తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రివ్యూ: గణిత మేధావి 'శకుంతల దేవి' మెప్పించారా? - విద్యాబాలన్ కొత్త సినిమా

హ్యుమన్ కంప్యూటర్ 'శకుంతల దేవి' బయోపిక్​ నేటి(జులై 31) నుంచి అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉంది? నటీనటులు ఎలా చేశారో? తెలుసుకుందాం.

రివ్యూ: గణిత మేధావి 'శకుంతల దేవి' మెప్పించారా?
శకుంతలదేవి రివ్యూ

By

Published : Jul 31, 2020, 3:10 PM IST

Updated : Jul 31, 2020, 3:17 PM IST

చిత్రం: శకుంతల దేవి

నటీనటులు: విద్యా బాలన్‌, జిషు సేన్‌ గుప్త, సన్య మల్హోత్ర, అమిత్‌ సాధి

సంగీతం: సచిన్‌ జిగార్‌, కరణ్‌ కులకర్ణి

నిర్మాత: సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌

దర్శకత్వం: అను మేనన్‌

విడుదల: 30-07-2020 (అమెజాన్‌ ప్రైమ్‌)

వెండితెరపై ఇప్పటికే ఎన్నో బయోపిక్‌లు అలరించాయి. మరిన్ని బయోపిక్‌ల సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హ్యూమన్‌ కంప్యూటర్‌గా పేరుగాంచిన శకుంతల దేవి జీవిత కథ చిత్రంగా రూపుదిద్దుకుంది. గణితంలో అసమాన ప్రతిభ కలిగిన ఆమె కథతో చిత్రం వస్తోందంటే అందరిలోనూ ఆసక్తే. చాలామందికి శకుంతల దేవి అంటే గణిత మేధావిగానే తెలుసు. అయితే ఆమె గురించి అంతకుమించి ఏం చూపించబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. పైగా టైటిల్‌ రోల్‌ను విలక్షణ నటి విద్యా బాలన్‌ పోషించడం వల్ల అది ఇంకాస్త రెట్టింపైంది. లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? శకుంతల దేవిగా విద్యా బాలన్‌ మెప్పించిందా? దర్శకురాలు అను మేనన్‌ ఈ కథను ఎలా తీర్చిదిద్దారు?

శకుంతల దేవి సినిమాలో విద్యాబాలన్

కథేంటంటే:

పొట్టకూటి కోసం తన కుటుంబ సంప్రదాయాలను సైతం పక్కన పెట్టి బెంగళూరులో ఓ సర్కస్‌ కంపెనీలో పని చేస్తుంటాడు బిషా మిత్ర మణి (ప్రకాష్‌ బెళవాడి). అతని కుమార్తె శకుంతల దేవి (విద్యా బాలన్‌). ఆమెకు గణితమంటే మక్కువ. ఆ విషయాన్ని మూడేళ్ల ప్రాయంలోనే ఆమె తండ్రి బిషా గుర్తిస్తాడు. ఓ రోజు పేక ముక్కలతో ట్రిక్ చేసి తండ్రినే ఓడించినప్పుడు ఆమె ప్రతిభ బయటపడుతుంది. అంకెలను గుర్తు పెట్టుకోవడంలో ఆమెకున్న ప్రతిభను గుర్తించిన తండ్రి.. సర్కస్‌ మానేసి ఆమెతో గణిత ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెడతాడు. దీంతో ఆ నోటా.. ఈ నోటా శకుంతల దేవి పేరు మార్మోగిపోతుంది. అలా మొదలైన శకుంతల దేవి జీవితం ఎలా గడిచింది? గణితంలో ఏ స్థాయికి వెళ్లింది? వైవాహిక జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదుర్కొంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే:

ఇప్పటివరకూ బాలీవుడ్‌తో పాటు, అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ వివిధ బయోపిక్‌లు అలరించాయి. వాటిల్లో కొన్ని సందర్భాల్లో దర్శకులు ఫ్రీ హ్యాండ్‌ తీసుకుని హీరోయిజం ఎలివేషన్‌, పాత్ర ఔచిత్యాన్ని పెంచి చూపడం కనిపించింది. అయితే, శకుంతల దేవి బయోపిక్‌ అందుకు పూర్తి భిన్నం. ఆమె జీవిత కథను యథాతథంగా చూపే ప్రయత్నం చేశారు దర్శకురాలు అను మేనన్‌. సినిమా మొత్తం శకుంతల దేవి కుమార్తె అనుపమ బెనర్జీ దృష్టి కోణం నుంచి సాగుతుంది. దీంతో శకుంతల దేవి బయోగ్రఫీ తెలిసిన వాళ్లకు అంతా కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది. ఆమె జీవితంలో జరిగిన సంఘటనలకు దృశ్యరూపమే ఈ చిత్రం. ఆరేళ్ల ప్రాయంలోనే శకుంతల దేవి ప్రతిభను ఆమె తండ్రి గుర్తించి ప్రోత్సహించడం, అక్కడి నుంచి గణిత టెక్నిక్‌లతో ఆమె ఇచ్చే ప్రదర్శనలు, దాంతో శకుంతల దేవికి వచ్చే పేరు ప్రఖ్యాతలు తదితర సన్నివేశాలతో ప్రథమార్ధం సాగిపోతుంది. శకుంతల దేవి కేవలం గణిత మేధావే కాదు.. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న విషయం చాలా మందికి తెలియదు. పాటలు పాడటం, విహారయాత్రలు, జీవితాన్ని ఆస్వాదిస్తూ బతకడం ఇలా అనేక కోణాలను ఈ చిత్రం చూపించింది.

శకుంతలదేవి సినిమాలో విద్యాబాలన్

ద్వితీయార్ధం వచ్చే సరికి నాటకీయతకు పెద్ద పీట వేశారు దర్శకురాలు. శకుంతల దేవి వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఆయా సన్నివేశాలన్నీ భావోద్వేగంగా సాగుతాయి. కొన్ని ప్రేక్షకుడితో కన్నీళ్లు పెట్టిస్తాయి. తండ్రి, భర్త, కుమార్తె, అల్లుడు ఇలా జీవితంలో కీలక వ్యక్తులతో ఆమెకున్న అనుబంధాలను చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఆమె జీవితంలోకి మరీ లోతుగా వెళ్లలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే శకుంతల దేవి బయోగ్రఫీ చదివిన వాళ్లకు ఫలానా ఘట్టం ఇందులో మిస్సయిందన్న విషయం ఇట్టే తెలిసిపోతుంది. అందుకే మొదటే ఈ చిత్రం ఆమె కుమార్తె దృష్టి కోణం నుంచి సాగుతుందని చెప్పేశారు దర్శకురాలు.

శకుంతల దేవి సినిమాలో విద్యాబాలన్

ఎవరెలా చేశారంటే:

శకుంతల దేవి బయోపిక్‌ అనగానే ఆ పాత్రకు ఎవరిని ఎంచుకుంటారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. విద్యా బాలన్‌ను ఆ పాత్రకు ఎంచుకోవడం దర్శక-నిర్మాతల అభిరుచికి అద్దం పట్టింది. విద్యా బాలన్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిల్క్ ‌స్మిత బయోపిక్‌ 'డర్టీ పిక్చర్‌'లో విద్య కాకుండా ఎవరు చేసినా రక్తికట్టేది కాదు. అదే విధంగా శకుంతల దేవి కూడా అంతే. ఆ పాత్రకు విద్య నూటికి నూరు శాతం న్యాయం చేశారు. స్క్రీన్‌పై ఎక్కడా మనకు విద్యా బాలన్‌ కనపడదు. 'బయోపిక్‌లో నటిస్తున్నప్పుడు.. ఆ వ్యక్తి జీవిత సారాంశాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. బయోపిక్‌లో చేస్తున్నాం కదా అని ఆ వ్యక్తిలా కనిపించడం కోసం హావభావాలను, స్వరాన్ని అనుకరించకూడదు. మనం నేర్చుకోవాల్సిన అంశం ఇదే' అంటూ విద్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. దాన్ని ఆమె మరోసారి అక్షరాలా పాటించింది. ఇక మిగిలిన పాత్రలు జిషు సేన్‌గుప్త, సన్య మల్హోత్ర, అమిత్ సాద్‌, ప్రకాష్‌ బెలవాడి తమ పరిధి మేరకు నటించారు.

శకుంతల దేవి సినిమాలో విద్యాబాలన్

సాంకేతిక బృందం పనితీరు బాగుంది. ఆనాటి వాతావరణం సృష్టించడానికి చాలానే కష్టపడ్డారు. అదంతా స్క్రీన్‌పై కనిపిస్తుంది. శకుంతల దేవి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించడం అంటే ధైర్యమనే చెప్పాలి. ఎందుకంటే కమర్షియల్‌ హంగులకు పెద్దగా ఆస్కారం ఉండదు. అయినా, చక్కగా చూపే ప్రయత్నం చేశారు దర్శకురాలు అను మేనన్‌. శకుంతల దేవికి సంబంధించిన అన్ని కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు

  • విద్యాబాలన్
  • భావోద్వేగ సన్నివేశాలు
  • సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు

  • శకుంతల జీవితాన్ని పూర్తిగా ఆవిష్కరించలేకపోవడం
  • కొన్ని సాగదీత సన్నివేశాలు

చివరిగా: 'శకుంతల దేవి' ఈ బయోపిక్‌ ఓ ప్రత్యేకం. విద్యా బాలన్‌ నట విశ్వరూపం

గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Last Updated : Jul 31, 2020, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details