- చిత్రం: గులాబో సితాబో
- నటీనటులు: అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా, విజయ్ రాజ్, బ్రిజేంద్ర కాలా, ఫరూఖ్‌జఫర్, సృష్టి శ్రీవాస్తవ తదితరులు
- సంగీతం: శంతన్, అభిషేక్ అరోరా, అంజూ గార్గ్
- నిర్మాత: రోని లహ్రి, షీల్ కుమార్
- దర్శకత్వం: సూజిత్ సర్కార్
- విడుదల: అమెజాన్ ప్రైమ్
80ఏళ్లకు దగ్గర పడుతున్నా నటుడిగా ఏ యువహీరో ఎంచుకోని పాత్రల్లో నటిస్తూ అదరగొడుతున్నారు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. ఇక యువ కథానాయకుల్లో విభిన్న పాత్రలతో, కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆయుష్మాన్ ఖురానా. రెగ్యులర్ కమర్షియల్ కథలకు దూరంగా ఆయన చిత్రాలు ఉంటాయి. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తి ఉంటుంది. అలా సూజిత్ సర్కార్ దర్శకత్వంలో వీరు కలిసి పనిచేసిన సినిమా 'గులాబో సితాబో'. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకుని, విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఏప్రిల్‌లో విడుదల చేద్దామనుకునే సరికి లాక్‌డౌన్ అడ్డుపడింది. దీంతో అమెజాన్ ప్రైమ్‌లో తీసుకురావాలని దర్శక-నిర్మాతలు నిర్ణయించారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? అసలు ఈ చిత్ర కథేంటి? అమితాబ్, ఆయుష్మాన్ ఎలా నటించారు?
కథేంటంటే?
లఖ్‌నవూలోని అతి పురాతన భవనం ఫాతిమా మహల్‌లో పలు కుటుంబాలు అద్దెకు నివసిస్తుంటాయి. దాని యజమాని బేగమ్(ఫరూక్ జఫర్) వృద్ధురాలు. ఆమె స్నేహితుడు మీర్జా షేక్ (అమితాబ్ బచ్చన్) అక్కడ ఉండే వారి దగ్గర నుంచి అద్దెలు వసూలు చేస్తుంటాడు. బాన్‌కీ(ఆయుష్మాన్ ఖురానా) తన తల్లి, ముగ్గురు చెల్లెళ్లతో కలిసి అదే ఫాతిమామహల్‌లో ఎన్నో ఏళ్లుగా అద్దెకు ఉంటాడు. అయితే, ఎప్పుడూ సరిగ్గా అద్దె చెల్లించడు. అడిగితే మీర్జాను దబాయించి బతుకుతుంటాడు. ఒకరోజు బాన్‌కీ కోపంతో చేసిన పని కారణంగా ఫాతిమా మహల్, దాని ఓనర్‌షిప్‌పై వివాదం మొదలవుతుంది. అసలు ఫాతిమా మహల్ ఎవరిది? మీర్జా, బాన్‌కీల మధ్య మొదలైన వివాదం ఎటువైపుకు దారి తీసింది. మధ్యలో పురావస్తుశాఖలో పనిచేసే గణేశ్ శుక్లా(విజయ్‌రాజ్), లాయర్ క్రిస్టోఫర్ క్లార్క్(బ్రిజేంద్ర కాలా) రావడం వల్ల కథ ఎలా మలుపు తీసుకుంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే?
సూజిత్ సర్కార్ చిత్రమంటే విభిన్న కథ, కథనాలు ఆశిస్తారు ప్రేక్షకులు. 'విక్కీ డోనర్', 'పీకూ', 'అక్టోబరు' చిత్రాలే అందుకు ఉదాహరణ. వయసు పెరుగుతున్న తన నటనా చాతుర్యంతో వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు అమితాబ్. బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా చిత్రాల ఎంపిక భిన్నం. మరి ఈ ముగ్గురూ కలిశారంటే అంచనాలు భారీగా ఉంటాయి. కానీ, చాలా చిన్న పాయింట్‌ను ఎంచుకుని 'గులాబో సితాబో' తీశారు. ఈ కథ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 'దురాశ దుఖాఃనికి చేటు'. ఫాతిమా మహల్ అద్దె కోసం మీర్జా, బాన్‌కీల మధ్య జరిగే చిన్న గొడవలతో సినిమాను మొదలు పెట్టాడు దర్శకుడు. ప్రథమార్ధం అంతా వీరిద్దరి మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ ఆటలతోనే సరిపోతుంది. ఆ సన్నివేశాలన్నీ సరదాగా అనిపిస్తాయి. ఎప్పుడైతే పురావస్తుశాఖ అధికారి గణేశ్ శుక్లా ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి కథ మలుపు తీసుకుంటుంది. అది ప్రభుత్వపరం కాకుండా ఉండాలంటే ఆ మహల్‌ను దక్కించుకోవడమే సరైన నిర్ణయమని మీర్జా భావిస్తాడు. తను లాయర్‌ను కలవడం, బేగమ్ నుంచి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకునేందుకు చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి.
అయితే, ప్రథమార్ధంలో ఉన్నంత జోష్ ద్వితీయార్ధానికి వచ్చేసరికి ఉండదు. కథనం నెమ్మదిగా సాగుతుంది. మీర్జా లాయర్‌ను కలవడం, బాన్‌కీ పురావస్తుశాఖ అధికారిని కలవడం ఇవే సన్నివేశాలు తరచూ కనిపిస్తాయి. దీంతో చూసిన సన్నివేశాలే చూశామా? అన్నభావన ప్రేక్షకుడికి కలుగుతుంది. ఒక్కటీ భావోద్వేగ సన్నివేశం ఉండదు. కథ ఫ్లాట్‌గా సాగుతుంది. పైగా కథ అంతా ఫాతిమా మహల్ చుట్టూ తిరగడం వల్ల తెరపై అది తప్ప మరొక నేపథ్యం కనిపించదు. చివరకు ఫాతిమా మహల్‌ను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించే సమయానికి బేగమ్ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ ఊహించరు. అందరూ ఆశ్చర్యపోతారు. అదే కథలో కీలక, చివరి మలుపు.