తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రివ్యూ: గ్యాప్ వచ్చినా.. కేక పుట్టించాడు! - Ala vaikuntapuramlo

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా నేడు విడుదలైంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఎలా ఉందో ఓ లుక్కేద్దాం!

Ala Vaikuntapuramulo Movie Review
అల.. వైకుఠపురములో

By

Published : Jan 12, 2020, 11:26 AM IST

Updated : Jan 12, 2020, 12:37 PM IST

అల్లు అర్జున్‌-తివిక్రమ్‌ కాంబినేషన్‌ అనగానే మనకు ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాలే గుర్తుకొస్తాయి. ఈ రెండూ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’ ఒక సరదా సినిమా చేయాలన్న ఉద్దేశంతో చాలా రోజులు వెయిట్‌ చేశానని, అందుకే గ్యాప్‌ వచ్చిందని బన్ని చెప్పారు. మరి ఇంత గ్యాప్‌ తర్వాత వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? గత రెండు చిత్రాల మాదిరిగా బన్ని-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌ మేజిక్‌ చేసిందా? యువతను ఓ ఊపు ఊపేసిన ‘సామజవరగమన’, ‘రాములో.. రాములా’ వెండితెరపై ఎలా అలరించాయి? చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై కనిపించిన టబు ఎలా చేశారు? బన్ని సంక్రాంతి పోటీలో గెలిచారా?

కథేంటంటే:

రామచంద్ర(జయరాం) ఆఫీస్‌లో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు వాల్మీకి(మురళీశర్మ). ఇద్దరికీ ఒకేసారి ఆస్పత్రిలో పిల్లలు పుడతారు. అయితే రామచంద్ర బిడ్డ పురిటిలోనే చనిపోయాడని భావించి వాల్మీకి తనకు పుట్టిన కొడుకును తన యజమానికి ఇచ్చేస్తాడు. ఒక నర్సు సాయంతో బిడ్డలను మార్చేస్తారు. బిడ్డ చనిపోయాడనుకుని తీసుకెళ్తుండగా.. ఆ బిడ్డ బతుకుతాడు. అయితే, తనలా పేదరికంలో తన కొడుకు బతకకూడదని అసలు నిజాన్ని చెప్పకుండా యజమాని కొడుకును తీసుకెళ్లి బంటు(అల్లు అర్జున్‌)అని పేరు పెట్టి పెంచుకుంటాడు. ఒక మధ్యతరగతి వ్యక్తిలా అతడిని పెంచుతాడు. మరోవైపు వాల్మీకి కొడుకు రాజ్‌మనోహర్‌(సుశాంత్‌)గా రామచంద్ర దగ్గర పెరిగి పెద్దవాడవుతాడు. మరి అసలు నిజం ఎలా తెలిసింది? ఎవరు? చెప్పారు? తెలిసిన తర్వాత బంటు ఏం చేశాడు? చివరకు అసలు తల్లిదండ్రులను కలుసుకున్నాడా? మధ్యలో అమూల్య(పూజాహెగ్డే)ఎలా పరిచయం అయింది? అప్పలనాయుడు(సముద్రఖని) ఎవరు? అతడిని బంటు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది చూడాలంటే ‘అల వైకుంఠపురములో..’ చూడాల్సిందే!

అల.. వైకుఠపురములో

ఎలా ఉందంటే:

అల్లు అర్జున్‌ చెప్పినట్లు పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఆయన ఎప్పుడూ చేయలేదు. ‘అల వైకుంఠపురములో’ ఆ కోరిక నెరవేరింది. ఇద్దరు పిల్లల్లో ఒకడు ధనవంతుడి పిల్లవాడు పేదవాడి ఇంటికి, పేదవాడి పిల్లవాడు ధనవంతుడి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందన్న నేపథ్యాన్ని దర్శకుడు తీసుకున్నాడు. ఇలాంటి కథతో గతంలో కొన్ని చిత్రాలు వచ్చినా, త్రివిక్రమ్‌ మార్కు శైలిలో ఈ కథ సాగుతుంది. ‘స్థానం మారినా, స్థాయి మారదు’ అన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు త్రివిక్రమ్‌. ప్రథమార్ధం అంతా మురళీశర్మ ఇంట్లో అల్లు అర్జున్‌ పెరిగి పెద్దవాడవటం.. మధ్య తరగతి కష్టాలు, బన్ని పడే ఇబ్బందులు ఇవన్నీ హాయిగా నవ్వుకునేలా తెరకెక్కించారు. పూజాహెగ్డే ఆఫీస్‌లో ఉద్యోగిగా చేరిన అల్లు అర్జున్‌ ఆమెను ప్రేమించడం, వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అలరించేలా ఉన్నాయి. పూజా ఆఫీస్‌ నేపథ్యమంతా త్రివిక్రమ్‌ మార్కు కామెడీతో అలా సాగిపోతుంది. అదే సమయంలో పూజాహెగ్డేను చూసిన జయరాం తన కోడలిగా చేసుకోవాలని అనుకోవడం, సుశాంత్‌కు పూజాకు నిశ్చితార్థం జరగడంతో కథ మలుపు తీసుకుంటుంది. మరోవైపు జయరాం కంపెనీ వాటా కావాలంటూ అప్పలనాయుడిగా సముద్రఖని సీన్‌లో ఎంటర్‌ కావడంతో కథలో సీరియెస్‌నెస్‌ వచ్చింది. అల్లు అర్జున్‌కు కూడా తన తండ్రి జయరాం అని తెలియడంతో ‘అల వైకుంఠపురములో’ ప్రవేశిస్తాడు.

అల.. వైకుఠపురములో

ఎప్పుడైతే తన కుటుంబం కష్టాల్లో ఉందని కథానాయకుడు తెలుసుకుని ఆ ఇంట్లోకి ప్రవేశించాడో తర్వాత ఏం చేస్తాడన్నది అందరూ ఊహించేదే. అయితే, దాన్ని చాలా సరదాగా, హాయిగా సాగిపోయేలా తీర్చిదిద్దాడు దర్శకుడు త్రివిక్రమ్‌. ఒక పక్క కథనం సీరియస్‌నెస్‌ సాగుతూనే మరోవైపు నవ్వులు పంచేలా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా అల్లు అర్జున్‌ కామెడీ టైమింగ్‌ అలరిస్తుంది. బోర్డ్‌ మీటింగ్‌ సమావేశం సందర్భంగా అల్లు అర్జున్‌ చేసే యాక్టింగ్‌ ‘గబ్బర్‌సింగ్‌’ సినిమాలో అంత్యాక్షరిని తలపిస్తుంది. ఆ మజాను అనుభవించాలంటే వెండితెరపై చూడాల్సేంది. ఇక సినిమాలో వచ్చే ప్రతి ఫైట్‌కు ఒక కాన్సెప్ట్‌ తీసుకున్నారు. అవన్నీ మెప్పిస్తాయి. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం నిడివి కాస్త ఎక్కువ. కొన్ని సన్నివేశాలకు కాస్త కత్తెర వేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ప్రేక్షకుడిలో ఆ భావన కలిగే సమయంలో ఏదో ఒక కామెడీ సీన్‌తో నవ్వులు పంచే ప్రయత్నం చేశాడు త్రివిక్రమ్‌. క్లైమాక్స్‌ ట్విస్ట్‌ను ఎవరూ ఊహించరు.

ఎవరెలా చేశారంటే

తొలిసారి అల్లు అర్జున్‌ ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేశారు. తన మార్కు స్టైల్‌తో కనిపిస్తూనే పంచ్‌లు, కామెడీ సన్నివేశాల్లో అదరగొట్టేశారు. అందుకు త్రివిక్రమ్‌ మార్కు డైలాగ్‌లు కూడా జత చేరడం అగ్నికి వాయువు తోడైనట్లు తెరపై సందడి కనిపించింది. ఇక మధ్య తరగతి యువకుడిగానూ, అల వైకుంఠపురములోకి వెళ్లిన తర్వాత ప్రతి ఫ్రేమ్‌లోనూ అల్లు అర్జున్‌ స్టైల్‌గా కనిపించారు. ఇక బన్ని డ్యాన్స్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. యాక్షన్‌ సన్నివేశాల్లో బన్ని స్టైల్‌గా ఫైట్‌ చేయడం అభిమానులను అలరిస్తుంది.

అల.. వైకుఠపురములో

డీజే తర్వాత పూజా హెగ్డే మరోసారి అల్లు అర్జున్‌కు జోడీగా నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సన్నివేశాలు తెరపై అందంగా ఉన్నాయి. వాటికి పూజా అందం తోడవటం మరింత అందాన్ని తెచ్చింది. తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. పాటల్లో మరింత గ్లామర్‌గా కనిపించింది.

ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమాలో మురళీశర్మ గురించి. మధ్య తరగతి తండ్రిగా ఆయన నటన చాలా చక్కగా ఉంది. ఆద్యంతం తన మేనరిజంతో ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్‌ తర్వాత స్థాయి పాత్ర మురళీ శర్మకు దక్కింది. దానిని ఆయన చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రతినాయకుడిగా నటించిన సముద్రఖని ఈ సినిమాలో అప్పలనాయుడు పాత్రలో మరోసారి మెప్పించారు. ముఖ్యంగా ఆయన మేనరిజం కూడా ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది.

'అల వైకుంఠపురములో' పాత్రలు ఎక్కువ. టబు, జయరాం, సుశాంత్‌, నవదీప్‌, నివేదా పేతురాజు, మురళీశర్మ, సునీల్‌, రాహుల్‌ రామకృష్ణ, రావు రమేష్‌, అజయ్‌, బ్రహ్మాజీ, రోహిణిలు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

'అరవింద సమేత'లాంటి సీరియస్‌ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ తన పాత స్టైల్‌ల్లోకి వెళ్లిపోయారు. ఆయన రాసిన కామెడీ, పంచ్‌డైలాగ్‌లు బాగా పేలాయి. కథా నేపథ్యం పాతదే అయినా త్రివిక్రమ్‌ చూపించిన విధానం కొత్తగా ఉంది. ఇన్ని పాత్రలను తెరపై చూపిస్తూ, ప్రతి పాత్రకు ప్రత్యేకత కల్పించడం త్రివిక్రమ్‌కే చెల్లింది.‘నేను గెలవడం కంటే, మీరు కలవడం ఇంపార్టెంట్‌’, ‘ఎప్పుడూ పిల్లలు బాగుండాలని అమ్మానాన్న అనుకోవాలా..? అమ్మానాన్న బాగుండాలని పిల్లలు అనుకోరా’వంటి డైలాగ్‌లు బాగా పేలాయి. సాంకేతికంగా సినిమా చక్కగా ఉంది. పీఎస్‌ కెమెరా పనితనం బాగుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్‌నెస్‌ కనిపిస్తుంది. సంగీతం పరంగా తమన్‌ ఏంటో ఇప్పటికే నిరూపించుకున్నారు. ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు వెండితెరపై కనులపండగగా ఉన్నాయి. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ బాగుంది. అయితే, ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలను ఇంకాస్త షార్ప్‌ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు

అల్లు అర్జున్‌
కామెడీ
యాక్షన్‌ సన్నివేశాలు
పాటలు

బలహీనతలు

ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు

చివరిగా: ఈ సినిమా కోసం బన్ని గ్యాప్‌ తీసుకున్నాడేమో గానీ, సినిమాలో కామెడీకి అస్సలు తీసుకోలేదు.

ఇదీ చదవండి: భీష్మ టీజర్ వచ్చిసింది.. నితిన్ అదరగొట్టేశాడు!

Last Updated : Jan 12, 2020, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details