పొరుగున విజయవంతమైన కథల్ని తెచ్చుకుని రీమేక్ చేయడం మామూలే. అయితే క్లాసిక్ అనిపించుకున్న సినిమాల్ని రీమేక్ చేయడానికి మాత్రం వెనకాడుతుంటారు నిర్మాతలు. తమిళంలో క్లాసిక్‌గా నిలిచిపోయిన సినిమా '96'. ఆ సినిమాను ఎంతో ఇష్టపడి తెలుగులో 'జాను' చిత్రంగా రీమేక్ చేశాడు దిల్‌రాజు. అతని నిర్మాణంలో రూపొందిన తొలి రీమేక్ ఇదే.
మాతృక (ఒరిజినల్)ను తెరకెక్కించిన దర్శకుడే ఈ సినిమా బాధ్యతల్ని తీసుకున్నాడు. ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోగల సమంత, శర్వానంద్ జంటగా నటించారు. మరి మాతృకలోని మ్యాజిక్ పునరావృతమైందా? 'జాను' ఎలా ఉంది? తదితర విషయాలు తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం.
కథేంటంటే:
కె.రామచంద్ర అలియాస్ రామ్ (శర్వానంద్) వృత్తిరీత్యా ట్రావెల్ ఫొటోగ్రాఫర్. అతను వృత్తిలో భాగంగా తను పుట్టి పెరిగిన విశాఖపట్నం వెళతాడు. తన స్కూల్‌ని మరోసారి చూసి పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటాడు. అప్పుడే తన స్నేహితులంతా కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటారు. అలా వారందరూ హైదరాబాద్‌లో కలుసుకుంటారు. ఆ కార్యక్రమానికి జానకిదేవి అలియాస్ జాను (సమంత) కూడా సింగపూర్ నుంచి వస్తుంది.
రామ్, జాను పదో తరగతిలోనే ప్రేమలో పడతారు. కానీ అనుకోకుండా విడిపోతారు. మళ్లీ కలవరు. దాదాపు 17 ఏళ్ల తర్వాత కలిసిన వాళ్లిద్దరూ... తమ తొలిప్రేమ గురించి ఏం మాట్లాడుకున్నారు? అన్ని సంవత్సరాల తర్వాత వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పులు ఎలాంటివి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ప్రేమకథలు ఎక్కువగా నవతరానికే నచ్చుతుంటాయి. తెరపై కనిపించే పాత్రలతో కనెక్ట్ అయ్యేది వాళ్లు మాత్రమే. కొన్ని ప్రేమ కథలు మాత్రం వయసుతో సంబంధం లేకుండా అందరికీ చేరువయ్యేలా ఉంటాయి. అలాంటి ప్రేమకథే.. 'జాను'. తొలి ప్రేమలోని మధురానుభూతుల్ని పంచే చిత్రమిది. చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ, గడిచిపోయిన జీవితంలోకి మరోసారి తీసుకెళుతుంది. 'నిన్నటి నువ్వు ఇదే' అని మరోసారి మనల్ని మనకు పరిచయం చేస్తుంది.
>> రీమేక్ సినిమా అంటే కచ్చితంగా మాతృకతో పోల్చి చూస్తుంటారు. మాతృక తరహాలోనే రీమేక్‌లోనూ మ్యాజిక్ చేసే కథలు కొన్ని మాత్రమే ఉంటాయి. అందులో ఇదొకటి. చిన్ననాటి స్నేహితుల మధ్య ఉన్నామంటే ఆ వాతావరణం ఎంత సరదాగా ఉంటుందో చూపిస్తూ.. ఆ నేపథ్యంలో నవ్విస్తూ.. తొలి ప్రేమ చేసిన తీపి గాయాలతో హృదయాల్ని బరువెక్కిస్తూ ముందుకు సాగుతుందీ చిత్రం.
>>కథానాయకుడు తన స్కూల్‌లోకి అడుగుపెట్టినప్పట్నుంచే సినిమా భావోద్వేగభరితంగా మారిపోతుంది. అర్జెంటుగా బయటికెళ్లి మన స్కూల్‌ని ఒకసారి చూసొద్దాం అనిపించేలా ప్రేక్షకుడిని ప్రభావితం చేస్తుంది.
>> పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం వాట్సాప్ గ్రూప్‌ని క్రియేట్ చేయడం, అందులో ఒకొక్కరు ఒక్కో రకంగా స్పందించడం, అందరూ ఒక చోట కలవడం, అక్కడ వాతావరణం సరదాగా మారిపోవడం లాంటి సన్నివేశాలతో సినిమా చక్కటి వినోదాన్ని పంచుతుంది.
>>రామ్, జానుల ప్రేమకథ తొలిప్రేమ రోజుల్లోకి తీసుకెళుతుంది. విరామం సమయంలో వచ్చే సన్నివేశాలు హృదయాల్ని బరువెక్కిస్తాయి. రామ్ గురించి ఒక విషయం తెలిశాక జాను భావోద్వేగానికి గురయ్యే తీరు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ద్వితీయార్ధంలో మరిన్ని భావోద్వేగాలు పండాయి.