తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Shershaah Review: దేశభక్తి చిత్రం 'షేర్షా' ఎలా ఉందంటే? - సిద్ధార్థ్​ మల్హోత్రా షేర్షా

కార్గిల్​ యుద్ధంలో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన కెప్టెన్‌ విక్రమ్‌ బాత్రా జీవితాధారంగా రూపొందిన చిత్రం 'షేర్షా'(Shershaah Movie). స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెజాన్​ ప్రైమ్​ ఓటీటీ ద్వారా సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే దేశభక్తి చిత్రంగా రూపొందిన 'షేర్షా' విజయం సాధించిందా? కెప్టెన్​ విక్రమ్​ బాత్రా పాత్రలో హీరో సిద్ధార్థ్​ మల్హోత్రా(Sidharth Malhotra) ఏ విధంగా నటించాడు? అనే విశేషాలను ఈ సమీక్ష ద్వారా తెలుసుకోండి.

Siddharth Malhotra's Sher Shah Movie Review
Shershaah Review: దేశభక్తి చిత్రం 'షేర్షా' ఎలా ఉందంటే?

By

Published : Aug 12, 2021, 7:59 PM IST

Updated : Aug 12, 2021, 8:23 PM IST

చిత్రం:షేర్షా;

నటీనటులు:సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అడ్వాణీ, శివ్‌ పండిట్‌, నిఖిత్‌ ధీర్, హిమాన్షో, అనిల్‌ చరణ్‌జీత్‌ తదితరులు;

సంగీతం:తనిష్‌బాగ్చి, బి ప్రాక్‌, జానీ, జస్లీన్‌ రాయల్‌, జావేద్‌ మోషిన్‌, విక్రమ్‌ (నేపథ్యం: జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి);

సినిమాటోగ్రఫీ:కమల్‌జీత్‌ నేగి;

ఎడిటింగ్‌:ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌;

నిర్మాత:యష్‌ జోహార్‌, కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా, షబ్బీర్‌, అజయ్‌ షా, హిమాన్షు గాంధీ;

రచన:సందీప్‌ శ్రీవాత్సవ;

దర్శకత్వం:విష్ణువర్థన్‌;

విడుదల:అమెజాన్‌ ప్రైమ్‌.

'షేర్షా' సినిమా పోస్టర్​

బయోపిక్‌లకు బాలీవుడ్‌ పెట్టింది పేరు. ఏటా కనీసం రెండు, మూడు చిత్రాలైనా ప్రేక్షకులను పలకరిస్తాయి. అంతేకాదు, అక్కడ వాటి సక్సెస్‌రేటూ ఎక్కువే. ఇటీవల ఈ ట్రెండ్‌ తెలుగు చిత్ర పరిశ్రమలోనూ కొనసాగుతోంది. భారత సైన్యంలో విశేష సేవలందిస్తూ ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేశారు. అలాంటి వారిలో కెప్టెన్‌ విక్రమ్‌ బాత్రా ఒకరు. కార్గిల్‌ యుద్ధంలో అసమాన పోరాటం చేసి, శత్రుమూకలను తరిమికొట్టారు. తోటి సైనికులు ఆయన ధైర్య సాహసాలు చూసి, 'షేర్‌ షా' అనిపిలిచేవారు. 24 ఏళ్ల వయసులో కార్గిల్‌ యుద్ధంలోనే పోరాడుతూ అమరుడయ్యారు. ఆయన జీవిత కథతో సిద్ధార్థ్‌ మల్హోత్రా(Sidharth Malhotra) కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం 'షేర్షా'(Shershaah Movie). స్టైలిష్‌ డైరెక్టర్‌ విష్ణువర్థన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కెప్టెన్‌ విక్రమ్‌గా సిద్ధార్థ్‌ ఎలా నటించారు?

కథేంటంటే?

విక్రమ్‌ బాత్రా(సిద్ధార్థ్‌ మల్హోత్రా)కు ఎప్పటికైనా సైన్యంలో చేరి దేశానికి సేవలందించాలని అనుకుంటాడు. అందుకు తగినట్లుగానే స్కూల్‌ నుంచే అందుకోసం సిద్ధమవుతుంటాడు. అతనితో పాటే ఆర్మీలో చేరాలన్న కల కూడా పెరిగి పెద్దదవుతుంది. అందుకోసం వివిధ పరీక్షలు రాస్తాడు. అదే సమయంలో డింపుల్‌(కియారా అడ్వాణీ)తో ప్రేమలో పడతాడు. తన ప్రేయసి తండ్రి మెప్పుపొందడం సహా ఎక్కువ జీతం వస్తుందని ఆర్మీ శిక్షణలో ఉన్న విక్రమ్‌ నేవీలో చేరాలనుకుంటాడు.

అప్పుడు ఆర్మీ బెటాలియన్‌పై ఉగ్రవాదులు దాడి చేస్తారు. దీంతో అప్పుడు అతడి స్నేహితుడు సన్నీ(షహిల్‌ వేద్‌) సలహా మేరకు, ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఆర్మీలోనే కొనసాగుతాడు. ఆ తర్వాత కార్గిల్‌ యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుంది. అప్పుడు విక్రమ్‌ శత్రు సైన్యంతో ఎలా పోరాడాడు? తన టీమ్‌ను ఎలా నడిపించాడు? ఈ క్రమంలో తన ప్రాణాలను ఎలా కోల్పోయాడు? అన్నది కథ!

'షేర్షా' సినిమాలో సిద్ధార్థ్​ మల్హోత్రా

ఎలా ఉందంటే?

బాలీవుడ్‌కు బయోపిక్‌లు కొత్తేమీ కాదు. అయితే, ఒక్కో కథ ఒక్కోలా ఉంటుంది. ఇతర సినిమాలతో పోలిస్తే, బయోపిక్‌ల విషయంలో దర్శకులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఫలితం తారుమారు అవుతుంది. పైగా విమర్శలపాలవుతారు. సాధారణంగా బయోపిక్‌ అంటే సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధించిన వారు, స్ఫూర్తినింపిన వారి కథలే ఉంటాయి. వారి జీవితాలు తెరిచిన పుస్తకాలు. చాలా మందికి వారి జీవితాల్లో ఏం జరిగిందో తెలిసి ఉంటుంది.

అలాంటి వ్యక్తుల్లో కెప్టెన్‌ విక్రమ్‌ బాత్రా ఒకరు. కార్గిల్‌ యుద్ధంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికుడు ఆయన. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆయన జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు రచయిత, సందీప్‌ శ్రీవాత్సవ, దర్శకుడు విష్ణు వర్థన్‌. ఈ విషయంలో వారు విజయం సాధించారు.

కార్గిల్‌ యుద్ధంలో సైనికులు పోరాడుతున్న సన్నివేశంతో కథను ప్రారంభించిన దర్శకుడు.. అక్కడి నుంచి విక్రమ్‌ స్కూల్‌, కాలేజ్‌ సంగతులు, ప్రేమ.. ఇలా ఒక్కో సన్నివేశాన్ని చూపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. విక్రమ్‌ ఆర్మీలో చేరడం, మరోవైపు ప్రేమ రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ వెళ్లాడు. విరామానికి ముందు ఆర్మీ బెటాలియన్‌పై ఉగ్రవాదుల దాడితో కథ కీలక మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి క్లైమాక్స్‌ వరకూ సినిమా ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. ముఖ్యంగా పోరాట సన్నివేశాలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

దేశభక్తి నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో కావాల్సింది ఎమోషన్‌. చివరి వరకూ ఆ ఎమోషన్‌ టెంపోను కొనసాగించాడు దర్శకుడు. తర్వాత ఏం జరుగుతుందన్న విషయం తెలిసినా, కథానాయకుడు ఎలా పోరాటం చేస్తాడన్నది ఆసక్తిగా ఉంటుంది. పతాక సన్నివేశాలు మరోస్థాయిలో ఉన్నాయి.

ఎవరెలా చేశారంటే?

విక్రమ్‌ బాత్రా పాత్రలో సిద్ధార్థ్‌ మల్హోత్రా అదరగొట్టేశాడు. సైనికుడిగా తనదైన హావభావాలు పలికించాడు. పోరాట సన్నివేశాల్లో సిద్ధార్థ్‌ నటన హైలైట్‌. విక్రమ్‌ పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశాడు. డింపుల్‌గా కియారా ఓకే. అందంగా కనిపించింది. జిమ్మిగా శివ్‌ పండిట్‌, సన్నీగా సాహిల్‌ వేద్‌ సహా మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. జాన్‌ స్టీవర్ట్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా యాక్షన్స్‌ సీన్స్‌ అద్భుతంగా ఎలివేట్‌ అయ్యాయి.

'షేర్షా' సినిమాలో సిద్ధార్థ్​ మల్హోత్రా

సినిమాటోగ్రాఫర్‌ కమల్‌జీత్‌ నేగీ 'షేర్షా'ను చక్కగా తీర్చిదిద్దారు. అటు పోరాట సన్నివేశాలు, ఇటు భావోద్వేగ సన్నివేశాలు ప్రతి ప్రేమ్‌ అలరించేలా ఉన్నాయి. శ్రీకర్‌ ప్రసాద్ ఎడిటింగ్‌ కూడా బాగుంది. సినిమా నిడివి 135 నిమిషాలు మాత్రమే! అయితే, ప్రథమార్థంలో కథను ముందుకు నడిపే క్రమంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. సందీప్‌ శ్రీవాత్సవ రచనకు విష్ణు వర్థన్‌ వందశాతం తన న్యాయం చేశారు. ఆయనకిది తొలి బాలీవుడ్‌ చిత్రం. స్టైలిష్‌ డైరెక్టర్‌గా పేరున్న విష్ణువర్థన్‌ అంతే స్టైలిష్‌గా 'షేర్షా'ను ఆవిష్కరించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు బలహీనతలు
+ సిద్ధార్థ్‌ మల్హోత్రా

- ప్రథమార్ధంలో కొన్ని

సన్నివేశాలు

+ దర్శకత్వం

+ సాంకేతిక బృందం

పనితీరు

చివరిగా:'షేర్షా' ఈ పంద్రాగస్టుకు నిజమైన దేశభక్తి సినిమా!

గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Last Updated : Aug 12, 2021, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details