జార్జ్‌రెడ్డి... విద్యార్థి నాయకత్వం, రాజకీయాలు తెలిసిన వారికి ఈ పేరు సుపరిచితమే. ఐదు దశాబ్దాల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో మోగిన విప్లవ గొంతుక జార్జ్రెడ్డిది. ఆయన పేరుతో సినిమా వస్తోందంటే.. తప్పకుండా అందరిలోనూ ఆసక్తి రేకెత్తుతుంది. ఆ కథను ఎలా చూపించారో తెలుసుకోవాలన్న కోరిక కలుగుతుంది. అందుకే 'జార్జ్‌రెడ్డి' సినిమాపై తెలుోగు ప్రేక్షకులు, పరిశ్రమ దృష్టి సారించింది. మరి ఈ 'జార్జిరెడ్డి' ఎలా ఉన్నాడు? దర్శకుడు చరిత్రను ఎంత వరకూ కళ్లకు కట్టారు? తదితర విషయాలు తెలియాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే.
కథేంటంటే?
జార్జ్‌రెడ్డి(శాండీ)ది చిన్నప్పటి నుంచి అన్యాయాలను ఎదుర్కొనే స్వభావం. అమ్మ చెప్పే కథలు వింటూ, అందులో ఉన్న నీతిని బుర్రకు ఎక్కించుకుంటుంటాడు. ప్రశ్నలు వేస్తూ, కొత్త విషయాల్ని కనుక్కోవాలన్న తాపత్రయంతో ఉంటాడు. యుద్ధ విద్యల్లోనూ ప్రావీణ్యం సంపాదిస్తాడు. చదువంటే పిచ్చి. ఉస్మానియా యూనివర్సిటీలో చేరి, అక్కడి తప్పుల్ని ప్రశ్నిస్తాడు. విద్యార్థుల్లో చైతన్యం రగిలిస్తాడు. అక్కడే ఓ నాయకుడిగా ఎదుగుతాడు. రైతుల సమస్యపై సమర సంఖం మోగిస్తాడు. ఈ చైతన్యాన్ని దేశంలో ఉన్న అన్ని యూనివర్సీటీలకూ తెలిసేలా చేస్తాడు. అలా... జార్జ్‌రెడ్డి పేరు మార్మోగిపోతుంది. ఉస్మానియా క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి. శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో జార్జ్‌రెడ్డిని కొంతమంది పథకం ప్రకారం హత్య చేస్తారు. ఇదంతా జరిగిన కథే. దానినే తెరపై చూపించారు.
ఎలా ఉందంటే?
చరిత్రకు కాస్త సినిమా పరిభాష జోడించి తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు జీవన్‌రెడ్డి. జార్జ్‌రెడ్డి బాల్యం, ఎదిగిన క్రమం, తనలో పోరాట తత్వం... ఇవన్నీ యువతరంలో స్ఫూర్తిని నింపే అంశాలే. ఆ సన్నివేశాలన్నీ చక్కగా ఆవిష్కరించుకుంటూ కథలోకి తీసుకెళ్లాడు. ఉస్మానియా నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తాయి. అక్కడి విద్యార్థుల సమస్యలు, రాజకీయాలు, రౌడీయిజం అన్నీ అప్పటి పరిస్థితుల్ని కళ్లకు కట్టాయి. వాటి మధ్య విద్యార్థి నాయకుడిగా జార్జిరెడ్డి ఎదిగిన క్రమం తెరపైకి తీసుకొచ్చారు. దర్శకుడు వాస్తవిక ధోరణి అవలంభిస్తూనే, కాస్త సినిమాటిక్ పరిభాషలోకి ఈ కథని మలిచే ప్రయత్నం చేశాడు.
జార్జ్‌రెడ్డి జీవితంలో సినిమాలకు సరిపడే మలుపులేం ఉండవు. ఆయన కథను పుస్తకాల్లో చదివిన వారికైతే ఈ కథ కొట్టినపిండే. వాళ్లకు కొత్తగా కనిపించే అంశాలుండవు. పాటల జోలికి వెళ్లకపోవడం, జార్జ్‌రెడ్డి అనే పాత్రను దాటి మరో కోణంలోకి వెళ్లకపోవడం ఈ చిత్రానికి ప్లస్ అనుకోవాలి. పతాక సన్నివేశాలు ఉద్వేగ భరితంగా సాగుతాయి. జార్జిరెడ్డిని శత్రువులు అంతమొందించిన సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి.