నటీనటులు: అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, సత్య, అర్చన, సౌందర్య తదితరులు; సంగీతం : జిబ్రాన్; నిర్మాత : పద్మావతి గల్లా; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య; సంస్థ: అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్; విడుదల: 2022 జనవరి 15
ఈ సంక్రాంతికి మరో కొత్త `హీరో` తెరకు పరిచయమయ్యారు. కృష్ణ కుటుంబం నుంచి వస్తున్న ఆ హీరోనే అశోక్ గల్లా. మహేశ్‌బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్. ఆయన్ని పరిచయం చేసే బాధ్యతను విభిన్నమైన కథలతో సినిమాలు తీస్తున్న శ్రీరామ్ ఆదిత్యకు అప్పజెప్పారు. విడుదలైన `హీరో` ప్రచార చిత్రాలు ఆసక్తిని రేకెత్తించేలా ఉండటం, ప్రతీసారీ ఓ కొత్త రకమైన రుచుల్ని అందించే దర్శకుడు కావడం వల్ల సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. అనుకోకుండా సంక్రాంతి బెర్తు దొరకడం ఈ సినిమాకు కలిసొచ్చిన మరొక విషయం. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం.
కథేంటంటే?
సినిమా హీరో కావాలని కలలు కనే ఓ మధ్య తరగతి యువకుడు అర్జున్ (అశోక్ గల్లా). పక్కింటి అమ్మాయి సుబ్బును(నిధి అగర్వాల్) చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంటారు. ఇంతలో అర్జున్ చేతికి ఓ కొరియర్ అందుతుంది. అందులో ఓ గన్ ఉంటుంది. ముంబయి మాఫియాకి చెందిన గన్ అది. ఆ తర్వాత మరో కొరియర్‌లో చంపమని చెబుతూ ఓ ఫొటో అందుతుంది. ఆ గన్, ఫొటోను అర్జున్‌కు పంపడానికి కారణమేమిటి? ఇంతకీ ఆ ఫొటోలో ఎవరున్నారు? ముంబయి మాఫియాకు, అర్జున్‌కు సంబంధమేమిటి? అర్జున్ హీరో అయ్యాడా? సుబ్బును పెళ్లి చేసుకున్నాడా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఓ కొత్త హీరోని పరిచయం చేస్తున్నప్పుడు అది కూడా సినీ కుటుంబానికి చెందిన వారసుడు అన్నప్పుడు ఎక్కువగా అలవాటైన మాస్ కథలనో లేదంటే ప్రేమకథలనో ఎంచుకుంటుంటారు దర్శకులు. శ్రీరామ్ ఆదిత్య మాత్రం మరోసారి తన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ, సినిమాలో అనిల్ రావిపూడి చెప్పినట్టుగా ఔట్ ఆఫ్ ది బాక్స్‌గా ఆలోచించి కామెడీతో కూడిన ఓ కొత్త రకమైన కథ రాసుకున్నారు. అదే సమయంలో హీరో స్కిల్స్‌ను బయటపెట్టే అంశాలు కూడా ఇందులో ఉండటం మరింత ప్రత్యేకం. ఇదొక కొత్త రకమైన జోనర్ సినిమా అని చెప్పొచ్చు. ప్రేమ, మాఫియా నేపథ్యం, థ్రిల్లింగ్ అంశాలు, హాస్యాన్ని మేళవింపుతో ఈ సినిమా తీయడం మెప్పిస్తుంది.
తొలి సగభాగం రేసీగా సాగే కథనంతో సినిమా చక్కటి వినోదాన్ని పంచుతుంది. హీరో పరిచయ సన్నివేశాలు మొదలుకొని, అతని ప్రేమకథ, ఆ తర్వాత గన్ చేతికందాక చోటు చేసుకునే మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ద్వితీయార్థంలోనే కథను సాగదీసినట్టు అనిపిస్తుంది. మాఫియా నేపథ్యాన్ని మరీ సిల్లీగా మలచడం, సీఐపై జరిగిన ఫైరింగ్ కేసు వదిలేయడంతో అప్పటిదాకా ఆసక్తికరంగా అనిపించిన సినిమా కాస్త గాడితప్పినట్టుగా అనిపిస్తుంది. మూల కథ మరీ పలచగా ఉండటం వల్ల కథ అక్కడక్కడే తిరిగినట్టుగా అనిపిస్తుంది. అయితే కామెడీ మాత్రం చివరి వరకూ పండటం సినిమాకు కలిసొచ్చే విషయం. పతాక సన్నివేశాల్లో బ్రహ్మాజీ నేపథ్యంలో పండే కామెడీ సినిమాకు హైలెట్‌గా నిలిచింది.