తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రివ్యూ: గెలుపును పంచేవాడే 'మహర్షి' - మహేశ్​బాబు 25వ చిత్రం

నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మహర్షి' అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. మూడు విభిన్న పాత్రలో కనువిందు చేశాడు సూపర్​స్టార్. మరోసారి తన నటనతో అలరించాడు అల్లరి నరేశ్.

గెలుపును పంచేవాడే ఈ 'మహర్షి'

By

Published : May 9, 2019, 3:20 PM IST

"శ్రీమంతుడు", "భరత్ అనే నేను" విజయాల తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన మహేశ్​బాబు చిత్రం 'మహర్షి'. తన 25వ చిత్రం కావడం కంటే కథలో బలమైన సందేశముందని చెప్పుకొచ్చాడీ హీరో. దర్శక నిర్మాతలు 18 నెలలపాటు శ్రమించి ఈ సినిమాను తెరకెక్కించారు. మహేశ్ కెరీర్​లో మరో మైలురాయి అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కథేంటీ..?
'సక్సెస్ కు కామాలే తప్ప పుల్ స్టాప్ లు ఉండవు' అని విశ్వసించే రిషి కుమార్(మహేశ్ బాబు) జీవిత ప్రయాణమే ఈ సినిమా కథ. సివిల్స్ చదవాలన్న తండ్రి కోరికకు భిన్నంగా విశాఖపట్నం ఐఐఈటీలో ఇంజినీరింగ్ పూర్తి చేస్తాడు. అమెరికాలోని అర్జిన్ (ORGIN) సాప్ట్ వేర్ కంపెనీకి సీఈఓ అవుతాడు. అదే తన సక్సెస్ అని భావిస్తుంటాడు. కానీ ఇంజినీరింగ్ కళాశాలలో తన స్నేహితుడు రవి(అల్లరి నరేశ్) చేసిన త్యాగం వల్లే ఆ విజయం తనకు లభించిందని తెలుసుకుంటాడు. హుటాహుటిన అమెరికా నుంచి భారత్​కు వచ్చిన రిషి... రామవరంలో ఉన్న స్నేహితుడిని కలుసుకుంటాడు. తనతోపాటు చదువుకున్న రవి.. గ్రామంలోనే ఎందుకు ఉండిపోవాల్సి వచ్చిందో తెలుసుకుంటాడు. స్నేహితుడికి ఎదురైన సమస్యను పరిష్కరించి నిజమైన గెలుపును ఎలా అందుకున్నాడనేదే 'మహర్షి' కథ.

మహర్షి సినిమాలోని స్టిల్

ఎలా ఉందంటే
'మహర్షి' కథ కేవలం రిషి అనే యువకుడి ప్రయాణం మాత్రమే కాదు. ఆ ప్రయాణానికి రైతు జీవితాలను ముడిపెట్టి అల్లిన చక్కటి కథ. ప్రథమార్థం రిషి ఇంజినీరింగ్ చదువు, కళాశాలలో రవి, రిషిల స్నేహం, రిషితో పూజ(పూజా హెగ్డే) ప్రేమ వ్యవహారం, సాప్ట్ వేర్ కంపెనీకి సీఈఓగా ఎదిగిన తీరుతో నెమ్మదిగా సాగుతోంది.

ద్వితీయార్థానికి వచ్చేసరికి రిషి ప్రయాణం కొత్త మలుపు తిరుగుతుంది. రవి గ్రామమైన రామవరంలోనే మూలకథ అంతా సాగుతుంది. సీఈఓ ఉద్యోగానికి రాజీనామా చేసి రిషి రైతుగా మారడం, రామవరం రైతులతో నయా వ్యవసాయం చేయించడం, గ్యాస్ పైపులైన్ ప్రాజెక్టు కోసం వివేక్ మిట్టల్ అనే కార్పొరేట్ వ్యాపారి కుట్రను అడ్డుకోవడం... సినిమాలో ప్రధానంగా నిలుస్తాయి.

రైతు పాత్రలో ప్రిన్స్ మహేశ్​బాబు

రైతులపై సానుభూతి చూపించకుండా రైతులను గౌరవించాలని రిషి చెప్పడం బాగుంది. రైతులకు, వ్యవసాయానికి మధ్య అనుబంధాన్ని పతాక సన్నివేశాల్లో మహేశ్ బాబు మాటల్లో చక్కగా విశ్లేషించారు. విందులు, వినోదాల పేరుతో వారాంతాల్లో కాలాన్ని, డబ్బును వృథా చేయడం కంటే రైతులకు అండగా ఉందామంటూ పిలుపునివ్వడం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. పతాక సన్నివేశాల్లో రైతులు... మహేశ్ కు మట్టిని బహుమతిగా ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఎవరెలా చేశారు..?
25వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని... మరో బలమైన సబ్జెక్ట్​ ను ఎంచుకున్నాడు మహేశ్​బాబు. రిషిగా మూడు కోణాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. చురుకైన విద్యార్థిగా , హుందాతనం ఉన్న సీఈఓగా, రైతుల కోసం పోరాడే యువకుడిగా నటించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు.

మహర్షి సినిమాలోని స్టిల్

మహర్షిలో కీలకమైన రవి పాత్ర.. అల్లరి నరేశ్​లోని నటుడ్ని మరోసారి బయటపెట్టింది. కథానాయిక పూజా హెగ్డే పరిమితి మేరకు నటించింది. రిషి తల్లిదండ్రుల పాత్రలో ప్రకాశ్ రాజ్, జయసుధల నటన, ప్రొఫెసర్ గా రావు రమేశ్, కార్పొరేట్ వ్యాపారిగా జగపతిబాబు, ఎంపీగా పోసాని కృష్ణమురళి పాత్రలు రిషి ప్రయాణంలో కీలకంగా నిలుస్తాయి.

దర్శకుడిగా మహర్షి కథపై రెండేళ్లపాటు శ్రమించిన వంశీపైడిపల్లి... ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆ కథను వివరించడంలో సఫలీకృతుడయ్యాడనే చెప్పాలి. శ్రీమణి అందించిన సాహిత్యం కథకు అద్దంపడుతుంది.

బ‌లాలు
+ కథాంశం
+ మ‌హేశ్ బాబు
+ నిర్మాణ విలువ‌లు
+ కాలేజీ స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు
- నిడివి
- క‌థ‌లో మితిమీరిన అంశాలు

చివ‌రగా... మ‌హ‌ర్షి.. ఓ మంచి క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌య‌త్నం!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details