చిత్రం: గంగూబాయి కతియావాడి; నటీనటులు: ఆలియా భట్, అజయ్‌దేవ్‌గణ్, విజయ్ రాజ్, శంతను మహేశ్వరి, ఇందిరా తివారి తదితరులు; సంగీతం: సంచిత్ బల్హారా, అంకింత్ బల్హారా, సంజయ్(పాటలు); నిర్మాత: జయంతిలాల్ గడా; రచన, దర్శకత్వం, ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ; విడుదల: 25-02-2022; బ్యానర్: భన్సాల్సీ ప్రొడక్షన్స్, పెన్ ఇండియా లిమిటెడ్
Alia bhatt Gangubai kathiawadi: వైవిధ్యభరిత నాయికా ప్రాధాన్య కథలు ఎంచుకుంటూ.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ నటి ఆలియా భట్. ఇప్పుడీ పంథాలోనే ఆమె చేసిన మరో విభిన్న చిత్రం 'గంగూబాయి కతియావాడి'. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు. అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి తదితరులు అతిథి పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ఆలియా(alia bhatt) వేశ్య పాత్రలో నటించడం.. ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటం వల్ల సినీప్రియుల్లో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా? అసలు గంగూబాయి కథేంటి? ఆ పాత్రలో ఆలియా అభినయం ఎలా ఉంది?(gangubai kathiawadi review)
కథేంటంటే:గుజరాత్‌లోని ఓ ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి గంగూబాయి అలియాస్ గంగూబాయి హర్జీవందాస్ (ఆలియా భట్)(alia bhatt). చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఎప్పటికైనా వెండితెరపై కనిపించాలని కల. ఆమె ఆసక్తిని, అమాయకత్వాన్ని ఆసరా తీసుకున్న ఆమె ప్రియుడు.. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి, ఆమెను ముంబై తీసుకొచ్చి కామాటిపురలోని ఓ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. అనుకోకుండా ఆ వలలో చిక్కుకున్న గంగూ.. తప్పనిసరి పరిస్థితుల్లో మనసు చంపుకొని ఆ వేశ్యా వృత్తిలోనే కొనసాగుతుంది. మరి ఆ తర్వాత ఆమె జీవన ప్రయాణం ఎలా సాగింది? వేశ్యగా జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. కామాటిపురకు నాయకురాలిగా ఎలా ఎదిగింది? ఈ విషయంలో అండర్ వరల్డ్ డాన్ రామ్‌లాలా ఆమెకు ఎలా సహాయ పడ్డాడు? వేశ్యా వాటికకు నాయకురాలిగా ఎదిగాక.. అక్కడున్న 4వేల మంది మహిళల హక్కుల కోసం ఆమె ఏవిధంగా పోరాడింది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లేంటి? ఆఖరికి ఆమె దేశ ప్రధానిని ఎందుకు కలిసింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!(gangubai kathiawadi review)
ఎలా సాగిందంటే: ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' నవల ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమా తీశారు. 1950-1960ల మధ్య కాలంలో సాగుతుంది. వేశ్యా వృత్తిలో మగ్గిపోతున్న మహిళల హక్కుల కోసం, వారి పిల్లలకు విద్యనందించడం కోసం గంగూబాయి చేసిన పోరాటమే ఈ చిత్ర కథ. ఈ జీవిత కథను ఎక్కడా వాణిజ్య హంగుల జోలికి పోకుండా నిజాయితీగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ముంబయిలోని కామాటిపుర వాతావరణాన్ని, ఆడపిల్లలు అక్కడి వేశ్యా గృహాల్లో బందీలవుతున్న తీరును.. భావోద్వేగభరితంగా చూపిస్తూ సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. అనంతరం అక్కడ చిక్కుకున్న ఓ పాప కోసం గంగూబాయి రావడం.. ఆ పిల్లకు తన గతాన్ని చెప్పడంతో మెల్లగా అసలు కథ మొదలవుతుంది. చిన్నవయసులో గంగూ ప్రేమలో మోసపోయిన తీరు, వేశ్యా వాటికలో చిక్కుకున్నాక ఆమె ఎదుర్కొన్న చిత్రవధలు మనసుల్ని కదిలిస్తాయి. ఆమె క్రమంగా ఆ వృత్తికి అలవాటు పడటం.. అక్కడి నుంచి తన యజమానురాలిపై పై చేయి సాధించి ఆ వేశ్యా గృహాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం వంటి సన్నివేశాలతో కథ సాఫీగా సాగిపోతుంటుంది. అనుకోకుండా ఓ రోజు గంగూపై దాడి జరగడం.. ఆ తర్వాత రామ్‌లాలాతో ఆమెకు పరిచయం ఏర్పడేసరికి సినిమా ఆసక్తికర మలుపు తీసుకుంటుంది. అతని అండతో ఆమె కామాటిపురకు నాయకురాలిగా ఎదగాలనుకోవడం.. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లతో ప్రధమార్ధం తీర్చిదిద్దాడు దర్శకుడు.
ప్రథమార్ధంలో బలమైన సంఘర్షణ లేకున్నా.. ఆసక్తికరంగానే సాగిన కథనం ద్వితీయార్ధానికి వచ్చే సరికి పూర్తిగా చప్పబడిపోతుంది. కామాటిపురకు నాయకురాలిగా ఎదిగే క్రమంలో గంగూ ఎలాంటి ఒడుదొడుకులు దాటొచ్చిందన్నది ఆసక్తికరంగా చూపించలేకపోయారు భన్సాలీ. నిజానికి ఇక్కడ బలమైన డ్రామా పండించే అవకాశమున్నా దాన్ని సరిగా వినియోగించుకోలేకపోయారు. అలాగే గంగూ వేశ్య వాటికలోని మహిళల తరపున చేసే పోరాటాన్ని భావోద్వేగభరితంగా చూపించలేకపోయారు. దానికి తోడు సన్నివేశాలన్నీ సాగదీతగా అనిపిస్తాయి. ముగింపునకు ముందు బహిరంగ సభలో ఆమె చేసే ప్రసంగం, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎదుట ఆమె వేసే ప్రశ్నలు అందరినీ ఆలోచింపజేస్తాయి.(gangubai kathiawadi review)
ఎవరెలా చేశారంటే: గంగూబాయి పాత్రలో ఆలియా (alia bhatt) జీవించిన తీరు ప్రతి ఒక్కరి చేత చప్పట్లు కొట్టిస్తుంది. ఆ పాత్రలో ఆమె పలికించిన హవభావాలు, చూపించిన గాంభీర్యం, పలికిన సంభాషణలు మెప్పిస్తాయి. ఇటు భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ.. అటు ఉద్వేగభరిత సన్నివేశాల్లోనూ చక్కటి అభినయం ప్రదర్శించింది. ప్రథమార్ధంలో వచ్చే ఆమె ప్రేమకథ మనసుల్ని హత్తుకుంటుంది. ప్రచార సభలో గంగూ మాట్లాడే మాటలు ఓవైపు నవ్వులు పూయిస్తూనే.. మరోవైపు ఆలోచింపజేస్తుంటాయి. రామ్‌లాలా పాత్రకు అజయ్ దేవ్‌గణ్ నిండుతనం తెచ్చారు. ఆయనది అతిథి పాత్రే అయినా తెరపై కనిపించిన ప్రతిసారి తనదైన నటనతో మెప్పిస్తారు.(gangubai kathiawadi review) సంజయ్ లీలా కథను తీర్చిదిద్దిన విధానం.. ఆ కథను చూపించడం కోసం సృష్టించిన ప్రపంచం ఆకట్టుకుంటుంది. ఈ కథను కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకొని మరింత సంఘర్షణతో తీర్చిదిద్దుకుని ఉంటే మరింత ఆసక్తికరంగా ఉండేది. ముఖ్యంగా సినిమా నిడివి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. కత్తెరకు పని చెప్పాల్సిన అనవసర సన్నివేశాలు సినిమా మొత్తం లెక్కకు మిక్కిలిగా కనిపిస్తాయి. ఈ చిత్రానికి ఆర్ట్ వర్క్, ఛాయాగ్రహణం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పాటలు, నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తాయి. కథకు తగ్గట్లుగా నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు