తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సమీక్ష: జుమాంజి ది నెక్ట్స్‌ లెవల్‌ - జుమాంజి ది నెక్ట్స్‌ లెవల్‌  సమీక్ష

డ్వేన్ జాన్సన్ (రాక్), జాక్‌ బ్లాక్‌, కెవిన్‌ హార్ట్‌, కరెన్‌ గిల్లాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జుమాంజి: ది నెక్ట్స్ లెవల్​'. ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

jumanji
జుమాంజి ది నెక్ట్స్‌ లెవల్‌

By

Published : Dec 13, 2019, 4:14 PM IST

రెండేళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్‌ చిత్రం 'జుమాంజి: వెల్‌కమ్‌ టు ది జంగిల్‌' మంచి విజయాన్ని అందుకుంది. జుమాంజి అనే వీడియో గేమ్‌ నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కింది. ఆ గేమ్‌ ఆడేవారు అందులోని పాత్రధారుల్లాగే మారిపోయి అడవిలో చిక్కుకుని ఇబ్బందులు పడటం ఆ చిత్ర కథ. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా 'జుమాంజి: ది నెక్ట్స్‌ లెవెల్‌' తెరకెక్కింది. తొలి భాగంలో ప్రధాన పాత్రల్లో నటించిన డ్వేన్‌ జాన్సన్‌ (రాక్‌), జాక్‌ బ్లాక్‌, కెవిన్‌ హార్ట్‌, నిక్‌ జొనాస్‌, కరెన్‌ గిల్లాన్‌ సీక్వెల్‌లోనూ అవే పాత్రల్లో కనిపించారు. జేక్‌ కస్డన్‌ తెరకెక్కించారు. ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ విడుదలైంది. తెలుగులో 'జుమాంజి: మరో ప్రపంచం' పేరుతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? తొలి చిత్రం స్థాయిలోనే ఉందా? అనే విషయాలను సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథేంటంటే..

తొలి భాగంలో బద్దలుకొట్టిన జుమాంజి వీడియో గేమ్‌ ముక్కలను స్పెన్సర్‌ తన స్నేహితులకు తెలియకుండా దాచిపెడతాడు. ఓరోజు దాన్ని మరమ్మతు చేసి గేమ్‌ ఆన్‌ చేసి ఆడుతుంటాడు. అతడి స్నేహితులు వచ్చేసరికి స్పెన్సర్‌ అదృశ్యమవుతాడు. గేమ్‌లోని పాత్రధారిలా మారిపోయి అడవిలో చిక్కుకుపోయి ఉంటాడని అతడి స్నేహితులు భావిస్తారు. అతడి ఆచూకీ కనిపెట్టి కాపాడటానికి వారు కూడా గేమ్‌లో భాగస్వాములవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? స్నేహితులందరూ స్పెన్సర్‌ను రక్షించారా? గేమ్‌లోకి వెళ్లిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నది కథ.

జుమాంజి ది నెక్ట్స్‌ లెవల్‌

ఎలా ఉందంటే..

నేటి యువత విశేషంగా ఇష్టపడే విషయాల్లో వీడియోగేమ్స్‌ ఒకటి. వర్చువల్‌ వరల్డ్‌ ప్రయాణం, లెవల్స్‌ దాటుకుంటూ వెళ్లడం, ఉన్న లైఫ్‌లను కాపాడుకోవడం, ఆటలో ఎదురయ్యే అడ్డంకులను దాటుకుంటూ వెళ్లి లక్ష్యాన్ని చేరుకోవడం.. ఇవి ప్రధానంగా వీడియోగేమ్‌ ఆడే ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయాలు. 'జుమాంజి: వెల్‌ కమ్‌ టు ది జంగిల్‌' చూసిన వారికి ఈ విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇక రెండో భాగం కూడా ఇలాంటి కథతోనే సాగుతుంది. అయితే, దర్శకుడు కథను ఈసారి అడవి నుంచి ఎడారికి, అక్కడి నుంచి మంచు కొండలకు మార్చాడు. గేమ్‌లోకి వచ్చిన స్నేహితుల బృందానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకుంటేనే గేమ్‌ నుంచి బయటపడతారు. ఈ కారణంగా వాళ్లంతా గేమ్‌లో ఉన్న అడ్డంకులను దాటే ప్రయత్నం చేయడం వల్ల కథలో వేగం పెరుగుతుంది. గేమ్‌లో పాత్రల్లా మారిపోయిన వారికి ఒక్కొక్కరికీ వివిధ బలాలు, బలహీనతలు ఉంటాయి. బలలాను వాడుకుంటూ బలహీనతలను అధిగమిస్తూ ప్రయాణం సాగించాలి.

జుమాంజి ది నెక్ట్స్‌ లెవల్‌

తొలి 20 నిమిషాల వరకూ కథ నెమ్మదిగా సాగుతుంది. పాత్రలను గేమ్‌లోకి ప్రవేశపెట్టడానికి దర్శకుడు కొంత సమయం తీసుకున్నాడు. ఎప్పుడైతే స్నేహితులంతా ఎడారి ప్రాంతానికి వెళ్లారో.. అక్కడి నుంచే కథలో వేగం పుంజుకుంటుంది. అక్కడ ఆస్ట్రిచ్‌ పక్షుల నుంచి ఎదురయ్యే ప్రమాదాన్ని దాటడాన్ని చాలా ఉత్కంఠగా తెరకెక్కించాడు దర్శకుడు. అది దాటి హమ్మయ్య అనుకునేలోపే వేలాడే వంతెనల మీదగా పెద్ద పెద్ద కోతులను తప్పించుకోవాల్సి వస్తుంది. దాన్ని కూడా తమ తెలివితో అందరూ దాటతారు. ఆ రెండు, మూడు సన్నివేశాలు తప్ప మిగిలినవి పెద్దగా ఆకట్టుకోవు. అందువల్ల కథ సాగదీసినట్లు అనిపిస్తుంది. ద్వితీయార్ధం మొదలైన తర్వాత ఎప్పుడు క్లైమాక్స్‌ వచ్చేస్తుందా? అంటూ ప్రేక్షకుడు ఎదురు చూడాల్సి వస్తుంది. క్లైమాక్స్‌ కూడా అంతగా రక్తికట్టలేదు. పబ్‌జీ, నైట్‌ఫోర్ట్‌లాంటి గేమ్స్‌ ఆడేవారికి ఇవన్నీ చాలా సాధారణ విషయాల్లా అనిపిస్తాయి. చివర్లో రెండు, మూడు మెరుపులు తప్ప పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేవు.

ఎవరెలా చేశారంటే..

డాక్టర్‌ స్మాల్డర్‌ బ్రేవ్‌స్టోన్‌గా డ్వేన్‌ జాన్సన్‌ అలియాస్‌ రాక్‌ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఎంతటివారినైనా మట్టికరిపించడం డాక్టర్‌ స్మాల్డర్‌కు ఉన్న బలం. ఆ పాత్రలో అదరగొట్టేశాడు. స్వతహాగా రెజ్లర్‌ ఛాంపియన్‌ అయిన రాక్‌ యాక్షన్‌ సన్నివేశాల్లో ఔరా అనిపించాడు. ఆస్ట్రిచ్‌లతో పోరాటం, పెద్ద పెద్ద కోతుల నుంచి తప్పించుకునే సమయాల్లో తన ఫైట్స్‌ ఆకట్టుకుంటాయి. ప్రొఫెసర్‌ షెల్డాన్‌గా నటించిన జేక్‌ బ్లాక్‌, ఫ్రాంక్లిన్‌ పాత్రల్లో కనిపించిన కెవిన్‌ హార్ట్‌, రూబీగా నటించిన కారెన్‌లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. వీడియోగేమ్‌లో మరో అతిథి పాత్రలో నిక్‌ జోనాస్‌ తళుక్కున మెరిశాడు. అయితే, ఆ పాత్ర పరిమితం. సాంకేతికంగా సినిమా ఫర్వాలేదనిపించింది. ముఖ్యంగా సినిమా మొత్తం సీజే, వీఎఫ్‌క్స్‌తోనే సాగుతుంది. పెద్దపెద్ద వీడియోగేమ్స్‌ ఆడేవాళ్లకు ఇదో చిన్న సినిమా. నేపథ్య సంగీతం బాగుంది.

బలాలు

యాక్షన్‌ సన్నివేశాలు
రాక్‌ నటన
గేమ్‌లో లెవల్స్‌

బలహీనతలు

కథ ముందే తెలిసిపోవడం
అక్కడక్కడా సాగదీతగా అనిపించే సన్నివేశాలు

చివరిగా..
కాసేపు కాలక్షేపానికైతే 'జుమాంజి: నెక్ట్స్‌ లెవల్‌'కు వెళ్లొచ్చు.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

ఇవీ చూడండి.. రివ్యూ: మామా అల్లుళ్ల సందడే 'వెంకీమామ'

ABOUT THE AUTHOR

...view details