akhanda review: చిత్రం: అఖండ; నటీనటులు: బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ, సుబ్బరాజు తదితరులు; సంగీతం: తమన్; మాటలు: ఎమ్.రత్నం; పోరాటాలు: స్టంట్ శివ, రామ్, లక్ష్మణ్; నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి; దర్శకత్వం: బోయపాటి శ్రీను; సంస్థ: ద్వారక క్రియేషన్స్; విడుదల: 2021 డిసెంబర్ 2
balayya akhanda: బాలకృష్ణ ఓ ఆటం బాంబ్ అని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇటీవల అన్నారు. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో ఆయనకు.. ఆయన నటనకు ఉన్న శక్తి అలాంటిది. ఆయనతో దర్శకుడు బోయపాటి శ్రీను కలిశారంటే బాక్సాఫీసు దగ్గర రికార్డుల విధ్వంసమే. ఆ విషయం ఇదివరకే రుజువైంది. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత ఆ కలయికలో రూపొందిన చిత్రమే ‘అఖండ’. దీనికి కొబ్బరికాయ కొట్టినప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో మరింత ఉత్సుకతను రేకెత్తింతాయి. మరి ‘అఖండ’ అవతారంలో బాలకృష్ణ గర్జన ఎలా ఉంది? బాలకృష్ణ - బోయపాటి కలయిక హ్యాట్రిక్ కొట్టినట్టేనా? తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం పందడి..
కథేమిటంటే:మురళీకృష్ణ (బాలకృష్ణ) ఫార్మరే కాదు, రీ ఫార్మర్ అని అని చెబుతుంటారు అనంతపురం ప్రజలు. ఫ్యాక్షనిజం బాట పట్టిన ఎంతోమందిని దారి మళ్లించి మార్పుకు శ్రీకారం చుడతాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆస్పత్రుల్ని కట్టించి ప్రజలకు సేవ చేస్తుంటాడు. అది చూసే ఆ జిల్లాకి కొత్తగా వచ్చిన కలెక్టర్ శరణ్య (ప్రగ్యాజైస్వాల్) మురళీకృష్ణపై మనసు పడుతుంది. ఆయన్ని మనువాడుతుంది. ఆ ప్రాంతంలో వరద రాజులు (శ్రీకాంత్ ) మైనింగ్ మాఫియాను నడుపుతుంటాడు. యురేనియం తవ్వకాలతో చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. మైనింగ్ మాఫియా భరతం పట్టేందుకు రంగంలోకి దిగిన మురళీకృష్ణకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వరద రాజులు వెనక ఉన్న మాఫియా లీడర్ ఎవరు? చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయిన మురళీకృష్ణ తోడ బుట్టిన శివుడు (బాలకృష్ణ) ఎక్కడ పెరిగాడు? ఊహ తెలియకముందే వారిద్దరూ విడిపోవడానికి కారణమేమిటి? మళ్లీ ఎలా కలిశారు? మురళీకృష్ణకు, కుటుంబానికి శివుడు ఎలా సాయం చేశాడన్నదే మిగతా కథ.
ఇది చూడండి: ఓటీటీలో బాలయ్య కొత్త ప్రయోగం.. ఆధ్యాత్మిక కార్యక్రమంతో!
ఎలా ఉందంటే: బాలకృష్ణ-బోయపాటి కలయిక నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏమేం ఆశిస్తారో ఆ అంశాలన్నీ పక్కాగా కుదిరిన సినిమా ఇది. శివుడు అలియాస్ అఖండగానూ.. మురళీకృష్ణ పాత్రలోనూ బాలకృష్ణ తనదైన శైలిలో ఒదిగిపోయారు. అఖండ పాత్రలోనైతే ఆయన రౌద్ర ప్రదర్శన తీరు విశ్వరూపమే. ఇందులోని ఒక పాత్ర ప్రళయాన్ని గుర్తు చేస్తే, మరో పాత్ర ప్రకృతిలా అందంగా తెరపై కనిపిస్తుంది. కథానాయకుడి పరిచయ సన్నివేశాలు మొదలుకొని చివరి వరకు ప్రతీ సన్నివేశం కూడా బాలకృష్ణ మాస్ ఇమేజ్, బోయపాటి మార్క్ థీమ్ మేరకు సాగుతుంది. అభిమానులతో ఈలలు కొట్టించే ఎలివేషన్ సన్నివేశాలు అడుగడుగునా ఉంటాయి.
ప్రథమార్థం మురళీకృష్ణ - శరణ్యల మధ్య ప్రేమాయణం, పీఠాధీశుడిని చంపి శక్తి స్వరూపానంద స్వామిగా అవతరించి మైనింగ్ మాఫియాతో చేయించే ఆకృత్యాలతో సాగుతుంది. రైతుగా, ఆ ప్రాంత ప్రజల మేలుని కోరే వ్యక్తిగా మురళీకృష్ణ పాత్రలో బాలకృష్ణ ఆకట్టుకుంటారు. ప్రకృతి గురించి ఆయన చెప్పే సంభాషణలు అలరిస్తాయి. జై బాలయ్య పాట కిక్కెక్కిస్తే, అడిగా అడిగా.. పాటలో బాలకృష్ణ - ప్రగ్యా జోడీ చూడముచ్చటగా కనిపిస్తుంది. ఒకే పాటలోనే నాయకానాయికలకు పెళ్లి కావడం, పాప పుట్టడం, ఆ పాప ప్రోద్భలంతోనే రెండో పాత్ర అఖండను పరిచయం చేసిన తీరు బాగుంది.
ఇది చూడండి:బాలయ్య చెప్పిన ఆ మాట నా గుండెను కదిలించింది: బోయపాటి
ప్రథమార్థానికి ముందు అఖండ పాత్ర ఆగమనం జరుగుతుంది. సినిమా అక్కడిదాకా ఒకెత్తు, అఖండ పాత్ర ప్రవేశం తర్వాత మరో ఎత్తు. ప్రకృతి, చిన్నారులు, ముక్కంటి జోలికి వచ్చిన ప్రతినాయకుడిని అఖండ ఎలా అంతం చేశాడనేది ద్వితీయార్థంలో కీలకం. బాలకృష్ణ చేసిన రెండో పాత్రను అఘోరాగా చూపించడం సినిమాకు ప్లస్సయ్యింది. అఖండ శివుడి అంశతోనే పుట్టాడనే సంకేతాలు కనిపిస్తాయి కాబట్టి ఆ పాత్రలో బాలకృష్ణ ఎన్ని విన్యాసాలు చేసినా నమ్మేలా ఉంటాయి. ఆయన చెప్పే ప్రతీ సంభాషణ ఓ పోరాటంలా, ప్రతీ పోరాటం ఓ క్లైమాక్స్ సన్నివేశాన్ని తలపించేలా ఉంటుంది. బాలకృష్ణని బోయపాటి శక్తివంతంగా చూపిస్తారని తెలుసు, కానీ ఇందులో డోస్ మరింత పెంచారు.
ఇందులో కథ కంటే కూడా పాత్రల్ని మలిచిన తీరే ఆకట్టుకుంటుంది. బాలకృష్ణ దేవుడు, విజ్ఞానానికీ మధ్య సంబంధం గురించి, హిందూత్వం గురించీ, బోత్ ఆర్ నాట్ ది సేమ్ అంటూ శివుడు మామూలు మనిషి కాదంటూ చెప్పే సంభాషణలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. చిన్నారులు, దేవాలయాలు, దేవుడు, ప్రకృతి తదితర అంశాల నేపథ్యంలో అక్కడక్కడా భావోద్వేగాలు పండాయి. మొత్తంగా మాస్ ప్రేక్షకుల్ని ఉత్సాహంగా థియేటర్లకు రప్పించే పక్కా పైసా వసూల్ చిత్రమిది.