తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Gamanam review: 'గమనం' సినిమా ఎలా ఉందంటే? - telugu movie review

Shriya gamanam review: శ్రియ, నిత్యామేనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 'గమనం'.. థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

gamanam movie review
గమనం మూవీ రివ్యూ

By

Published : Dec 10, 2021, 10:23 AM IST

Updated : Dec 10, 2021, 11:03 AM IST

చిత్రం: గమనం; నటీనటులు: శ్రియా శ‌ర‌ణ్‌, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, సుహాస్‌, నిత్యమేన‌న్ (అతిథి పాత్రలో), ర‌వి ప్రకాశ్‌, బిత్తిరి స‌త్తి, సంజ‌య్ స్వరూప్, తదిత‌రులు; సంగీతం: 'మాస్ట్రో' ఇళయరాజా; నిర్మాతలు: రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్; క‌థ‌, క‌థ‌నం, దర్శకత్వం: సుజనా రావు; సంస్థ‌: క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్; విడుద‌ల‌: 2021 డిసెంబ‌ర్ 10

Gamanam movie review: తెలుగులో అగ్రతార‌ల సినిమాల జోరు మొద‌లైంది. ఇంకొన్ని రోజుల్లో ఆ ఉద్ధృతి మ‌రింత‌గా పెర‌గ‌నుంది. అందుకే ఆలోపులోనే ప‌రిమిత వ్యయంతో తెర‌కెక్కిన సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు పోటీ ప‌డుతున్నారు ద‌ర్శక‌నిర్మాత‌లు. ఈవారం దాదాపుగా ఎనిమిది సినిమాలు విడుద‌ల‌య్యాయి. అందులో ఒక‌టి 'గ‌మ‌నం'. ద‌ర్శకులుగా సుజ‌నారావుకి ఇదే తొలి చిత్రమైనా.. శ్రియ‌, నిత్యమేన‌న్ త‌దిత‌ర తార‌లు ఉండ‌టం, సినిమా వెన‌క కూడా ప్రముఖ సంగీత ద‌ర్శకులు ఇళ‌య‌రాజా, ఛాయాగ్రాహ‌కుడు జ్ఞాన‌శేఖ‌ర్‌, మాట‌ల ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా త‌దిత‌రులు పనిచేయడం వల్ల సినిమాపై ప్రత్యేక‌మైన ఆస‌క్తి ఏర్పడింది. ప్రచార చిత్రాలు కూడా సినిమాపై ఉత్సుక‌త‌ను రేకెత్తించాయి. మ‌రి చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం.

గమనం రివ్యూ

క‌థేంటంటే: మూడు క‌థ‌ల స‌మాహారం ఈ చిత్రం. క‌మ‌ల(శ్రియ‌) చెవులు విన‌బ‌డ‌ని ఓ దివ్యాంగురాలు. దుబాయ్‌కు వెళ్లిన భ‌ర్త కోసం ఎదురుచూస్తూ చంటి బిడ్డతో క‌లిసి ఓ మురికివాడ‌లో కాలం వెళ్లదీస్తుంటుంది. చెవులు వినిపించేందుకని వైద్యం కూడా చేయించుకుంటుంది. భ‌ర్త మాట‌లు వినాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంది. రెండో క‌థ‌లో క్రికెట‌ర్ కావ‌డ‌మే ల‌క్ష్యంగా శ్రమిస్తున్న అలీ (శివ కందుకూరి), త‌న ప‌క్కింటి అమ్మాయి జారా (ప్రియాంక జ‌వాల్కర్‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాల‌నుకుంటారు. మూడో క‌థ‌లో పుట్టిన‌రోజంటే ఏమిటో తెలియ‌ని అనాథ పిల్లలైన ఇద్దరు కేక్ కోసమ‌ని రూ.300 సంపాదించాల‌నుకుంటారు. అనుకోకుండా వ‌చ్చిన ప్రకృతి విప‌త్తుతో ఆ మూడు క‌థ‌లు ఎలాంటి మ‌లుపులు తిరిగాయి. వాళ్లు క‌న్న క‌ల‌లు నెర‌వేరాయా? లేదా? అనేదే మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: మూడు క‌థ‌లు.. వాటిని ప్రకృతి విప‌త్తుతో ముడిపెట్టి రాసిన తీరు బాగుంది. క‌థ‌ల‌కు ముగింపు ఆలోచ‌న కూడా ఆక‌ట్టుకునేదే. ఎటొచ్చీ ఈ క‌థ‌ల గ‌మ‌న‌మే ఏ ద‌శ‌లోనూ మెప్పించ‌దు. కాన్సెప్ట్ బాగుంటే చాల‌దు.. దాన్ని తెర‌పైన న‌డిపించ‌డంలోనూ ప్రత్యేకత ప్రద‌ర్శించాల్సిందే. ఈ సినిమా విష‌యంలో అదే లోపించింది. ప్రథ‌మార్ధం మొత్తం పాత్రల్ని, వారి నేప‌థ్యాల్ని ప‌రిచ‌యం చేసి వ‌దిలేసిన‌ట్టే ఉంటుంది త‌ప్ప‌, అందులో క‌థేమీ ఉండ‌దు. ఇక ఉన్న ఓ చిన్న మ‌లుపుని కూడా ట్రైల‌ర్‌లోనే చూపించ‌డం వల్ల సినిమాలో చూడ‌టానికి ఏమీ మిగ‌ల్లేదనిపిస్తుంది. మూడు క‌థ‌ల్ని ప‌రిచ‌యం చేసిన విధానం కూడా డాక్యుమెంట‌రీ త‌ర‌హాలో నిదానంగా.. చ‌ప్పగా సాగ‌డం సినిమాకు మైన‌స్‌గా మారింది. వీధి బాల‌లు, మురికివాడ‌ల జీవితాన్ని స‌హ‌జంగా ఆవిష్కరించిన తీరు మాత్రం మెప్పిస్తుంది. హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల‌తో ఈ క‌థ‌ను తీర్చిదిద్దడం వల్ల కొద్దిలో కొద్దిగా ప్రేక్షకుల‌కు క‌నెక్ట్ అవుతుంది. కానీ ఆ క‌థ‌ల్ని హృద్యంగా మ‌ల‌చ‌డంలో ద‌ర్శకురాలు విఫ‌ల‌మ‌య్యారు. ఆమెకు ఇదే తొలి చిత్రం కాబ‌ట్టి అనుభ‌వ లేమి అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. అయితే అనుభ‌వం ఉన్న ప‌లువురు సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో ఉన్నా వాళ్ల ప్రభావం కూడా పెద్దగా క‌నిపించ‌దు. సాయిమాధ‌వ్ బుర్రా క‌లం మెరుపులు ఒక‌ట్రెండు చోట్ల క‌నిపిస్తాయంతే. ఇళ‌యరాజా సంగీతం ప‌తాక స‌న్నివేశాల్లోనే ప్రభావం క‌నిపిస్తుంది. జ్ఞాన‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ద‌ర్శకురాలు సుజ‌నారావు రాసుకున్న పాత్రల్లో బ‌లం ఉంది. వాటిలో సంఘ‌ర్షణే స‌రిప‌డ‌లేదు.

శ్రియ

ఎవ‌రెలా చేశారంటే: Gamanam shriya saran: సినిమాకు ప్రధాన ఆక‌ర్షణ శ్రియనే. ఆమె పాత్ర‌, న‌టనే సినిమాకు బ‌లం. చెవులు వినిపించ‌ని ఓ గృహిణిగా చక్కటి అభిన‌యం ప్రద‌ర్శించింది. భ‌ర్త రాడ‌ని తెలిసిన‌ప్పుడు ఆమె పండించిన భావోద్వేగాలు ఆక‌ట్టుకుంటాయి. శివ కందుకూరి, ప్రియాంక జ‌వాల్కర్ జోడీ మ‌ధ్య సాగే ల‌వ్ ట్రాక్‌లో బ‌లం లేదు. వాళ్ల న‌ట‌న కూడా అంతంత మాత్రమే. ప‌తాక స‌న్నివేశాల్లో శివ కందుకూరి అభిన‌యం ప‌ర్వాలేద‌నిపిస్తుంది. వీధి బాల‌లుగా న‌టించిన ఇద్దరు చిన్నారులు ఆక‌ట్టుకుంటారు. చారు హాస‌న్‌, సంజ‌య్ స్వరూప్, సుహాస్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ఇంత పెద్ద ఇల్లు క‌ట్టారంటే, ఎంత చెత్త ఏరుకున్నారో అంటూ వీధి బాల‌లుతోనూ, మ‌ర్యాద‌గా మ‌మ్మల్ని మ‌ట్టిలో క‌లిపేస్తావ‌నుకుంటే, మా మ‌ర్యాద‌నే మ‌ట్టిలో క‌లిపేశావ్ అని వృద్ధ దంప‌తుల‌తోనూ చెప్పించిన సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి. జ్ఞాన‌శేఖ‌ర్ కెమెరా వ‌ర‌ద‌ల్ని, మురికివాడ‌ల్ని చాలా బాగా చూపించింది. సుజ‌నారావు రాసుకున్న క‌థ ప‌ర్వాలేదు కానీ, దాన్ని తెర‌పైకి తీసుకొచ్చిన విధానమే మెప్పించ‌దు. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గట్టు ఉంది.

బ‌లాలు

+ శ్రియ న‌ట‌న

+ ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

- సాగ‌దీత‌గా స‌న్నివేశాలు

- భావోద్వేగాలు పండ‌క‌పోవ‌డం

చివ‌రిగా: గ‌మ‌నం.. ఓ ప్రయ‌త్నం

గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Last Updated : Dec 10, 2021, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details