తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Movie Review: డిటెక్టివ్​గా సునీల్ ఆకట్టుకున్నాడా? - కనబడుటలేదు రివ్యూ

సునీల్​ నటించిన 'కనబడుటలేదు'.. థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అభిమానులకు నచ్చే అంశాలు ఏమేం ఉన్నాయి? తదితర విషయాలను ఈ రివ్యూ చూసి తెలుసుకోండి.

sunil
సునీల్

By

Published : Aug 19, 2021, 5:49 PM IST

చిత్రం: కనబడుట లేదు

నటీనటులు: సునీల్‌, సుక్రాంత్‌ వీరెల్ల, వైశాలిరాజ్, హిమ‌జ‌, యుగ్‌రామ్‌, శశిత కోన, నీలిమ ప‌త‌కంశెట్టి, సౌమ్య శెట్టి, 'కంచరపాలెం' రాజు, ఉమామ‌హేశ్వర రావు, కిషోర్‌, శ్యామ్ తదితరులు

సంగీతం:మధు పొన్నాస్‌

ఎడిటింగ్‌: రవితేజ కూర్మాన

సినిమాటోగ్రఫీ:సందీప్‌ బద్దుల

బ్యాన‌ర్స్‌: ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్

స‌మ‌ర్పణ‌: సరయు తలశిల

ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: బాల‌రాజు

విడుదల: 19-08-2021

కనబడుటలేదు

రెండో ద‌శ క‌రోనా త‌ర్వాత చిత్రసీమ మ‌ళ్లీ గాడిన ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పెద్ద సినిమాలు.. స‌రైన సినిమాలు విడుద‌లైతే థియేట‌ర్ల దగ్గర మునుప‌టిలా సంద‌డి ఖాయం అనే భ‌రోసానిస్తున్నాయి. ఈ వారాంతంలో విడుద‌లైన ప‌లు సినిమాల్లో 'క‌న‌బ‌డుట‌లేదు' ఒక‌టి. సునీల్ కీల‌క పాత్రలో న‌టించ‌డంతో సినిమాపై ప్రేక్షకుల్లో మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. మ‌రి సినిమా ఎలా ఉంది? సునీల్‌ ఏ మేరకు ఆకట్టుకున్నారు? ఈటీవీ భారత్ సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

డిటెక్టివ్​గా సునీల్

క‌థేంటేంటే: సూర్య (సుక్రాంత్), శశిద (వైశాలిరాజ్‌) ప్రేమించుకుని విడిపోతారు. ఆ త‌ర్వాత అయిష్టంగానే ఆదిత్య (యుగ్‌రామ్‌)తో శ‌శిద పెళ్లి జ‌రుగుతుంది. పెళ్లి త‌ర్వాత కూడా శ‌శిద మ‌న‌సులో త‌న ప్రియుడు సూర్య మోసం చేశాడ‌నే బాధ ఉంటుంది. సూర్య చేతిలో అవ‌మానానికి గురైన ఆమె ఎలాగైనా అత‌న్ని చంపేయాల‌ని నిర్ణయించుకుంటుంది. అందుకోసం త‌న భ‌ర్త ఆదిత్య సాయం కూడా తీసుకుంటుంది. అలా ఇద్దరూ క‌లిసి సూర్య కోసమే విశాఖ‌ప‌ట్నం వెళ‌తారు. తీరా అక్కడికి వెళ్లాక ఊహించ‌ని మ‌లుపు. వీళ్లు వెదుతుకున్న సూర్య క‌నిపించ‌కుండా వెళ్లిపోతాడు. ఇంత‌కీ సూర్య ఎక్కడికి వెళ్లాడు? అత‌న్ని వెత‌క‌డం కోసం రంగంలోకి దిగిన డిటెక్టివ్ రామ‌కృష్ణ (సునీల్‌) ఈ కేసుని ఎలా ఛేదించాడు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కనబడుటలేదు మూవీ రివ్యూ

ఎలా ఉందంటే: ఇదొక మర్డర్‌ మిస్టరీ. నిజానికి హ‌త్యని ఎవ‌రు చేశారనే కోణంలో న‌డిపితే ఇదొక ఆస‌క్తిక‌ర‌మైన క్రైమ్ డ్రామా చిత్రంగా నిలిచే అవ‌కాశం ఉంది. కానీ, దర్శకుడు దీనికి డిటెక్టివ్ కామెడీని కూడా జోడించాడు. దాంతో ఏ ఒక్క నేప‌థ్యానికీ న్యాయం జ‌ర‌గ‌క, క‌థ‌... క‌థ‌నాల్లో ఆస‌క్తి నీరుగారిపోయింది. క‌థ‌లో కొత్తద‌నం ఉంది. కానీ, దాన్ని అంతే ఆస‌క్తిక‌రంగా తెర‌పైకి తీసుకురావ‌డంలో మాత్రం చాలా త‌ప్పులు చోటు చేసుకున్నాయి. భావోద్వేగాలు కూడా బ‌లంగా పండ‌లేదు. ఒక అమ్మాయి తాను ప్రేమించిన వ్యక్తిని చంపాల‌నుకుందంటే, ఆమె ప‌డిన బాధ, ఆ అవ‌మానం బ‌లంగా క‌నిపించాలి. అప్పుడే ప్రేక్షకుడూ ఎంతో కొంత ఆ బాధ‌ని అనుభ‌విస్తాడు, ఆ పాత్రపై జాలి క‌లుగుతుంది. అలాంట‌ప్పుడే క‌థ‌లో భావోద్వేగాలు పండుతాయి. కానీ, ఆ విష‌యంలో ద‌ర్శకుడు చేసిన క‌స‌ర‌త్తులు స‌రిపోలేదు. కొన్ని పాత్రల్ని ద‌ర్శకుడు బాగానే అల్లాడు. వైశాలి, సునీల్, హిమ‌జ పాత్రలు విడివిడిగా ఆక‌ట్టుకునేలా ఉంటాయి. కానీ, అవి క‌థ‌కి స‌రైన రీతిలో అత‌క‌లేదు. క‌థ ఆరంభం, మ‌లుపులు, సునీల్ పాత్ర చేసే ప‌రిశోధ‌న వ‌ర‌కు ప‌ర్వాలేద‌నిపించినా క్రమంగా సినిమా ప‌ట్టు త‌ప్పిపోతుంది.

డిటెక్టివ్​గా ఆకట్టుకున్నాడా

ఎవ‌రెలా చేశారంటే: సునీల్ చక్కటి అభిన‌యం ప్రద‌ర్శించారు. ఆయ‌న పాత్ర తెర‌పై బ‌లంగానే క‌నిపిస్తుంది. వైశాలిరాజ్‌, సుక్రాంత్‌, హిమ‌జ త‌దితరుల పాత్రలు కూడా ఆక‌ట్టుకుంటాయి. సీఐ విక్టర్‌రాజుగా క‌నిపించిన కిషోర్ కుమార్ పాత్ర చేసే హంగామా అతిగా అనిపిస్తుంది. ఆ పాత్రకు డ‌బ్బింగ్ కూడా అత‌క‌లేదు. సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. మ‌ధు పొన్నాస్ సంగీతం, సందీప్ కెమెరా ప‌నిత‌నం సినిమాకి ప్రధాన బ‌లం. ద‌ర్శకుడు బాల‌రాజు క‌థ‌, క‌థ‌నాల్ని న‌డిపించిన విధానంలో త‌డ‌బడ్డారు. కొన్ని పాత్రల్ని మర్డర్‌ మిస్టరీకి సంబంధించిన అంశాల్ని బాగా రాసుకున్నారు. కొన్ని సంభాష‌ణ‌లు కూడా మెప్పిస్తాయి.

బ‌లాలు:ఆరంభ స‌న్నివేశాలు, సునీల్‌, వైశాలిరాజ్ న‌ట‌న, మ‌లుపులు

బ‌ల‌హీన‌త‌లు:క‌థ‌, క‌థ‌నం, భావోద్వేగాలు పండ‌క‌పోవ‌డం

చివ‌రిగా: క‌న‌బ‌డుట‌లేదు.. క‌నిపించేవి కొన్ని పాత్రలే!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగ అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details