చిత్రం: ఇదే మా కథ
నటీనటులు: సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్, సమీర్, శ్రీకాంత్ అయ్యంగార్, పృథ్వీ, సప్తగిరి, రాంప్రసాద్ తదితరులు
సంగీతం: సునీల్ కశ్యప్
ఛాయాగ్రహణం: సి.రామ్ ప్రసాద్
నిర్మాత: జి.మహేశ్
దర్శకత్వం: గురు పవన్
విడుదల తేదీ: 02-10-2021
తెలుగు చిత్రసీమలో కొత్త సినిమాల సందడి కొనసాగుతోంది. ఓవైపు పెద్ద చిత్రాలు.. మరోవైపు చిన్న సినిమాలు బాక్సాఫీస్ ముందు ప్రేక్షకులకు వినోదాలు పంచుతున్నాయి. ఈ శుక్రవారం సాయితేజ్ ‘'రిపబ్లిక్' సినిమాతో సినీప్రియుల్ని పలకరించగా.. శనివారం ఆ బాధ్యతను 'ఇదే మా కథ'(Idhe Maa Katha movie) అందిపుచ్చుకుంది. శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. గురు పవన్ తెరకెక్కించారు. ఈ చిత్ర కథా నేపథ్యం.. ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటం వల్ల ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మరి ఆ అంచనాల్ని ఈ చిత్రం అందుకుందా? శ్రీకాంత్, సుమంత్ అశ్విన్ ఏ మేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు? అనేది సమీక్ష(Idhe Maa Katha review) ద్వారా తెలుసుకుందాం.
కథేంటంటే?
హైదరాబాద్ నుంచి లద్దాఖ్ వరకూ నలుగురు బైక్ ట్రావెలర్స్ చేసిన ప్రయాణమే ఈ చిత్రం. వారిలో ఒకరు మహేంద్ర (శ్రీకాంత్). 25ఏళ్ల క్రితం మిస్సయిన తన ప్రేయసిని వెతుక్కుంటూ లద్దాఖ్ బయల్దేరుతాడు. అజయ్ (సుమంత్ అశ్విన్) ఓ అడ్వెంచర్ బైక్ రైడర్. ఇంటర్నేషనల్ అడ్వెంచర్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనాలనేది తన కల. ఆ పోటీల్లో పాల్గొనాలంటే ముందుగా లద్దాఖ్‌లో జరిగే అడ్వెంచర్ రేస్‌లో గెలవాలి. కానీ, అతని తల్లిదండ్రులు మాత్రం తన ఇష్టాన్ని కాదంటారు. దీంతో ఇంట్లో చెప్పకుండానే ఓ బైక్ దొంగతనం చేసి లద్దాఖ్‌కు ప్రయాణమవుతాడు అజయ్. అలాగే లక్ష్మీ (భూమిక)కు ఓ కల ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై తన తండ్రి చేసిన ఓ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి లద్దాఖ్‌లో జరిగే ఈవెంట్‌లో పొందుపరిచేందుకు వస్తుంది. వేర్వేరు లక్ష్యాలతో ప్రయాణం ప్రారంభించిన ఈ ముగ్గూరు ఎలా కలిశారు. ఒకరి సమస్యను మరొకరు ఎలా పంచుకున్నారు. లక్ష్య సాధనలో వారికెదురైన సవాళ్లేంటి? వాటినెలా అధిగమించారు? ఈ ముగ్గురి ప్రయాణంలో మేఘన (తాన్యా హోప్) ఎలా భాగమైంది? అన్నది తెరపై చూడాలి.
ఎలా ఉందంటే?
జీవితం అంటే ఏమిటి? మనం కన్న కలలను సాకారం చేసుకునేందుకు ఏం చేయాలి? వాటి కోసం ఎంతలా కష్టపడాలి? అన్నది ఈ సినిమాతో యువతరానికి చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు గురు పవన్. దీనికి రోడ్డు జర్నీ నేపథ్యాన్ని కథాంశంగా ఎంచుకున్నారు. దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలోనే ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకోవడం అభినందనీయమైన విషయం. అయితే ఆయన చెప్పాలనుకున్న కథను ఎక్కడా గాడి తప్పకుండా నడిపించే ప్రయత్నం చేసినా.. దాన్ని జనరంజకంగా తెరపై ఆవిష్కరించడంలో తడబడ్డాడు. ఇటు మహేంద్ర ప్రేమకథ నుంచి కానీ.. అటు లక్ష్మీ జీవితం నుంచి కానీ బలమైన భావోద్వేగాలు పండించగలిగే ఆస్కారమున్నప్పటికీ వాటిని సరిగా వాడుకోలేకపోయాడు. ఇక అడ్వెంచర్ బైక్ రైడర్‌గా అందరి మెప్పు పొందాలన్న అజయ్ లక్ష్యంలోనూ ఎక్కడా కసి, పట్టుదల కనిపించవు. దీనికి తోడు మేఘనతో అతని లవ్‌ట్రాక్ మరీ రొటీన్‌గా అనిపిస్తుంది. ఫలితంగా ప్రేక్షకులు ఏ ఒక్కరి కథతోనూ ప్రయాణించే పరిస్థితి కనిపించదు.