నటీనటులు: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్ తదితరులు. కథ, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ; నిర్మాత: అక్కినేని నాగార్జున; స్క్రీన్ ప్లే: సత్యానంద్ సంగీతం: అనూప్ రూబెన్స్; నిర్మాణ సంస్థ: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. విడుదల: 13 జనవరి 2021.
పండగలాంటి సినిమా.. పండగకే రావాలంటూ నాగార్జున పట్టుపట్టి చేసిన సినిమా 'బంగార్రాజు'. ఆయన అనుకున్నట్టే సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విజయవంతమైన 'సోగ్గాడే చిన్నినాయనా'కు కొనసాగింపు చిత్రం కావడం, తండ్రి నాగార్జునకు తోడుగా తనయుడు నాగచైతన్య కూడా చిన బంగార్రాజు పాత్రలో నటించడం, పండగ సినిమాల్లో అగ్ర తారలు నటించిన సినిమా ఇదే కావడం.. తదితర కారణాలతో విడుదలకు ముందే అందరి దృష్టినీ ఆకర్షించింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? బంగార్రాజు పాత్రల్లో తండ్రీ తనయులు చేసిన సందడి ఎలా ఉంది? తదితర విషయాలు తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం.
కథేంటంటే?
సోగ్గాడే చిన్నినాయనా కథ ముగిసిన చోట నుంచి బంగార్రాజు కథ మొదలవుతుంది. కొడుకు రాము (నాగార్జున), కోడలు (సీత)లని కలిపి వాళ్ల సమస్యని పరిష్కరించి పైకి వెళ్లిన బంగార్రాజు (నాగార్జున), ఈసారి మనవడు చిన బంగార్రాజు(నాగచైతన్య) కోసం పై నుంచి కిందకి రావల్సి వస్తుంది. అతని మనవడి కళ్యాణంతో పాటు, లోక కళ్యాణం కోసం బంగార్రాజును కిందకి పంపిస్తాడు యమధర్మరాజు. అలా చిన బంగార్రాజులోకి ఆత్మగా దూరి అతనికి పెద బంగార్రాజు ఎలా సాయం చేశాడు? భార్య సత్యభామ (రమ్యకృష్ణ) కోరిక మేరకు చిన్న బంగార్రాజునీ, నాగలక్ష్మి (కృతిశెట్టి)నీ ఎలా కలిపాడు? చిన బంగార్రాజుని చంపాలనే కుట్రతోపాటు, ఊరి గుడిలో ఉన్న నిధులపై కన్నేసిన దుష్ట శక్తుల కుతంత్రాల్ని బంగార్రాజు ఎలా తిప్పికొట్టాడన్నదే మిగతా కథ.
ఎలా ఉందంటే?
పండగలాంటి సినిమా అని చెబుతూ వచ్చిన చిత్రబృందం అందుకు తగ్గ హంగుల్ని పక్కాగా మేళవించింది. గ్రామీణ నేపథ్యం, ఆకట్టుకునే తారాగణం, కలర్‌ఫుల్ పాటలకితోడు అభిమానుల్ని మెప్పించే అంశాల్ని జోడించి సినిమాని తీర్చిదిద్దారు. పండగ సమయంలోనే విడుదలైంది కాబట్టి సందడికి ఢోకా లేదన్నట్టుగా సాగిపోతుంది సినిమా. `సోగ్గాడే చిన్నినాయనా` కథకి కొనసాగింపుగా వచ్చిన చిత్రం కాబట్టి తొలి సినిమా తరహాలోనే పక్కా ఫార్ములాతో గుడికీ, బంగార్రాజు కుటుంబానికీ ముడిపెట్టి కథని అల్లుకున్నారు దర్శకుడు. తొలి సినిమాలో తనయుడి సమస్యయితే, ఇందులో మనవడి జీవితాన్ని చక్కబెడతారు. తొలి సినిమాలో బంగార్రాజు మాత్రమే ఆత్మ, ఇందులో మాత్రం ఆయనకి సత్యభామ కూడా తోడైంది. ప్రథమార్థం అంతా మన్మథుడుగా ముద్రపడిన చినబంగార్రాజు, ఊరి సర్పంచ్ అయిన నాగలక్ష్మి హంగామాతోనే సాగుతుంది. ఒకరంటే ఒకరికి పడని ఆ ఇద్దరూ కలిసే వైనం, పెద్ద బంగార్రాజు చేసే మేజిక్‌తో సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి. ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం ఆసక్తిని పెంచుతుంది. చాలా సన్నివేశాలు ఊహాజనితంగానే సాగినప్పటికీ మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే అంశాల్ని పుష్కలంగా జోడించారు. మామిడి తోటలో చిన్న పిల్లాడిని కాపాడే సన్నివేశాలు, పతాక సన్నివేశాల్లో గుడి దగ్గర చోటు చేసుకునే మలుపు మాస్ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించేవే. అత్తమామలు, కోడలికి మధ్య మనస్పర్థల్ని తొలిగించే ఓ సన్నివేశంలో బంగార్రాజు చెప్పే సంభాషణలు, ఆ నేపథ్యంలో పండే భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. కొనసాగింపు చిత్రం అన్నప్పుడు తప్పకుండా ప్రేక్షకుడికి తొలి సినిమా గుర్తుకొస్తూనే ఉంటుంది. తొలి చిత్రంలో బంగార్రాజు సరసాలు చక్కటి వినోదాన్ని పంచిపెడతాయి. యువ కథానాయకుడు నాగచైతన్య ఈసారి కథలోకి వచ్చినా ఆ ప్రభావం సినిమాలో పెద్దగా కనిపించలేదు. ఆత్మల కథల్లోనూ... కమర్షియల్ కథల్లోనూ లాజిక్‌లు వెతక్కూడదు కానీ, ఇందులో కొన్ని విషయాలు మరీ నాటకీయంగా అనిపిస్తాయి. పైలోకంలో నిమిషాలే, అక్కడ యేళ్లు తరహా డైలాగులతో ఎంతగా కప్పిపెట్టే ప్రయత్నం చేసినా కొన్ని సన్నివేశాలు లాజిక్‌కి ఏమాత్రం అందవు.
ఎవరెలా చేశారంటే?
సోగ్గాళ్లుగా నాగార్జున, నాగచైతన్యలు చేసిన హంగామానే సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆత్మగా దూరితే తప్ప సందడి చేయలేని విధంగా నాగచైతన్య పాత్రని తీర్చిదిద్దడంతో చాలా చోట్ల నాగార్జునే హైలెట్ అయ్యారు. ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం ఆకట్టుకుంటుంది. రమ్యకృష్ణ, కృతిశెట్టి పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. నాగలక్ష్మి పాత్రపై కృతి తనదైన ముద్ర వేసింది. సంపత్ రాజ్, రావు రమేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ఝాన్సీ, యముడిగా నాగబాబు తదితరులు పాత్రల పరిధి మేరకునటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. యువరాజ్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. అనూప్ పాటలుసినిమాకి ప్రధాన బలం. విజువల్‌గా కూడా పాటలు ఆకట్టుకుంటాయి. దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ రచన పరంగా తనదైన ప్రభావం చూపించారు. ముఖ్యంగా మాటల్లో చమక్కులు కనిపిస్తాయి. కథనం పరంగానే కసరత్తులు చాలలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు