చిత్రం: చావు కబురు చల్లగా
నటీనటులు: కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, మురళీ శర్మ తదితరులు
సంగీతం: జేక్స్ బిజోయ్
నిర్మాత: బన్ని వాసు
దర్శకత్వం: కౌశిక్ పెగళ్లపాటి
విడుదల తేదీ: 19-03-2021
'RX 100'లో శివగా కనిపించి యువతను అమితంగా ఆకట్టుకున్నాడు కార్తికేయ. ఆ తర్వాత అంతటి స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ లోటు 'చావు కబురు చల్లగా'తో తీరుస్తానని అభిమానులకు మాటిచ్చాడు. ఇకపై శివగా కాదు బస్తీ బాలరాజుగా గుర్తుండిపోతానని చెప్పాడు. మరి కార్తికేయకు అనుకున్న ఫలితం దక్కిందా?ఈ బస్తీబాలరాజు కథేంటి?
కథేంటంటే: బస్తీ బాలరాజు (కార్తికేయ) మార్చురీ వ్యాన్ నడిపే డ్రైవర్. మల్లిక (లావణ్య త్రిపాఠి) ప్రభుత్వాసుపత్రిలో నర్సు. పనిలో భాగంగా ఓ రోజు శవాన్ని తీసుకెళ్లేందుకు శేఖర్ స్యాముయేల్ ఇంటికి వెళ్తాడు బాలరాజు. అక్కడ మల్లికను చూసి ఇష్టపడతాడు. బాలరాజు తీసుకెళ్లే శవం ఎవరిదో కాదు మల్లిక భర్తది. ఈ విషయం తెలిసినా సరే మల్లిక వెంటపడటం మానడు బాలరాజు. ఎలాగైనా మల్లిక మనసును గెలిచేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అలా వితంతవును ప్రేమించే కొడుకును వాళ్లమ్మ గంగమ్మ (ఆమని), మల్లిక అత్తామామలు (మురళీ శర్మ, రజిత) అంగీకరిస్తారా? బాలరాజు, మల్లిక ఒకటవుతారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: వితంతు వివాహాలు సాంఘిక దురాచారమన్న మూఢనమ్మకాన్ని పోగొట్టడానికి ఎంతోమంది సంఘ సంస్కర్తలు విశేషంగా కృషి చేశారు. నేటి ఆధునిక కాలంలోనూ వితంతువుల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతుండటం దురదృష్టకరం. భర్తను కోల్పోయిన మహిళను ప్రేమించడం అనే కాన్సెప్ట్ తెలుగు తెరకు కొత్త కాకపోయినా, ఇలాంటి ప్రేమ కథలు రావడం అరుదు. అవి ఎక్కువగా ఎమోషన్ కోణంలో సాగితే ఈ ‘చావు కబురు చల్లగా’ పూర్తిగా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఇందులో శవం దగ్గర ప్రేమ పుట్టడం అన్న పాయింటే ఆసక్తికరం. ‘రోజూ బడికి పోయేటోడు బళ్లో పిల్లను చూసి ఇష్టపడతాడు.. రోజూ ఆఫీస్‌కు పోయేవాడు ఆఫీస్‌లో పిల్లను చూసి ఇష్టపడతాడు.. పొద్దున్న లేస్తే నాలా చావులకు పోయేటోడు చావుకాడ కాకపోతే ఇంకెక్కడ చూసి ఇష్టపడతాడు మల్లి’ అంటూ కథానాయకుడితోనే డైలాగ్ చెప్పించి ప్రేక్షకులను కథకు కనెక్ట్ అయ్యేలా చేశాడు దర్శకుడు. వితంతువు అయిన మల్లికను బాలరాజు ప్రేమించటం, ఆమె ఉన్న చోటుకు వెళ్లి తన ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశాలు నవ్వులు పంచుతూ హాయిగా సాగిపోతాయి. ప్రథమార్ధం బాలరాజు అతని స్నేహితులు, మల్లికతో వచ్చే సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది.
ద్వితీయార్ధంలో అసలు కథ మొదలవుతుంది. నాయకా నాయికకు, హీరోకు తన తల్లికి, హీరోకు హీరోయిన్ మామయ్యకు మధ్య సన్నివేశాలు కాస్త సీరియస్‌గా సాగుతాయి. ఆయా సందర్భాల్లో వచ్చే సంభాషణలు భావోద్వేగానికి గురిచేస్తాయి. తండ్రి ఉండగానే కథానాయకుడు తన తల్లికి రెండో పెళ్లి చేయాలనుకోవడం ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. అయితే, ఇక్కడ కూడా బాల్య వివాహాల వల్ల మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారన్న సందేశాన్ని కథానాయకుడి తల్లి పాత్ర ద్వారా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తన తల్లి జీవితం గురించి నాయికకూ, నాయిక మామయ్యకూ కథానాయకుడు వివరించే తీరు ఓకే అనిపిస్తుంది. ‘ప్రేమ అంటే ఇద్దరు మనుషుల మధ్య మాత్రమే కాదు పుట్టుకకు, చావుకు మధ్య ఉండేది’ వంటి డైలాగ్‌లు అలరిస్తాయి. అందరూ ఊహించిన ముగింపుతోనే కథను సుఖాంతం చేశాడు దర్శకుడు. ‘అనసూయ’ ప్రత్యేక గీతం సినిమాకు అదనపు ఆకర్షణ.