రివ్యూ: 'హసీన్ దిల్‌రుబా' ఎలా ఉందంటే? - వినీల్ మ్యాథ్యూ
తాప్సీ (tapsee), విక్రాంత్ మాస్సే ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'హసీన్ దిల్‌రుబా'(Haseen Dillruba). కరోనా కారణంగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. వినీల్ మ్యాథ్యూ దర్శకత్వంలో రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? తెలుసుకోవాలంటే ఈ సమీక్షను చదివేయండి.
కథను సిద్ధం చేసుకోవడమే దర్శకుడి పని. ఆ కథకు సరిపోయే పాత్రలను దానికదే ఎంచుకుంటుందనేది ఫిలిం మేకర్స్ తరచూ చెప్పే మాట. 'హసీన్ దిల్‌రుబా' సినిమా కూడా బాలీవుడ్ నాయిక తాప్సీని అలా వరించిందే. పలువురు హీరోయిన్లు వద్దని తిరస్కరిస్తే చివరకు ఆమెను చేరిందా కథ. రచయిత కనిక దిల్లోన్ కథ వివరించినప్పుడు ఇలాంటి మర్డర్ మిస్టరీని మిగతా హీరోయిన్లు ఎలా తిరస్కరించారోనని అభిప్రాయం వ్యక్తం చేసిందామె. తాప్సీ సినిమాల్లోకి వచ్చి నేటికి(జులై 2) సరిగ్గా పదకొండేళ్లు. 11 ఏళ్ల క్రితం ఇదే రోజున 'ఝుమ్మంది నాదం'తో నటిగా అరంగేట్రం చేసింది. ఇన్నేళ్ల తన కెరీర్‌లో మరపురాని పాత్రలెన్నో చేసింది.
ఆమె బలంగా నమ్మి తీసిన 'పింక్', 'బద్లా', 'గేమ్ ఓవర్', 'థప్పడ్'తో పాటు పలు చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. తీసే ప్రతి సినిమాలోనూ మహిళల సమస్యలను ప్రస్తావిస్తుంది. కమర్షియల్‌గానూ మంచి విజయాలు సాధించాయి. మరి ఈ సారి తాప్సీ నమ్మకం నిజమైందా? 'హసీన్ దిల్‌రుబా' ప్రేక్షకులను రక్తికట్టించిందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని వెంటనే చూడాల్సిందే.
కథేంటంటే?
రాణి కశ్యప్(తాప్సీ) దిల్లీకి చెందిన యువతి. నవలలు బాగా చదువుతుంది. ముఖ్యంగా దినేశ్ పండిట్ క్రైమ్ నవలలంటే ఎక్కువ ఇష్టం. జీవితం కూడా పుస్తకాల్లోలాగే రొమాంటిక్‌గా ఉండాలని కోరుకుంటుందామె. అలాంటి రాణికి జ్వాలాపుర్ అనే చిన్న టౌన్‌లో ఇంజనీర్‌గా పనిచేసే రిషు(విక్రాంత్)తో పెళ్లవుతుంది. అతనిది మెతకగా ఉండే మనస్తత్వం. రిషుకు పూర్తి భిన్నమైన మనస్తత్వం రాణిది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలొచ్చి దూరం పెరుగుతుంది. అలాంటి సమయంలోనే వీరి జీవితంలోకి నీల్ త్రిపాఠి(హర్షవర్ధన్ రాణే) వస్తాడు. అందగాడు, స్టైలిష్‌గా ఉంటాడు. పైగా రాణి చదివే నవలల్లో ఉండే గుణాలు.. కనిపించేసరికి అతడికి ఆకర్షితురాలవుతుంది.
వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. కొన్నాళ్లకు ఆమెను వదిలేసి నీల్ దిల్లీకి వెళ్లిపోతాడు. వీళ్లిద్దరి మధ్య ఉండే సంబంధం జ్వాలాపుర్‌లో అందరికి తెలిసిపోతుంది. దీంతో మెతకగా ఉండే రిషు రగిలిపోతుంటాడు. ఒకరోజు అతడి ఇంట్లో అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో రిషు చేయి తప్ప మిగతా ఆధారాలేవీ దొరకవు. నీల్ కూడా కనిపించకుండా పోతాడు. పోలీసు విచారణ మొదలవుతుంది. ప్రియుడితో పన్నాగం పన్ని భర్తను చంపిందనే ఆరోపణలను రాణి ఎదుర్కొంటుంది. మరి ఈ విచారణలో తేలిందేంటి? రిషును చంపిందెవరు? ఇంతకీ నీల్ ఏమైపోయాడు? ఆ హత్య ఎవరు చేశారు?
'హసీన్ దిల్రూబా' పోస్టర్
ఎలా ఉందంటే?
సినిమా అంతా మొదటి నుంచే నాన్ లీనియర్ స్ర్కీన్‌ప్లేలో సాగుతుంది. కేసు విచారణతో పాటు, ఫ్లాష్‌బ్యాక్ ఇలా రెండు కథలు సమాంతరంగా నడుస్తాయి. రిషు, రాణి పెళ్లి తర్వాత సన్నివేశాలతో ఫ్లాష్‌బ్యాక్ మొదలవుతుంది. అయితే అవి చాలా వరకూ సాగదీసినట్లుగా ఉన్నాయి. రిషుతో పెళ్లి తర్వాత వచ్చే సన్నివేశాలు, నీలూతో ప్రేమ వ్యవహారం లాంటి ఘటనలతో తొలి అర్ధభాగం సాదాసీదాగా ఉంటుంది. ఆయా సన్నివేశాలను మరింత బలంగా రాసుకోవాల్సింది. కొన్ని చోట్ల మరీ సాగదీసినట్లుగా అనిపిస్తాయి.
నీల్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిశాక కథలో వేగం పెరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్నాక రిషులో వచ్చే మార్పులేంటి? భర్త, సమాజం నుంచి రాణికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? వాటిని ఆమె ఎలా ఎదుర్కొందనే సన్నివేశాలతో రెండో అర్ధభాగం కొంత ఆసక్తికరంగా మొదలవుతుంది. ద్వితీయార్ధంలో విచారణ వేగవంతం కావడం వల్ల ఆ సన్నివేశాలు రక్తికట్టిస్తాయి. ఆ తర్వాత మెలమెల్లగా సస్పెన్స్ తెలిసేకొద్దీ సినిమా ఆసక్తికరంగా మారుతుంది. క్లైమాక్స్‌కు వచ్చే సరికి కథనం మరింత ఉత్కంఠగా సాగుతుంది. చివరి 30 నిమిషాలు ప్రేక్షకుడిని అలరించేలా దర్శకుడు తీర్చిదిద్దాడు. ఇక రిషు, నీల్ ఒకరితో ఒకరు పోటీపడే తీరు సినిమాలో సస్పెన్స్ పెంచేందుకు తోడ్పడింది. ఫస్టాఫ్ కాస్త నిరూత్సాహపరిచినట్లు అనిపించినా సెకండ్ హాఫ్ ఆ లోటును భర్తీ చేసింది.
ఎవరెలా చేశారంటే?
టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్న నటులు తాప్సీ, హర్షవర్ధన్ రాణే, విక్రాంత్ మాస్సే. తాప్సీ ఇప్పటికే తన ప్రతిభేంటో గత చిత్రాలతో నిరూపించుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చేయడం తనకు కొత్తేమీ కాదు. 'పింక్', 'బేబీ' ఇలా ఏ సినిమా తీసుకున్నా అందులో ఎంతో కొంత సస్పెన్స్ ఉండే ఉంటుంది. 'హసీన్ దిల్‌రుబా'లో ఇదివరకు చేయని పాత్రలో బోల్డ్‌గా కనిపించింది. కానీ, ఆ సన్నివేశాలు తాప్సీకి పెద్దగా నప్పలేదు. మిగతా సన్నివేశాల్లో ఎప్పట్లాగే ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విక్రాంత్ మాస్సే గురించి. ఈ యువ నటుడికి తాప్సీ కన్నా ఎక్కువ మార్కులు వేయొచ్చు. మొదటి నుంచి చివరి దాకా తన నటనతో కట్టిపడేశాడు. భార్యను మెప్పించలేని ఓ సాధారణ భర్తగా, సమాజం నుంచి వచ్చే సూటిపోటి మాటలు భరించే వాడిగా సహజంగా నటించాడు. హర్షవర్ధన్ రాణే పాత్ర పరిధి మేర బాగానే నటించాడు. అతడి ప్రతిభను మరింత విస్తృతంగా వినియోగించుకోవాల్సింది. అభిజిత్‌గా 'సీఐడీ' సీరియల్‌తో సుపరిచితుడైన ఆదిత్య శ్రీవాత్సవ ఇందులో పోలీసాఫీసర్‌గా నటించడం బాగుంది.
'హసీన్ దిల్రూబా' పోస్టర్
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. అమిత్ త్రివేది సంగీతంలో వచ్చిన మెలోడియస్ సాంగ్స్ వినసొంపుగా ఉంటాయి. ఇలాంటి మిస్టరీ డ్రామాలను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరోమెట్టు ఎక్కిస్తుంది. అయితే, ఆ స్థాయి సంగీతం ఇవ్వలేకపోయాడు అమిత్. పాటలతో కొంత మేర ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువల్లో ఎలాంటి లోటు కనిపించలేదు. ఎడిటింగ్ విషయంలో తొలి అర్ధభాగంపై మరింత దృష్టి పెట్టాల్సింది. 'హసీతో ఫసీ' లాంటి రొమాంటిక్ లవ్ స్టోరీని అందించిన దర్శకుడు వినిల్ మాథ్యూ ఈ మర్డర్ మిస్టరీను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో విజయం సాధించాడు. ఓవరాల్‌గా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారిని ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.