తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సమీక్ష: ఉత్కంఠ కలిగించే 'గతం' - gatham amazon prime

థ్రిల్లర్ కథతో రూపొందిన 'గతం'.. అమెజాన్ ప్రైమ్​ వేదికగా ప్రేక్షకుల్ని పలకరించింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఎంతలా ఆకట్టుకుంది?

gatham-telugu-movie-review
సమీక్ష: ఉత్కంఠ కలిగించే 'గతం'

By

Published : Nov 7, 2020, 11:55 AM IST

సినిమా: గతం

నటీనటులు: రాకేశ్, పూజిత కూరపాటి, భార్గవ్ పోలుదాసు, హర్షా ప్రతాప్, లక్ష్మి భరద్వాజ్

నేపథ్య సంగీతం: శ్రీచరణ్ పాకాల

దర్శకత్వం: కిరణ్ కొండమాడుగుల

నిర్మాతలు: భార్గవ్ పోలుదాసు, హర్షా ప్రతాప్, సృజన్ ఎరబోలు

విడుదల: అమెజాన్ ప్రైమ్ వీడియో(2020 నవంబరు 6)

'గతం' ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అమెరికాలోని పలువురు సాప్ట్​వేర్ ఉద్యోగులు కలిసి తీసిన ఇండిపెండెంట్ మూవీ. నూతన దర్శకుడు కిరణ్ కొండమాడుగుల, ఆప్ బీట్ ఫిల్మ్స్ బ్యానర్​లో ఈ సినిమాను నిర్మించారు. వాస్తవానికి మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రావల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడం వల్ల 'గతం'ను అమెజాన్ ప్రైమ్​లో విడుదల చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ ఇచ్చిందో చూద్దాం.

గతం సినిమా పోస్టర్

కథేంటంటే:

రిషి(రాకేశ్) ఓ ప్రమాదంలో గాయపడి తన గతాన్ని మరిచిపోతాడు. కోలుకున్నాక ఆస్పత్రిలో ఉన్న రిషిని తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంది అతడి ప్రియురాలు అతిథి(పూజిత). దారిలో కారు ప్రాబ్లమ్ రావడం వల్ల అటుగా వెళ్తున్న అర్జున్(భార్గవ్)... వాళ్లిద్దరికి దగ్గరలో ఉన్న ఇంట్లో షెల్టర్ ఇస్తాడు. అనుమానం రాకుండా ఆ రోజు రాత్రి వాళ్లిద్దరిని చంపాలనుకుంటాడు. విషయాన్ని గ్రహించి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న రిషిని అతిథి అడ్డుకుంటుంది. వాళ్లిద్దరిని అర్జున్ ఎందుకు చంపాలనుకుంటాడు? రిషిని అతిథి ఎందుకు అడ్డుకుంది? రిషి గతం గుర్తొస్తే అర్జున్​కు కలిగే ప్రయోజం ఏంటి? అతిథి ఎవరు అనేదే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే సినిమా గతం. ప్రారంభ సన్నివేశాలతోనే ప్రేక్షకుడిలో ఆసక్తి కలిగించిన దర్శకుడు కిరణ్.. 20 నిమిషాల తర్వాత ఊహించని మలుపులతో కథను ముందుకు తీసుకెళ్లాడు. రిషిని అతిథి అడ్డుకోవడం వల్ల మలుపు తిరిగిన కథ ప్రేక్షకుడ్ని సినిమా ఫార్వర్డ్ చేయకుండా చేస్తుంది. రిషిని వెంటాడే అర్జున్ పాత్రలోని మలుపు, గతాన్ని కోల్పోయిన రిషి నేపథ్యం కథకు చాలా కీలకం.

సినిమా నిడివి గంటా 40 నిమిషాలే ఉన్నప్పటికి ఎక్కడా ల్యాగ్ లేకుండా సినిమాను తీర్చిదిద్దారు. ప్రేక్షకుడు ఊహించని విధంగా పక్కా స్క్రీన్ ప్లేతో దర్శకుడు కిరణ్ రాసుకున్న 'గతం' కథ.. ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగిస్తుంది. ఇలాంటి తరహా కథల్లో విలన్ ఎవరనేది తెలుసుకోడానికి ప్రేక్షకుడిలో ఆసక్తి మొదలవుతుంది. ఆ ఆసక్తితో సినిమా ఫార్వర్డ్ చేసే అవకాశాలు లేకపోలేదు. కానీ సినిమా ఫార్వర్డ్ చేసినా మళ్లీ మొదటి నుంచి చూడాలనిపించేలా పకడ్బందీగా కథను తీర్చిదిద్దాడు దర్శకుడు కిరణ్. ప్రతి మనిషిలో సైకోయిజం ఉంటుంది. అది పరిస్థితులను బట్టి బయటపడుతుంది, ఫలితంగా జరిగే పరిణామాలేంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలనే కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇలాంటి కథలు తెరపై చూస్తే ప్రేక్షకులకు మరింత థ్రిల్ దొరికేది.

గతం సినిమా పోస్టర్

ఎవరెలా చేశారు?

నటీనటుల విషయానికొస్తే... గతంలో నటించిన వారంతా సాప్ట్​వేర్ ఉద్యోగులే కావడం విశేషం. వారంతా అప్పుడప్పుడు లఘు చిత్రాల్లో నటిస్తూ సినిమాపై ఇష్టాన్ని, నటనపై మక్కువను చాటుకునేవారు. అలాంటి వారిలో రాకేష్, భార్గవ్ ఒకరు. వీరిద్దరు 'గతం'లో పోటాపోటీగా నటించారు. రిషి, అర్జున్ పాత్రల్లో లీనమై ముందుకు నడిపించారు.

అతిథిగా చేసిన పూజిత ఫర్వాలేదనిపించుకుంది. దర్శకుడిగా కిరణ్ కు ఇదే తొలి సినిమా అయినా.. సినిమాపై ఉన్న పట్టుతో చక్కగా తీర్చిదిద్దాడు. తన భవిష్యత్​కు ల్యాండ్ మార్క్ ఫిల్మ్​గా మలుచుకున్నాడు. మనోజ్ రెడ్డి కెమెరా పనితనం బాగుంది. మంచు కురుస్తున్న సమయంలో అత్యంత సహజంగా తీర్చిదిద్దిన పతాక సన్నివేశాలు మనోజ్ రెడ్డి పనితనానికి అద్దంపడుతున్నాయి. అలాగే శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. ఆప్ బీట్ ఫిల్మ్స్ సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి.

గతం సినిమా పోస్టర్

బలాలు:

  • సినిమా కథ
  • రాకేశ్, భార్గవ్
  • స్క్రీన్ ప్లే
  • క్లైమాక్స్

బలహీనతలు:

  • నెమ్మదిగా సాగే కథనం

చివరగా:థ్రిల్లర్ ప్రేక్షకులకు బాగా నచ్చే "గతం"

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details