'దంగల్' ఫేమ్ జైరా వసీం చేసిన ఓ ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగా ఆమె సామాజిక మాధ్యమాలను వీడింది. అయితే ఒక్కరోజులోనే మనసు మార్చుకుని మళ్లీ సోషల్ మీడియాకు రీఎంట్రీ ఇచ్చింది. అందుకు గల కారణాన్ని కూడా తెలిపింది.
"నేను కూడా ఓ మనిషినే. అందరూ కోరుకునే లాగా నాకూ కాస్త విరామం అవసరమనిపించింది. నా తల హీటెక్కిపోయింది. అటువంటి సందర్భంలో విరామం తీసుకున్నా."
-జైరా వసీం, మాజీ నటి
ప్రస్తుతం దేశంలో మిడతలు పంటలను నాశనం చేస్తున్నాయి. దీనిని సమర్థించేలా "అందుకే మేము వారిపైకి వరదలు, మిడతలు, పేలు, కప్పలు, రక్తాన్ని పంపాము. దీనికి కారణం వారికి కూడా తెలుసు. అయితే వారు అహంకారంలో కళ్లుమూసుకుపోయి ఉన్నారు. వారంతా అసలైన పాపాత్ములు" అంటూ ఖుురాన్లోని వ్యాఖ్యలను ట్వీట్ చేసింది జైరా. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా సామాజిక మాధ్యమ అకౌంట్లను తొలగించింది జైరా.
ఇటీవలే జైరా వసీం నటనకు గుడ్‌బై చెప్పింది. చిత్ర పరిశ్రమ నుంచి పూర్తిగా తప్పుకొంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. నటనలో భాగంగా తన నమ్మకాన్ని, మతం విలువలను విడిచిపెట్టి జీవించాల్సి వస్తోందనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వివరించింది.