తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Movie Review: థ్రిల్లింగ్ థ్రిల్లింగ్​గా 'కోల్డ్​కేస్'! - మూవీ న్యూస్ లేటేస్ట్

ఓటీటీలో మరో సినిమా అందుబాటులోకి వచ్చేసింది. థ్రిల్లర్​ కథతో తెరకెక్కిన మలయాళ చిత్రం 'కోల్డ్​కేస్' ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? అనే విషయాలు తెలియాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే.

cold case movie review
కోల్డ్​కేస్ మూవీ రివ్యూ

By

Published : Jun 30, 2021, 2:46 PM IST

చిత్రం: కోల్డ్‌కేస్‌; నటీనటులు: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అదితి బాలన్‌, అనిల్‌ నెడుమగద్‌ తదితరులు; సంగీతం: ప్రకాశ్‌ అలెక్స్‌; నిర్మాత: ఆంటో జోసెఫ్‌, జోమోన్‌ టి.జాన్‌, సమీర్‌ మహ్మద్‌; దర్శకత్వం: తను బాలక్‌; విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ఇటీవలి కాలంలో భాషతో సంబంధం లేకుండా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా కరోనాతో ఓటీటీ వేదికగా ఇతర భాషల చిత్రాలను చూసే వారి సంఖ్య కూడా పెరిగింది. మరోవైపు ప్రస్తుతం థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు ఓటీటీ బాటపడుతున్నాయి. కేవలం తెలుగు మాత్రమే కాదు.. తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలు సైతం ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అలా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మలయాళ చిత్రం ‘కోల్డ్‌కేస్‌’. ట్రైలర్‌తోనే ఉత్కంఠ రేపిన ఈ చిత్రం ఎలా ఉంది? పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? వాటిని ఎలా పరిష్కరించాడు?

పోలీస్ అధికారిగా పృథ్వీరాజ్

కథేంటంటే: చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి వలలో ఒక సంచి దొరుకుతుంది. దాన్ని తెరిచి చూడగా అందులో మనిషి పుర్రె కనపడుతుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసు పరిశోధనను ఏసీపీ సత్యజిత్‌(పృథ్వీరాజ్‌ సుకుమారన్‌)కు అప్పగిస్తారు. మరోవైపు మేధా పద్మజ (అదితి బాలన్‌) ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌గా ఓ టెలివిజన్‌ ఛానల్‌లో పని చేస్తుంటుంది. ఆమెకు ఒక కూతురు. కొత్తగా ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అందులోకి వెళతారు. ఆ ఇంటికి వెళ్లిన దగ్గరి నుంచి మేధాకు కొన్ని అనూహ్య సంఘటనలు ఎదురవుతాయి. మేధాకు ఎదురైన ఆ పరిస్థితులు ఏంటి? ఏసీపీ సత్యజిత్‌ పరిశోధన చేస్తున్న కేసుకీ, ఈ ఇంటిలో జరిగే సంఘటనలకు ఉన్న సంబంధం ఏంటి? చెరువులో లభించిన ఆ మనిషి పుర్రె ఎవరిది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: క్రైమ్‌ థ్రిల్లర్‌.. హారర్‌ థ్రిల్లర్‌ ఈ రెండు జోనర్లలో అనేక సినిమాలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. వేటికవే భిన్నమైనవి. క్రైమ్‌ థ్రిల్లర్‌లో పోలీసులు కేసు పరిష్కరించడంతో కథ సుఖాంతమవుతుంది. హారర్‌ థ్రిల్లర్‌లో కథానాయకుడు దెయ్యం పని పట్టడం లేదా? ఆ ఆత్మ పగ తీర్చుకోవడంతో కథ ముగుస్తుంది. ఈ రెండింటినీ మిళితం చేసి తెరకెక్కించిన చిత్రమే ‘కోల్డ్‌ కేస్‌’. సినిమా ప్రారంభంలోనే దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. చెరువులో పుర్రె బయటపడే సీన్‌తో మనం ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ చూస్తున్నామని చెప్పేశాడు. ఒకవైపు సత్యజిత్‌ కేసు టేకప్‌ చేయటం, పుర్రెకు ఉండిపోయిన కట్టుడు పన్ను ద్వారా ఆధారాలు సేకరించే ప్రయత్నం చేయటం, మరోవైపు మేధా కొత్త ఇంట్లోకి వెళ్లిన తర్వాత తన చుట్టూ ఎవరో తిరుగుతున్నారన్న అనుమానం రావటం, ఆ ఇంట్లో ఉన్నదెవరో తెలుసుకునేందుకు ఆత్మల గురించి తెలిసిన మహిళను రప్పించటం ఇలా రెండు వైపుల నుంచి కథ ముందుకు సాగుతుంది. సన్నివేశాలన్నీ ఉత్కంఠగా సాగుతాయి. దర్శకుడు చేసిన మరో మంచి పని ఏంటంటే.. కథ, కథనాల నుంచి పక్కకు వెళ్లిపోలేదు. సబ్‌ప్లాట్స్‌, సాంగ్స్‌, రొమాంటిక్‌ సన్నివేశాలు, ఫైట్స్‌ జోలికి అస్సలు పోలేదు. తను ఎంచుకున్న పాయింట్‌ను పట్టాలపై వెళ్తున్న రైలు మాదిరిగా గాడి తప్పకుండా తీసుకెళ్లాడు. అయితే, ఆ రైలు అప్పుడప్పుడు కాస్త నెమ్మదిగా, ఇంకొన్ని సార్లు వేగంగా పరుగెడుతుందంతే!

కోల్డ్​కేస్ మూవీ రివ్యూ

ద్వితీయార్ధం మొదలైన తర్వాత కథాగమనం నెమ్మదిస్తుంది. కథా, కథనాలు అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తాయి తప్ప ముందుకు వెళ్లవు. ఒకవైపు నుంచి సత్యజిత్‌, మరోవైపు నుంచి మేధా.. ఈ కేసు ఒకరికి తెలియకుండా ఒకరు పరిశోధన చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో నేరుగా కథను క్లైమాక్స్‌కు తీసుకొచ్చేశాడు దర్శకుడు. హంతకుడు ఎవరన్న ప్రశ్న సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని తొలిచేస్తుంటుంది. చివరి 30 నిమిషాలు ఉత్కంఠగా సాగినా.. త్వరగా ముగింపునకు వచ్చేశాడన్న భావన కలుగుతుంది. ఇద్దరూ కలిసిన తర్వాత కథలో ఇంకొంత నాటకీయత కొనసాగించి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అయితే, కథ మరోవైపు మళ్లితే నిడివి పెరిగిపోతుందేమోనని దర్శకుడు భావించి ఉండవచ్చు. ప్రస్తుతం థియేటర్లు తెరిచే పరిస్థితి లేదు కాబట్టి, ఓ మంచి థ్రిల్లర్‌ మూవీని ప్రేక్షకులు ఆస్వాదించవచ్చు. ఇలాంటి సినిమాలకు భాషతో పనిలేదు. భావాన్ని ప్రతి ఒక్కరూ ఫీలవుతారు. సబ్‌టైటిల్స్‌ ఎలాగూ అందుబాటులో ఉంటాయి.

కోల్డ్​కేస్ సినిమాలో పృథ్వీరాజ్

ఎవరెలా చేశారంటే:ఏసీపీ సత్యజిత్‌గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పర్వాలేదు. క్రైమ్‌ థ్రిలర్‌ కాబట్టి, నటనకు పెద్దగా ఆస్కారం ఏమీ ఉండదు. స్క్రిప్ట్‌ను బట్టి నడుచుకుంటూ వెళ్లడమే. మిగిలిన పాత్రలెవరూ తెలుగు వారికి తెలిసిన వాళ్లు కాదు. వారి పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ప్రకాశ్‌ అలెక్స్‌ నేపథ్య సంగీతం సినిమాకు బలం చేకూర్చింది. గిరీష్‌ గంగాధరన్‌, జోమాన్‌ టి.జాన్ సినిమాటోగ్రఫీ ఓకే. హారర్‌ సన్నివేశాల్లో వాళ్ల ప్రతిభ కనపడుతుంది. షమీర్‌ మహ్మద్‌ ఎడిటింగ్‌ బాగుంది. సినిమాకు ఎంత అవసరమో అంతే ఉంచారు. శ్రీనాథ్‌ వి.నాథ్‌ ఎంచుకున్న పాయింట్‌ ఓకే. రెండు వేర్వేరు జానర్లను కలిపి కథ రాసుకున్నారు. అక్కడక్కడా మలయాళ ‘దృశ్యం’, తమిళ ‘ఈరం’ సినిమాలు గుర్తొస్తాయి. శ్రీనాథ్‌ కథను దర్శకుడు తను బాలక్‌ బాగానే తెరకెక్కించాడు. నేరుగా కథలోకి తీసుకెళ్లినా, కథనం నెమ్మదిగా సాగుతుంది. అదే విధంగా క్లైమాక్స్‌ త్వరగా ముగించాడేమోననిపిస్తుంది. అయితే, తను చెప్పాలనుకున్నది పక్కదారి పట్టకుండా బాగా చెప్పాడు.

బలాలు

+ కథ

+ ప్రథమార్ధం

+ సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు

- నెమ్మదిగా సాగే ద్వితీయార్ధం

చివరిగా: క్రైమ్‌+హారర్‌= థ్రిల్లింగ్‌ ‘కోల్డ్‌ కేస్‌’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details