తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రివ్యూ: రొటీన్​ కథలో థ్రిల్లింగ్ అనుభవం​ ​'మలంగ్​' - Malang Movie Review 2020

ఆదిత్య రాయ్‌ కపూర్‌, దిశా పటానీ కాంబినేషన్​లో తెరకెక్కిన చిత్రం 'మలంగ్‌'. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్బంగా నటీనటుల ఫెర్ఫార్మెన్స్​, చిత్ర విశేషాలపై రివ్యూ చూద్దాం..

Malang Movie Review
రివ్యూ: రొటీన్​ కథలో థ్రిల్లింగ్ ఎక్స్​పీరియన్స్​​ ​'మలంగ్​'

By

Published : Feb 7, 2020, 12:15 PM IST

Updated : Feb 29, 2020, 12:28 PM IST

బాలీవుడ్​ నటులు ఆదిత్య రాయ్‌ కపూర్‌, దిశా పటానీ, అనిల్‌ కపూర్‌, కునాల్‌ ఖేము ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మలంగ్‌'. కత్రినా కైఫ్‌, శ్రద్ధా కపూర్‌లాంటి అగ్ర నాయికలతో కలసి నటించిన.. 'కళంక్‌' లాంటి మల్టీస్టారర్‌ చిత్రంలో కనిపించిన ఆదిత్యరాయ్‌ కపూర్‌కు ఇటీవల సరైన విజయాలు దక్కలేదు. అందుకే ఇప్పుడు వస్తున్న 'మలంగ్‌'పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. 'ఆషికీ 2', 'ఏక్‌ విలన్‌' చిత్రాలతో మెప్పించిన మోహిత్‌ సూరి ఈ సినిమాకు దర్శకుడు. టీ సిరీస్‌ పతాకంపై భూషణ్‌ కుమార్‌ నిర్మించాడు.

ఈ సినిమాలో దిశా పటానీతో కలిసి తొలిసారి తెరపై కనువిందు చేశాడు ఆదిత్య. రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం గోవాలో చిత్రీకరించారు. ట్రైలర్‌లో గోవా బీచ్‌ అందాలు, బికినీలో దిశా గ్లామర్‌ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. మరి ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాగా.. ఎంతమేరకు ఆకట్టుకుంటుంది? ఆదిత్య రాయ్‌ కపూర్‌కు విజయం దక్కిందా? అనే విషయాలు చూద్దాం.

కథేంటంటే:

కొత్త ప్రదేశాలు చుట్టేయడం అద్వైత్‌ ఠాకూర్‌కు (ఆదిత్య) ఇష్టం. అలా గోవా వెళ్తాడు. అక్కడ సారా (దిశా) పరిచయమవుతుంది. ఎలాంటి బాధ్యతలు, బంధాలు లేకుండా తనకు నచ్చినట్లు బతికేయడం సారాకు ఇష్టం. అద్వైత్‌, సారా ఒకరినొకరు ఇష్టపడతారు. గోవా మొత్తం కలిసి తిరిగేస్తూ ఆనందంగా గడుపుతుంటారు. అయితే వారి జీవితాల్లో ఊహించని సంఘటన జరుగుతుంది. ఐదేళ్ల తర్వాత అద్వైత్‌ కొంతమందిని వరుసగా చంపుతుంటాడు. అతణ్ని అడ్డుకోవడానికి పోలీసు అధికారులు ఆంజనేయ్‌ అఘసే (అనిల్‌ కపూర్‌), మైఖేల్‌ (కునాల్‌) రంగంలోకి దిగుతారు. అద్వైత్‌, సారా జీవితాల్లో ఏం జరిగింది? అద్వైత్‌ చంపుతున్నది ఎవరిని? అనే విషయాలను తెరపై చూడాలి.

ఎలా ఉందంటే:

ఇదొక రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో సినిమాలు తీసి విజయం అందుకున్న మోహిత్‌ సూరి ఈసారి గత చిత్రాలకు భిన్నంగా ఈ కథను సిద్ధం చేసుకున్నాడు. భావోద్వేగాలు, థ్రిల్లింగ్‌ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఒక ప్రేమ జంట, వారికి ఓ ఊహించని ఘటన ఎదురవడం, తన జీవితంలో కలకలానికి కారణమైన వారిని కథానాయకుడు వరుసగా చంపుకొంటూ వెళ్లడం. ఈ ఫార్ములాతో ఇప్పటికే చాలా కథలు వచ్చాయి. అయితే, ఉన్న కథనే ఎంత ఉత్కంఠతో దర్శకుడు తెరకెక్కించాడన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. 'మలంగ్​' విషయంలో మోహిత్‌ సూరి విజయం సాధించినట్లే కనిపించారు. క్రిస్మస్‌ రోజు రాత్రి అద్వైత్‌ గోవా పోలీసులను వరుసగా హత్య చేస్తూ ఉంటాడు. అతన్ని పట్టుకునేందుకు అఘసే, మైఖేల్‌లు రంగంలోకి దిగుతారు.

ప్రథమార్ధమంతా పోలీసులను అద్వైత్‌ హత్య చేస్తుండటం అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం తదితర సన్నివేశాలతో ఆసక్తికరంగా రూపొందించాడు దర్శకుడు. విరామ సన్నివేశాల వరకూ పట్టు సడలని స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అద్వైత్‌ ష్లాష్‌ బ్యాక్‌, సారాతో ప్రేమ సన్నివేశాలు యువతను ఆకట్టుకుంటాయి. చూడముచ్చటైన గోవా లొకేషన్లలో సన్నివేశాలు యువతను అలరిస్తాయి. ఎప్పుడైతే అద్వైత్‌-సారాల జీవితంలో ఊహించని సంఘటన ఎదురవుతుందో అప్పటి నుంచి కథ మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. అవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు మోహిత్‌ సూరి. ఒక సగటు రివేంజ్‌ డ్రామాతో సినిమా ముగుస్తుంది. ట్విస్ట్‌ల కోసం దర్శకుడు సినిమాటిక్‌ లిబర్టీని తీసుకున్నాడనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే:

కొంతకాలంగా సరైన విజయాలు లేక ఇబ్బందిపడుతున్న ఆదిత్యరాయ్‌కు ఈ సినిమాతో కాస్త ఊరట లభించదనే చెప్పవచ్చు. యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టాడు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ ఫర్వాలేదనిపించాడు. దిశా పటానీ అందంగా కనిపించింది. తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. ప్రేమ సన్నివేశాల్లో ఇద్దరూ చక్కగా ఒదిగిపోయారు. అనిల్‌కపూర్‌, కునాల్‌లు తమ పరిధి మేరకు నటించారు. దర్శకుడు మోహిత్‌ సూరి ఎంచుకున్న కథ పాతదే అయినా, స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకుంది. ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఇస్తూ, ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్​. యాక్షన్‌ సన్నివేశాలను చక్కగా తెరకెక్కించాడు. కథలో వచ్చే రెండు మూడు ట్విస్ట్‌లు అలరిస్తాయి. అయితే, పెద్దగా సర్‌ప్రైజ్‌లు మాత్రం ఉండవు. నేపథ్య సంగీతం, వికాస్‌ శివరామన్‌ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. గోవా అందాలను చక్కగా చూపించాడు.

బలాలు
+ స్క్రీన్‌ప్లే
+ దర్శకత్వం
+ యాక్షన్‌సన్నివేశాలు

బలహీనతలు
- తెలిసిన కథే కావటం
- ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు

చివరిగా: థ్రిల్‌కు గురిచేసే 'మలంగ్‌'

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Last Updated : Feb 29, 2020, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details