తెలంగాణ

telangana

ఇక ప్రేమ కథలు చేయను: విజయ్

By

Published : Feb 12, 2020, 5:44 AM IST

Updated : Mar 1, 2020, 1:16 AM IST

టాలీవుడ్‌ యువ సంచలనం విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. ప్రతి సినిమాలో కొత్తగా కనిపిస్తున్న విజయ్‌ ఈసారి సరికొత్త పాత్రల్లో నలుగురు భామలతో కలిసి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌, పాటలు ఇప్పటికే విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రేమికుల రోజున విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి పలు విషయాలు విజయ్​ మీడియాతో పంచుకున్నాడు.

you can see different vijay after this movie
మూడు నెలల్లో కొత్త విజయ్​ని చూస్తారు..!

నాలో మార్పు చూస్తారు..

మూడు నెలల్లో మీరు నాలో మార్పు చూస్తారు. 'గీతా గోవిందం' తర్వాత నాలో ఆ మార్పు మొదలైంది. ఇంట్లో మా అమ్మ కూడా ఇదే విషయం చెబుతోంది. రానున్న సినిమాల్లో మీరు పూర్తిగా భిన్నమైన విజయ్‌ను చూస్తారు. ఈ సినిమాతో పాటు 'ఫైటర్‌'లోనూ నేను కొత్తగా కనిపిస్తా. ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైంది. దీనిపై నాకు చాలా నమ్మకం ఉంది. అందుకే ఎక్కువగా ప్రచారం చేయలేదు. ప్రచారం చేయకపోతే సినిమాలు ఆడవా..? ప్రస్తుతానికి బంతి గాల్లో ఉంది. అది స్టేడియం అవతల పడుతుందా.. లేక బౌండరీ లైన్‌ వద్ద ఎవరైనా క్యాచ్‌ పడతారా అనేది వేచి చూడాలి.

మూడు నెలల్లో కొత్త విజయ్​ని చూస్తారు..!

మూడు లవ్‌స్టోరీలు పూర్తి విభిన్నం

మూడు విభిన్న ప్రేమకథల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. సినిమాలో ఐశ్వర్యతో ప్రేమకథ నాకు బాగా నచ్చింది. అలాంటి పాత్రను సినిమాల్లో గానీ.. నిజంగా గానీ ఎప్పుడూ చూడలేదు. దానికి పూర్తి భిన్నంగా మరో ప్రేమకథ.. ఈ రెండింటికి భిన్నంగా ఇంకో ప్రేమకథ ఉంటుంది. ఇలా మూడు వైవిధ్యమైన ప్రేమకథలను ఈ సినిమాలో చూపించాం. ఒక పాత్రలో నుంచి మరో పాత్రలోకి మారే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డా. శారీరకంగా, మానసికంగా బాగా కష్టపడాల్సి వచ్చింది.

మూడు నెలల్లో కొత్త విజయ్​ని చూస్తారు..!

ఇక లవ్‌స్టోరీల్లో నటించను

ఇప్పటికే నా కెరీర్‌లో లవ్‌స్టోరీలు ఎక్కువయ్యాయి. 'పెళ్లి చూపులు', 'అర్జున్‌రెడ్డి', 'గీతాగోవిందం' మూడూ ప్రేమకథా చిత్రాలే. అయితే.. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. అయినా సరే.. ఇకపై ప్రేమకథలు చేయకూడదని నిర్ణయించుకున్నా. కానీ.. 'టాక్సీవాలా' వంటి సినిమాలు వస్తే మాత్రం చేస్తానేమో చెప్పలేను. ఎందుకంటే ఆ సినిమాలో ప్రేమకథ చాలా ప్రత్యేకం. ప్రతి మనిషి జీవితంలో ప్రేమ చాలా అవసరం. అయితే.. ఈ మధ్య కొంతమంది ఒకరితో బ్రేకప్‌ చెప్పి మరొకరితో ప్రేమలో పడుతున్నారు. అలాంటప్పుడు నిజమైన ప్రేమకు స్థానం ఎక్కడ ఉంటుంది. ఒకేసారి ఇద్దరు ముగ్గురిని మనస్ఫూర్తిగా ప్రేమించడం సాధ్యం కాదని అనుకుంటున్నా.

మూడు నెలల్లో కొత్త విజయ్​ని చూస్తారు..!

స్ర్కిప్ట్‌ మనతో మాట్లాడుతుంది

స్ర్కిప్ట్‌ చదవగానే అది మనతో మాట్లాడుతుందని నా నమ్మకం. సినిమాకు మనం ఎలా సిద్ధం కావాలో చెప్తుంది. క్రాంతి తీసుకొచ్చిన కథ చూడగానే నాకు అలాగే అనిపించింది. సినిమా బాగా వచ్చిందంటే కారణం డైరెక్టర్‌ క్రాంతి మాధవ్‌. క్రెడిట్‌ మొత్తం ఆయనకే దక్కుతుంది. మంచి స్ర్కిప్ట్‌ తీసుకొచ్చి నాతో సినిమా తీశారు. నేను తీసిన తొమ్మిది సినిమాల్లో దాదాపు ఏడుగురు కొత్త దర్శకులే. కొత్తవారితో చేసేటప్పుడు మనపై బాధ్యత పెరుగుతుంది. దర్శకులు కూడా మనతో కలిసి పనిచేస్తారు. 'పెళ్లి చూపులు', 'అర్జున్‌రెడ్డి', 'గీతా గోవిందం' సినిమాల్లో నేను డైరెక్టర్లతో కలిసి అన్ని చర్చించేవాడిని. అందరూ కలిసి పనిచేస్తేనే సినిమా బాగా వస్తుందనడానికి ఆ సినిమాలే మంచి ఉదాహరణ.

మూడు నెలల్లో కొత్త విజయ్​ని చూస్తారు..!

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా మంచి గుర్తింపునిస్తాయి

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా సరే.. ఆ సినిమా జ్ఞాపకాలు జనంలో ఎప్పటికీ ఉండిపోతాయి. 'డియర్‌ కామ్రేడ్‌' కూడా ఆ కోవలోకే వస్తుంది. హిట్టు కొట్టకపోయినా బయట నాకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. పూరిజగన్నాథ్‌ గారితో 'ఫైటర్‌' సినిమా చేస్తుంటే ముంబయిలో అందరూ నన్ను బాబీ అని పిలవడం మొదలుపెట్టారు. ఆ సినిమా యూట్యూబ్‌లో మనదేశంలోనే కాదు.. వేరే దేశాల్లోనూ బాగా ఆదరణ పొందింది. ఇక 'ఫైటర్‌' విషయంలో చాలా ఆతృతగా ఉన్నా. అందుకు చాలా కష్టపడుతున్నా. చివరగా.. నా సినిమా హిట్టయినా ప్లాఫ్‌ అయినా సంతోషంగానే ఉంటా. ఎందుకంటే నిర్ణయం తీసుకుంది నేనే కాబట్టి. మన జీవితంలో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం గొప్ప విషయం.

ఇదీ చదవండి:'విక్రమ వేద' తెలుగు రీమేక్​లో నటించేది ఎవరు?

Last Updated : Mar 1, 2020, 1:16 AM IST

ABOUT THE AUTHOR

...view details