చిత్రం:99 సాంగ్స్; నటీనటులు: ఇహాన్ భట్, ఎడిల్సీ వర్గస్, ఆదిత్య సియోల్, మనీషా కొయిరాలా, లీసా రే, టెంజిన్ డల్హ, థామస్ ఆండ్రూస్ తదితరులు; సంగీతం, కథ: ఎ.ఆర్.రెహమాన్; ఛాయాగ్రహణం: తనయ్, జేమ్స్ కౌలీ, కూర్పు: అక్షయ్ మెహతా, శ్రేయాస్.బి; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశ్వేష్ కృష్ణమూర్తి; సంస్థ: ఐడియల్ ఎంటర్‌టైన్‌మెంట్, వై.ఎమ్.మూవీస్; విడుదల: జియో స్టూడియోస్; విడుదల తేదీ: 16-04-2021
కథేంటంటే: జై (ఇహాన్‌భట్)కి చిన్నప్పట్నుంచి సంగీతంపై మక్కువ. కానీ, అతని తండ్రికి సంగీతంపై సదాభిప్రాయం ఉండదు. సంగీతం మన జీవితాల్నే నాశనం చేసిందని చెబుతూనే తన కొడుకుని పెంచి పెద్ద చేస్తాడు. కానీ, తండ్రి మాటలు పెడచెవిన పెట్టిన జై పెద్దయ్యాక సంగీతం వైపే వెళతాడు. ఈ క్రమంలో అతను సోఫీ (ఎడిల్సీ వర్గస్) అనే యువతి ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి పేరున్న వ్యాపారవేత్త. సంగీతానికి సంబంధించిన వ్యాపారాన్ని అప్పజెబుతానని, అందుకు ఒప్పుకొంటే తన కూతురుని ఇస్తానని చెబుతాడు. కానీ, సంగీతాన్ని వ్యాపారంలా చూడటం తనకి ఇష్టం లేదని, ఒక్క పాట ప్రపంచాన్ని మార్చేస్తుందని చెబుతాడు. ఒక్క పాట కాదు.. వంద పాటలు చెయ్ , వాటితో ఏం మారుస్తావో చూస్తా అంటూ సవాల్ విసురుతాడు సోఫీ తండ్రి. అలా పాటల ప్రయాణం మొదలుపెట్టిన జైకి జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురయ్యాయి. అతను అనుకున్నట్టుగా తాను చేసిన ఆ ఒక్క పాట ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపించింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: 'చూపు కంటే కూడా అనుభూతి గొప్పది. అనుభూతిని పంచే ఓ గొప్ప శక్తి సంగీతానికి ఉంది'.. 'ప్రపంచంలో మిగిలిన ఒకే ఒక్క మేజిక్... మ్యూజిక్' - ఈ తరహా సంభాషణలు సినిమాలో వినిపిస్తాయి. ఆ మాటలు నిజమే కానీ.. సంగీతం నేపథ్యంలో సాగే ఈ కథ మాత్రం ప్రేక్షకులకు పెద్దగా అనుభూతిని పంచకుండానే ముగుస్తుంది. ఒక ప్రేమ జంట నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ జంటని విధి ఎలా విడదీసింది? మళ్లీ ఎలా కలిపిందనే విషయాల్ని సంగీతంతో ముడిపెట్టిన తీరు మెప్పిస్తుంది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతంపై ప్రేమని చాటుతూ, ఆ నేపథ్యంలో ఓ మంచి కథనే రాసుకున్నారు. అయితే ఆ కథకి తగ్గట్టుగా కథనం లేకపోవడం వల్ల సినిమా ఏ దశలోనూ ఆసక్తిని రేకెత్తించదు. ఆరంభం, ప్రేమ జంట మధ్య ఎడబాటు, షిల్లాంగ్‌లో సంగీత సాధన వరకూ పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత కథలో బలం తగ్గింది. కొన్ని సన్నివేశాలు గందరగోళాన్ని రేకెత్తిస్తాయి.
కథానాయకుడి తండ్రి సంగీతం మన జీవితాల్ని నాశనం చేసిందని చెప్పే మాటలు తరచూ వినిపిస్తుంటాయి. దానికి ఫ్లాష్ బ్యాక్‌లో మరో బలమైన కథేమైనా ఉందేమో అనుకుంటారంతా. కానీ, ఆ సన్నివేశాలు చాలా చప్పగా, ఏ మాత్రం భావోద్వేగాల్ని పంచకుండా సాగుతాయి. చివర్లో కథని మలుపు తిప్పే పాట ఒకటి ఉంటుంది. అందులోనైనా మేజిక్ కనిపిస్తుందేమో అని చూస్తే, ఆ పాటలో భావం తప్ప సంగీతంతో జోష్ తెచ్చిందేమీ లేదు. దాంతో పతాక సన్నివేశాలు కూడా సాదాసీదా ముగుస్తాయి. కళాత్మకత ఉట్టిపడే సన్నివేశాలు.. కొన్ని వినసొంపైన గీతాలు, నేపథ్య సంగీతంతో కొన్ని చోట్ల మెరుపులు కనిపిస్తాయంతే. 'జాతీయ గీతం ఉంటుంది తప్ప.. జాతీయ ప్రసంగం ఉండదు కదా' అంటూ సంగీతం గొప్పదనం గురించి చెప్పిన మాటలు ఆకట్టుకుంటాయి.