తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Adbhutam review: తేజ నిజంగానే 'అద్భుతం' అనిపించాడా? - అద్భుతం సినిమా రిలీజ్ డేట్​

తేజ, శివానీ రాజశేఖర్‌ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అద్భుతం' సినిమా... ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తేజ ఈ సినిమాతో నిజంగానే 'అద్భుతం' అనిపించాడా? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ(Adbhutam review) చదివేయండి.

Adbhutam review
అద్భుతం రివ్యూ

By

Published : Nov 19, 2021, 5:10 PM IST

ఇటీవల కాలంలో కాన్సెప్ట్‌ కథల ట్రెండ్‌ కొనసాగుతుంది. దర్శకులు, రచయితలు సైతం కొత్త కొత్త ఆలోచనలతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకుడికి అర్థమయ్యేలా, కాస్త ఆసక్తిగా సినిమాను మలిస్తే చాలు విజయం సాధించినట్లే. అలాంటి కథే 'అద్భుతం'. బాల నటుడిగా తెరంగేట్రం చేసి, ఇప్పుడు కథానాయకుడిగా మారిన తేజ. జీవిత, రాజశేఖర్‌ల తనయ శివానీ రాజశేఖర్‌ జోడీగా నటించిన ఈ చిత్రం డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది?(Adbhutam movie 2021 review) తేజ(Adbhutam teja sajja), శివానీ ఎలా నటించారు? మల్లిక్‌ రామ్‌ 'అద్భుతం'గా(Adbhutam review) చూపించారా?

చిత్రం: అద్భుతం; నటీనటులు: తేజ, శివానీ రాజశేఖర్‌, సత్య తదితరులు; సంగీతం: రాధన్‌; ఎడిటింగ్‌: గ్యారీ బీహెచ్‌; సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్‌; కథ: ప్రశాంత్‌ వర్మ; స్క్రీన్‌ప్లే, మాటలు: లక్ష్మీ భూపాల్‌; నిర్మాత: చంద్రశేఖర్‌ మొగుళ్ల; దర్శకత్వం: మల్లిక్‌ రామ్‌; విడుదల: డిస్నీ+హాట్‌స్టార్‌

కథేంటంటే...

సూర్య(తేజ) ఓ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా పనిచేస్తుంటాడు. తన వల్లే తండ్రి చనిపోయాడని బాధపడుతుంటాడు. ఒక రోజు ఆఫీస్‌లో సూర్య చేసిన పని కారణంగా బాస్‌తో తిట్లు తింటాడు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని ఎత్తయిన బిల్డింగ్‌ ఎక్కుతాడు. మరోవైపు వెన్నెల(శివానీ రాజశేఖర్‌)కు ఉన్నత చదువులకు వెళ్లాలని ఆశ. అయితే, పెళ్లి చేసి చేసి బాధ్యత దించుకోవాలని ఆమె తండ్రి అనుకుంటాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకోనని వెన్నెల చెబుతుంది. అందుకు ఆమె తండ్రి ఒక షరతు పెడతాడు. ఈసారి జీఈటీ పరీక్షలో పాస్‌ అవ్వకపోతే పెళ్లి చేసేస్తానని కరాఖండీగా చెప్పేస్తాడు.

పరీక్షలో వెన్నెల ఫెయిల్‌ అవుతుంది. ఇష్టంలేని పెళ్లి చేసుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో సూర్య ఫోన్‌ నుంచి నుంచి వెన్నెల ఫోన్‌కు ఒక మెస్సేజ్‌ వస్తుంది. ప్రతిగా సూర్యకు వెన్నెల రిప్లై ఇస్తుంది. దీంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సంగతి పక్కన పెట్టి గొడవపడతారు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ కలుసుకోవాలని అనుకుంటారు. మరి వీరిద్దరూ కలుసుకున్నారా? కలవడానికి ప్రయత్నించినప్పుడు ఏం జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

.

ఎలా ఉందంటే...

టైమ్‌ ట్రావెల్‌ కథతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. 'ఆదిత్య 369' నుంచి ఇటీవల విడుదలైన 'ప్లే బ్యాక్‌', 'కుడి ఎడమైతే' వరకూ చాలా సినిమాలు కాలంతో ముడి పడిన కథతో నడిచేవే. ఇలాంటి కథలను చాలా జాగ్రత్తగా డీల్‌ చేయాలి. కథ, కథనాల్లో ఎక్కడ తేడా కొట్టినా సినిమా అర్థం కాక మొదటికే మోసం వస్తుంది. ఈ విషయంలో రచయిత ప్రశాంత్‌ వర్మ, దర్శకుడు మల్లిక్‌ రామ్‌ ఒక చిన్న టెక్నిక్‌ ఉపయోగించారు. అదేంటంటే ఇటీవల కాలంలో వచ్చిన టైమ్‌ ట్రావెల్‌ కథలను తీసుకుని, దానికి తమదైన ట్రీట్‌ మెంట్‌ ఇచ్చారంతే. 'ప్లే బ్యాక్‌'లోలాగా మరీ భూతకాలంలోకి వెళ్లకుండా, 'కుడి ఎడమైతే'లోలా 24 గంటల సమయం తీసుకోకుండా రెండు పాత్రల మధ్య క్రాస్‌ టైమ్‌ కనెక్షన్‌ను నాలుగేళ్లుగా తీసుకుని సినిమా తెరకెక్కించాడంతే. కథకు కాస్త హాస్యం, కాస్త ఉత్కంఠ జోడించి, కొత్త నటీనటులతో 'అద్భుతం' చేయాలనుకున్నాడు. అయితే 'అద్భుతం' అనే స్థాయిలో అయితే లేదు.

.

సూర్య, వెన్నెల పాత్రలను పరిచయం చేస్తూ కథను మొదలు పెట్టిన దర్శకుడు ఇద్దరూ వేర్వేరు కాలాల్లో ఉన్నారన్న విషయాన్ని చెప్పడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒకసారి ఈ విషయం తెలిశాక వీరిద్దరూ ఎలా కలుస్తారన్న ఆసక్తి ప్రేక్షకుడిలో కలిగించాడు. ఆ పాయింట్‌ను చివరి వరకూ కొనసాగించేందుకు సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్లాడు. సూర్య, వెన్నెల పాత్రల చుట్టూనే కథ, కథనాలు నడుస్తుండటంతో సినిమా నిడివి పెద్దగా ఉన్నా, చూస్తూ వెళ్లిపోవచ్చు. మధ్య మధ్యలో సత్య కామెడీ కాస్త రిలీఫ్‌. ఓటీటీలో పాటలంటే చూసేవారు ఏం చేస్తారో మనకు తెలిసిందే. కరోనా కారణంగా థియేటర్‌లు తెరిచే పరిస్థితి ఉండదని ఊహించిన చిత్ర బృందం సినిమాను ఓటీటీలో విడుదల చేసింది. వారంతంలో టైమ్‌ పాస్‌ కోసం ఓటీటీలో ఏదైనా సినిమా చూడాలనుకుంటే లాజిక్కులు వదిలేసి 'అద్భుతం'గా ఉంటుందని అనుకోకుండా ఒకసారి చూడొచ్చు! నిరాశ అయితే పరచదు.

.

ఎవరెలా చేశారంటే..

కథానాయకుడిగా తేజ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. కమర్షియల్‌ సినిమాల జోలికి పోకుండా కాన్సెప్ట్‌ మూవీలను ఎంచుకుని ముందుకు సాగుతున్నాడు. సూర్య పాత్రలో(Adbhutam movie 2021 cast) చక్కగా ఒదిగిపోయాడు. ఇక శివానీ రాజశేఖర్‌ ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఫ్రెష్‌ లుక్‌తో వెన్నెల పాత్రలో బాగానే నటించింది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ పర్వాలేదనిపించింది. సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. సాంకేతికంగా సినిమా బాగుంది. రధన్‌ సంగీతం, విద్యాసాగర్‌ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరాయి. థియేటర్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను నిడివి వదిలేశారు. ఓటీటీ అని తెలిసిన తర్వాత ఇంకొన్ని సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే బాగుండేది. లక్ష్మీ భూపాల్‌ సంభాషణలు బాగున్నాయి. ప్రశాంత్‌ వర్మ అందించిన కథ కొత్తదేమీ కాదు. పాత పాయింట్‌నే దర్శకుడు మల్లిక్‌ రామ్‌ కొత్త నటీనటులతో కొత్తగా, 'అద్భుతం'గా చూపించాలనుకున్నారు. ఆ విషయంలో కొంతమేర విజయం సాధించాడు.

.

బలాలు

+ తేజ, శివానీ నటన

+ సత్య కామెడీ

+ సాంకేతిక వర్గం పనితీరు

బలహీనతలు

- తెలిసిన కథే కావటం

- నిడివి

చివరిగా: 'అద్భుతం'గా అయితే లేదు..! అలా అని నిరాశ కూడా పరచదు!

గమనిక: ఈ సమీక్ష(Adbhutam review) సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details