చిత్రం: 47 డేస్
నటీనటులు: సత్యదేవ్, రోషిణి, పూజా ఝవేరి, రవివర్మ, సత్య ప్రకాశ్, శ్రీకాంత్ అయ్యంగార్, ముక్తార్ ఖాన్ తదితరులు
సంగీతం: రఘు కుంచె
సినిమాటోగ్రఫీ: జీకే
ఎడిటింగ్: ఎస్‌ఆర్ శేఖర్
నిర్మాత:విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ, రఘు కుంచె, శశి డబ్బర
రచన, దర్శకత్వం: ప్రదీప్ మద్దాళి
బ్యానర్: టైటిల్ కార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల: జీ5 తెలుగు
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాల తర్వాత... అంతగా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్న జోనర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. సినిమా మొదటి సీన్‌లో మొదలయ్యే సస్పెన్స్ ఆఖరి సీన్‌లో రివీల్ చేసే సినిమాలంటే ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీ యాప్‌ల హవా మొదలయ్యాక ఇలాంటి చిత్రాలపై ఆసక్తి మరింత పెరిగింది. ఇతర భాషల్లో తెరకెక్కిన ఈ తరహా సినిమాలను సబ్‌టైటిల్స్‌తో చూసేస్తున్నారు. అలాంటి సమయంలో ఓటీటీలోకి వచ్చిన చిత్రం '47 డేస్'. నిజానికి ఈ సినిమా గతేడాదే థియేటర్లలో విడుదల కావాల్సింది. వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ పడుతూ... కొవిడ్ కారణంగా ఓటీటీకి వచ్చేసింది. 47 రోజుల్లో ఏం జరిగింది అంటూ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లతో ఆసక్తిరేపిన ఈ సినిమా ఎలా ఉందంటే?
కథేంటంటే:
ఏసీపీ సత్యదేవ్ అలియాస్ సత్య (సత్యదేవ్) విధుల్లో చేరిన తొలి నాళ్లలోనే డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. విశాఖపట్నం నగరంలో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకొని శభాష్ అనిపించుకుంటాడు. ఆ క్రమంలో ముఠా ప్రధాన నాయకుడిని పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమై ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతాడు. దానికి కారణం అతని భార్య పద్మిని (రోషిణి ప్రకాశ్). ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకు పద్మిని ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ గతాన్ని మర్చిపోలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆమె ఆత్మహత్యకు, నగరంలో జరిగిన ఓ వ్యాపారవేత్త ఆత్మహత్యకు సంబంధం ఉన్నట్లు గ్రహిస్తాడు. దీంతో వాటిని ఛేదించడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఈ కేసుతో ఎవరెవరికి సంబంధం ఉంది? అసలు ఆ రెండూ ఆత్మహత్యలేనా అనేది సినిమా కథ. హీరో విచారణలో భాగంగా కలుసుకున్న క్రిస్టినా అలియాస్ జూలియట్ (పూజా ఝవేరి), సత్య స్నేహితుడు రవి (రవి వర్మ), ఏఎస్‌ఐ రాజారాం (శ్రీకాంత్ అయ్యంగార్)కి ఈ కేసుతో సంబంధం ఏంటి అనేది సినిమాలో చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే ప్రేక్షకుడు ఆశించేది సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్. తర్వాత ఏం జరుగుతుంది? హీరో ఏం చేస్తాడు? విలన్ అతనేనా? అసలు ఎంత మంది విలన్లు? అనే ప్రశ్నలు మెదడును తొలిచేయాలి. అప్పుడు వావ్ ఏముందిరా సినిమా అనుకుంటారు. '47 డేస్'లో తొలి రోజు మొదలైనప్పుడు అలాంటి ఫీలింగే కలుగుతుంది. కానీ సినిమాలో రోజులు ఎంత త్వరగా తిరిగిపోయినట్లు చూపిస్తారో... ప్రేక్షకుడి ఫీలింగ్ కూడా అంత త్వరగా మారిపోతుంది. ఆత్మహత్యనా? హత్యనా అంటూ మొదలైన సినిమా... ఏమైతే ఏముందిలే అనే స్థాయికి వెళ్తుంది. కారణం సినిమా ట్యాగ్‌లైన్‌లో ఉన్న మిస్టరీ అన్‌ఫోల్డ్.. సినిమాలో పర్‌ఫెక్ట్‌గా అవ్వకపోవడం.