తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Movie Review: 'క్షీర సాగరాన్ని' ఇంకా మథిస్తే..! - అనిల్​ పంగులూరి

సాఫ్ట్​వేర్​ రంగం నుంచి సినీ పరిశ్రమలో దర్శకుడిగా అడుగుపెట్టిన అనిల్ పంగులూరి రూపొందిన తొలి చిత్రం 'క్షీరసాగర మథనం'. శుక్రవారం(ఆగస్టు 6) ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? దర్శకుడిగా తొలి చిత్రంతో అనిల్​ విజయాన్ని అందుకున్నారా? తెలియాలంటే ఈ సమీక్ష చదివేయండి.

Ksheera Sagara Madhanam Movie Review
రివ్యూ: 'క్షీర సాగర మథనం'తో అమృతం లభించినదా?

By

Published : Aug 6, 2021, 5:46 PM IST

చిత్రం:క్షీరసాగర మథనం;

నటీనటులు:మానస్ నాగులపల్లి, సంజయ్ కుమార్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్ కొమ్ముల, ప్రదీప్ రుద్ర, అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్;

సంగీతం:అజయ్ అరసాడ;

ఛాయాగ్రహణం:సంతోష శానమోని;

కూర్పు:వంశీ అట్లూరి;

నిర్మాణం:ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్;

రచన-దర్శకత్వం:అనిల్ పంగులూరి;

విడుదల తేది:2021 ఆగస్టు 06.

'క్షీర సాగర మథనం' సినిమా పోస్టర్​

సంసారాన్ని సాగరంతో పోలుస్తారు. సంసారాన్ని ఈదటమంటే సాగరాన్ని దాటినంత పని. అలాంటిదే సినిమా కూడా. సినిమాపై పిచ్చి, అభిరుచి, ప్రేమ.. పేరేదైనా కావచ్చు.. వివిధ రంగాల నుంచి ఎన్నో ఆశలతో యువత ఈ రంగంలో అడుగుపెడుతుంది. అలాంటి ఆశతోనే సాప్ట్​వేర్ రంగం నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు ఒంగోలు యువకుడు అనిల్ పంగులూరి. పలు సాప్ట్​వేర్ సంస్థల్లో పనిచేస్తున్న 20 మంది మిత్రుల సహకారంతో తొలి ప్రయత్నంగా 'క్షీర సాగర మథనం' చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో అవాంతరాలను దాటుకుంటూ ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? సినిమా సంద్రాన్ని చిలికిన అనిల్ విజయాన్ని అందుకున్నాడా లేదా? తెలుసుకుందాం.

'క్షీర సాగర మథనం' సినిమా పోస్టర్​

కథేంటంటే?

ఒక వ్యక్తి ఐదుగురు సాప్ట్​వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని పన్నిన కుట్ర ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? చివరకు ఆ కుట్ర నుంచి ఆ ఉద్యోగులు ఎలా బయటపడ్డారు? అనేది సంక్షిప్తంగా 'క్షీరసాగర మథనం' కథ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్​కు చెందిన క్యూ హబ్ సాప్ట్​వేర్ కంపెనీలో ఓంకార్(సంజయ్ కుమార్), గోవింద్ (గౌతమ్ శెట్టి), యోగేశ్(ప్రియాంత్), భరత్(మహేశ్ కొమ్ముల)లు ఇంజినీర్లుగా పనిచేస్తుంటారు. గూగుల్​కు పోటీగా ఇమేజ్ సెర్చ్ఇంజిన్ ప్రాజెక్టును తయారు చేయాలన్నది వీరి లక్ష్యం. ఈ నలుగురిని రిషి(మానస్ నాగులపల్లి) రోజూ తన క్యాబ్​లో 'క్యూ హబ్​'లో డ్రాప్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు మత్తు పదార్థాలను సరఫరా చేస్తూ సంజయ్ పోలీసులకు చిక్కుతాడు. స్నేహితుడ్ని కాపాడేందుకు వచ్చిన మిగతా నలుగురు ప్రమాదంలో పడతారు. ఆ ప్రమాదం ఎవరి నుంచి ఎదురైంది? అందులో నుంచి ఈ ఐదుగురు ఎలా బయటపడ్డారు? క్యాబ్ డ్రైవర్​గా పనిచేసే మానస్​కు అమెరికా నుంచి వచ్చిన సాప్ట్​వేర్ అమ్మాయి విశిత(అక్షత సోనావని)తో ఉన్న సంబంధం ఏమిటీ? అనేదే 'క్షీర సాగర మథనం' కథ.

'క్షీర సాగర మథనం' సినిమా పోస్టర్​

ఎలా ఉందంటే?

సాప్ట్​వేర్ ఉద్యోగుల జీవితాలకు అద్దంపట్టే కథ ఈ చిత్రం. సాప్ట్​వేర్ రంగంలో ఉద్యోగాలు, ప్రాజెక్టులు, ప్రమోషన్లు ఎలా ఉంటాయి. విలాసవంతమైన జీవితాన్ని కోరుకుని కుటుంబాలను అప్పులపాలు చేసే యువత పరిస్థితి ఎలా ఉంటుందో దర్శకుడు అనిల్ ఈ చిత్రంలో చక్కగా చూపించారు. అయితే ప్రథమార్ధం మొత్తం పాత్రల పరిచయానికే సరిపోయింది. అసలు కథ ద్వితీయార్ధంలోనే మొదలవుతుంది. పాత్రల మధ్య భావోద్వేగాలు కథకు బలాన్ని చేకూర్చాయి.

పతాక సన్నివేశాల్లో 20 నిమిషాలు చాలా ఉత్కంఠను రేకెత్తిస్తాయి. అజయ్ అరసాడ అందించిన పాటలు బాగున్నాయి. క్యాబ్ డ్రైవర్​గా నటించిన మానస్ నాగులపల్లి ట్రాక్ ఫర్వాలేదనిపిస్తుంది. దర్శకుడు అనిల్​కు తొలి సినిమా కావడం వల్ల తన అనుభవం మేరకు బాగానే కష్టపడి సినిమాను తెరపైకి తీసుకొచ్చారు. ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. ఇటీవల 'వైల్డ్ డాగ్' చిత్రంలో నటించిన ప్రదీప్ రుద్ర ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి కొత్తగా అనిపించాడు. కథానాయికలు అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్ తమ పాత్రల పరిధి మేర ఫర్వాలేదనిపించుకున్నారు.

'క్షీర సాగర మథనం' సినిమా పోస్టర్​

భాస్కర్ పాత్రలో సాప్ట్​వేర్ ఇంజినీర్​గా నటించిన మహేశ్ పాత్ర ప్రేక్షకులకు కొంత ఊరటనిస్తుంది. అయితే ఐదుగురు జీవితాల నేపథ్యం నుంచి సాగే కథ కావడం వల్ల స్క్రీన్ ప్లేలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. అలాగే హ్యూమన్ బాంబ్స్ కాన్సెప్ట్​ను మరింత ఉత్కంఠగా మలచాల్సింది. సాంకేతికంగా సంతోష శానమోని కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు కథకు అనుగుణంగా సరిపోయాయి.

బలం బలహీనతలు
+ క్యాబ్ డ్రైవర్ రిషి ట్రాక్ - కథ

+ ద్వితీయార్ధంలో కొన్ని

సన్నివేశాలు

- ప్రథమార్ధం
+ పాటలు

చివరగా:క్షీర సాగరాన్ని మరింత మథిస్తే ఆశించిన అమృతం దొరికేది!

గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details