తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Chathur Mukham Review: 'చతుర్‌ ముఖం' ఎలా ఉందంటే?

మలయాళ హిట్​ మూవీ 'చతుర్​ ముఖం' సినిమా ఇప్పుడు తెలుగులో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా మంగళవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ చిత్రం ఎలా ఉంది? ఈ సినిమా కథేంటీ? తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? అనే విషయాలను ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

Chathur Mukham Review
చతుర్​ ముఖం రివ్యూ

By

Published : Aug 17, 2021, 11:30 AM IST

చిత్రం: చతుర్‌ ముఖం

నటీనటులు:మంజు వారియర్‌, సన్నీ వేన్‌, అలెన్సియర్‌ లోపేజ్‌ తదితరులు

సంగీతం:డాన్‌ విన్సెంట్‌

సినిమాటోగ్రఫీ:అభినందన్‌ రామానుజం

ఎడిటింగ్‌:మనోజ్‌

నిర్మాత:జిస్‌ టామ్స్‌, జస్టిస్‌ థామస్‌, మంజు వారియర్‌

రచన:అభయ్‌ కుమార్‌, అనిల్‌ కురియన్‌

దర్శకత్వం:రంజిత్‌ కమలా శంకర్‌, సలిల్‌

విడుదల:ఆహా

అనుపమ్ వారియర్​

ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలు డబ్‌/రీమేక్‌ కావడం సహజం. ఆ సినిమాలు చిత్రీకరణ జరుపుకొని, మన ప్రేక్షకులు చూడాలంటే సమయం పడుతుంది. కానీ, కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ వేదికలు కీలకంగా మారాయి. దీంతో ఒక భాషలో విజయవంతమైన చిత్రాలను ఇతర భాష వారికీ ఓటీటీలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఏడాది కాలంగా ఇలాంటి ఎన్నో చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఈ పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మలయాళంలో వచ్చిన మరో ఆసక్తికర చిత్రం 'చతుర్‌ ముఖం'. తాజాగా ఈ చిత్రం ఆహా ఓటీటీ వేదికగా తెలుగులో విడుదలైంది. మరి ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది?

కథేంటంటే..

తేజస్వినికి (మంజు వారియర్‌) సెల్‌ఫోన్‌ అంటే పిచ్చి. ఎప్పుడూ మొబైల్‌ చేతిలో ఉండాల్సిందే. సెల్ఫీలు దిగి సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేయటం అలవాటు. మరోవైపు స్నేహితుడి ఆంటోనితో (సన్నీ వేన్‌) కలిసి సీసీటీవీ సొల్యూషన్‌ పేరుతో బిజినెస్‌ చేస్తూ ఉంటుంది. ఊళ్లో జరిగే జాతరలో ఫొటోలు తీస్తుండటగా తేజస్విని మొబైల్‌ నీటి కొలనులో పడిపోతుంది. మంచి ఫోన్‌ కొనుక్కొనే లోపు లోకల్‌ మొబైల్‌ వాడదామని ఆన్‌లైన్‌లో ఒక ఫోన్‌ బుక్‌ చేస్తుంది. ఆ ఫోన్‌ తేజస్విని దగ్గరికి వచ్చినప్పటి నుంచి అన్నీ వింతగా జరుగుతుంటాయి. తేజస్విని మొబైల్‌ బ్రాండ్‌నే వినియోగిస్తున్న మరో ఇద్దరు చనిపోతారు. ఇంతకీ ఆ ఫోన్‌లో ఏముంది? ఆ మొబైల్‌ వాడిన ఇద్దరూ ఎందుకు చనిపోయారు? ఆ ఫోన్‌ వల్ల తేజస్వినికి వచ్చిన ఆపద ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఇదీ చదవండి:Netrikann Movie Review: నయనతార 'నెట్రికన్‌' ఎలా ఉందంటే..?

ఎలా ఉందంటే..

ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్న ఏ జీవినైనా నడిపించాలంటే శక్తి ఉండాల్సిందే. ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన శక్తి ఉంటుంది. శరీరం నశించినప్పుడు ఆ శక్తి మరో ప్రాణిలోకి లేదా వస్తువులోకి ప్రవేశిస్తుందని చాలా మంది నమ్ముతారు. అలాగే మంచి శక్తి ఉన్నట్లే.. దుష్టశక్తి ఉంటుంది. 'చతుర్‌ ముఖం' ఇలాంటి విషయాలను చుట్టూ తిరిగే కథ. ఇది ఒక టెక్నో థ్రిల్లర్‌. తేజస్వినిలాంటి యువత స్మార్ట్‌ఫోన్‌కు ఎలా బానిసలవుతున్నారన్న విషయాన్ని చెబుతూ నెమ్మదిగా కథను ప్రారంభించిన దర్శకుడు. తేజస్విని సెల్‌ఫోన్‌ పోవడం, ఆ తర్వాత కొత్త మొబైల్‌ రావటం, అది వచ్చిన దగ్గరి నుంచి వింతలు జరగడం తదితర సన్నివేశాలను చూస్తుంటే ఇదేదో దెయ్యం కథేమో అని ప్రేక్షకుడు భావిస్తాడు.

అయితే, ఫోన్‌ వెనుక ఉన్న మతలబు ఏంటో తెలుసుకునేందుకు తేజస్విని చేసే ప్రయత్నంలో ఆమెకు ఊహించని విషయాలు తెలుస్తాయి. విరామ సమయానికి ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి, కథ, కథనాలపై మరింత ఆసక్తి పెంచాడు. ఆ బ్రాండ్‌ ఫోన్‌ వాడుతున్న వాళ్లు ఎలా చనిపోతున్నారన్నది ఆంటోనీ, ప్రొఫెసర్‌లతో కలిసి తేజస్విని కనుకొనుక్కే ప్రయత్నంతో ద్వితీయార్ధం నడుస్తుంది. ఆయా సన్నివేశాలు ఉత్కంఠగా అనిపిస్తాయి. అక్కడక్కడా రజనీ-శంకర్‌ల '2.ఓ' తాలూకూ సన్నివేశాలు ప్రేక్షకుడికి స్పురణకు వస్తాయి. పతాక సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా సాగుతాయి. ప్రొఫెసర్‌ చేసిన పని కారణంగా ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందా? అన్న రీతిలో ఒక ప్రశ్న వేసి వదిలేశాడు దర్శకుడు. అయితే, హారర్‌ చిత్రాలు నిడివి ఎంత తక్కువ ఉంటే అంత బాగుంటాయి. 'చతుర్‌ముఖం' 2 గంటలా 15 నిమిషాలు ఉంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు, పాటలకు కత్తెర వేసి ఉంటే సినిమా చాలా బాగుండేది.

సినిమాలోని ఓ దృశ్యం

ఎవరెలా చేశారంటే..

'చతుర్‌ ముఖం'లో నటించిన ప్రేక్షకులు ఎవరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వాళ్లు కాదు. అయితే, ఎక్కువ తికమక లేకుండా నాలుగైదు పాత్రలతో దర్శకుడు కథా, కథనాలను నడిపించాడు. కీలక పాత్రలో నటించిన మంజు వారియర్‌, సన్నీ వేన్‌, అలెన్సియర్‌ లోపేజ్‌ వారి పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతికంగా సినిమా బాగుంది. డాన్‌ విన్సెంట్‌ సంగీతం, అభినందన్‌ రామానుజం సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరాయి. మనోజ్‌ ఎడిటింగ్‌ ఓకే. కాస్త నిడివి పెరిగింది అంతే. అభయ్‌ కుమార్‌, అనిల్‌ కురియన్‌ అనుకున్న కథను దర్శకుడు రంజిత్‌ కమలా శంకర్‌, సలల్‌కు చక్కగా చూపించారు. అసలు పాయింట్‌కు రావడానికి కాస్త సమయం తీసుకున్నా, ఓవరాల్‌గా మంచి థ్రిల్లర్‌ చూశామన్న భావన ప్రేక్షకుడిలో కలుగుతుంది. సెల్‌ఫోన్స్‌, రేడియేషన్‌ ఇలా మానవ జీవితంపై ప్రభావితం చేసే అంశాలను దర్శకుడు టచ్‌ చేసే ప్రయత్నం చేశాడు. సైన్స్‌, నెగెటివ్‌ ఎనర్జీ ఇలా కొన్ని టెక్నికల్‌ అంశాలు సామాన్యుడికి కాస్త అర్థంకాకపోవచ్చు.

బలాలు

కథ, నటీనటులు, సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు

అక్కడక్కడా కాస్త నెమ్మదిగా సాగే కథనం

చివరిగా: 'చతుర్‌ ముఖం' భయపెట్టదు కానీ, 'టెక్నో-థ్రిల్లర్‌' మెప్పిస్తుంది.

గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ఇదీ చదవండి:'భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా' మెప్పించిందా?

ABOUT THE AUTHOR

...view details