరకు నెరవేరినట్టే.
బలాలు
+ కామెడీ సన్నివేశాలు
+ భయం విషయంలో సందేశం
+ అజయ్ ఘోష్... నాయకానాయికల జోడీ
బలహీనతలు
- కథ
- ద్వితీయార్ధం సాగదీత
చివరిగా: 'మంచి రోజులు వచ్చాయి'(Manchi Rojulochaie) నవ్విస్తుంది.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!