'రాజావారు రాణిగారు' చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన కిరణ్ అబ్బవరం.. ఆయన నటించిన రెండో చిత్రం 'ఎస్.ఆర్.కల్యాణమండపం' కథనూ అందించారు. ఈ సినిమా శుక్రవారం(ఆగస్టు 6) థియేటర్లలో విడుదలైంది. మరీ చిత్రం ఎలా ఉంది? ఈ కథ ప్రేక్షకులను మెప్పించిందా? తెలుసుకోవడానికి ఈ సమీక్ష చదివేయండి.
రెండో దశ కరోనా తర్వాత రెండో శుక్రవారం కూడా సినిమాలు థియేటర్ల ముందుకు వరస కట్టాయి. పరిమిత వ్యయంతో రూపొందినవే అన్నీ. అందులో 'ఎస్.ఆర్.కళ్యాణమండపం' ఒకటి. ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడం.. తొలి సినిమా 'రాజావారు రాణిగారు'తో మెప్పించిన కిరణ్ అబ్బవరం రెండో సినిమా కావడం వల్ల ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. మరీ చిత్రం అందుకు తగ్గట్టే ఉందో లేదో తెలుసుకుందాం పదండి.
కథేంటంటే?
ఆ ఊళ్లో ఎస్.ఆర్.కళ్యాణమండపానిది ఓ చరిత్ర. తండ్రి మరణం తర్వాత తనయుడు ధర్మ (సాయికుమార్) ఆ మండపం బాధ్యతల్ని తీసుకుంటాడు. కాలక్రమంలో మండపం వైభవం తగ్గుతుంది. అందుకు కారణం ధర్మనే అని ఊర్లోవాళ్లు చెప్పుకుంటుంటారు. భార్య శాంతి(తులసి)తో ధర్మకి ఎప్పుడూ తగవులే. దాంతో తాగుడుకు బానిసవుతాడు. ధర్మ తనయుడు కళ్యాణ్(కిరణ్ అబ్బవరం) కూడా తన తండ్రితో మాట్లాడటం మానేస్తాడు. తాకట్టు వరకు వెళ్లిన ఎస్.ఆర్.కళ్యాణమండపానికి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత కళ్యాణ్‌పై పడుతుంది. మరి అందులో కళ్యాణ్ విజయం సాధించాడా లేదా? అనేదే సినిమా.
ఎలా ఉందంటే?
కడప జిల్లా రాయచోటి పట్టణం.. అందులోని ఎస్.ఆర్.కళ్యాణమండపం నేపథ్యంలో సాగే కథ ఇది. కథానాయకుడు కిరణ్ అబ్బవరం స్వయంగా రాసుకున్న కథ. యువతరాన్ని అలరించే హాస్యం, భావోద్వేగాలతోపాటు ఇతర వాణిజ్యాంశాలకూ ఇందులో చోటుంది. ఒక చిన్న పట్టణం, అందులో ఓ చరిత్ర ఉన్న కళ్యాణమండపం నేపథ్యం కూడా వినూత్నమైనదే. కథ, మాటల వరకైతే బలం కనిపిస్తుంది కానీ.. సినిమాను మలిచిన విధానంలోనే లోపాలు చోటు చేసుకున్నాయి.
'ఎస్.ఆర్. కల్యాణమండపం' సినిమా పోస్టర్
ప్రథమార్ధంలో భావోద్వేగాలు, వినోదం, మలుపులు ఫలితాన్నిచ్చాయి కానీ.. ద్వితీయార్ధంలోనే, చెప్పాల్సిన కథేమీ లేక, ప్రేమకథలో బలం లేక సాగదీత వ్యవహారంలా మారిపోయింది సినిమా. ప్రథమార్ధం కాలేజీ గొడవలు, ప్రేమ సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. కళ్యాణమండపం బాధ్యతలు మీద పడటం.. దాంతో హీరో, అతని మిత్రబృందం తెలివితేటలు జోడించి పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. పెళ్లిళ్లు గతంలో ఎలా జరిగేవి, ఇప్పుడెలా జరుగుతున్నాయో హీరో చెప్పడం ఆకట్టుకుంటుంది. కానీ, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలే అందుకు తగ్గట్టుగా లేకపోవడం వల్ల కళ్యాణమండపం కళ తప్పినట్టైంది. ఒక్క పెళ్లి కూడా ఆ మాటలకు తగ్గట్టుగా చేయలేకపోతుంది హీరో, అతని మిత్రబృందం.
ఊరి చివర జరిగే ఊరేగింపుల్ని, ఒక పెళ్లి పెద్దతో అన్నం వడ్డించడం వంటి సన్నివేశాల్ని చూపించడం మినహా చేసిందేమీ లేదు. పెళ్లిమండపం ఓ ప్రధాన పాత్రగా మారాల్సి ఉన్నా.. బోర్డును చూపెట్టి సరిపెట్టేశారు. తండ్రీ కొడుకుల బంధం ప్రధానంగా సాగే ఈ సినిమా పతాక సన్నివేశాలు కూడా కొద్దిమేరకే ప్రభావం చూపిస్తాయి. ఈ కళ్యాణమండపంలో పేరు రిజిస్టర్ అయితే చాలు.. పెళ్లి జరగాల్సిందే అని హీరో చెప్పడం, విరామానికి ముందు వచ్చే మలుపు కూడా ద్వితీయార్ధంపై ఆసక్తిని రేకెత్తిస్తాయి. కానీ ద్వితీయార్ధంలో కథ పూర్తిగా దారి తప్పినట్టవుతుంది.
'ఎస్.ఆర్. కల్యాణమండపం' సినిమా పోస్టర్
ఎవరెలా చేశారు?
కిరణ్ అబ్బవరం, సాయికుమార్ పాత్రలు ఆకట్టుకుంటాయి. ఆ పాత్రల్లో వారి నటన కూడా మెప్పిస్తుంది. హీరో మిత్రబృందంలో కొత్తవాళ్లు కనిపిస్తారు. వాళ్లు పర్వాలేదనిపిస్తారు. తులసి, శ్రీకాంత్ అయ్యంగార్ చిన్న పాత్రల్లో కనిపిస్తారు. సాంకేతికంగా సినిమా బాగుంది. చేతన్ భరద్వాజ్ పాటలు, నేపథ్య సంగీతం, డేనియర్ కెమెరా పనితనం చిత్రానికి ప్రధానబలంగా నిలిచాయి. ఒక కల్యాణమండపాన్ని కూడా చూపించలేని స్థాయిలో నిర్మాణ విలువలు ఉన్నాయి. దర్శకుడు శ్రీధర్ గాదే కథపై పట్టును ప్రదర్శించలేకపోయాడు.
'ఎస్.ఆర్. కల్యాణమండపం' సినిమా
బలాలు
బలహీనతలు
+ కథ, మాటలు, నేపథ్యం
- ద్వితీయార్ధం
+ కిరణ్.. సాయికుమార్ నటన
- ప్రేమకథలో బలం
లేకపోవడం
+ ప్రథమార్ధం
చివరిగా:కళ లేని కళ్యాణమండపం
గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!