యథార్థ సంఘటనల ఆధారంగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పలాస 1978'. జానపద కళలు మన వారసత్వ సంపదని వాటిని మనమే నాశమం చేస్తున్నామని అభిప్రాయపడ్డ ఇతడు.. ఈ సినిమాను ఓ వాణిజ్య ప్రధానాంశంతో తీశామని చెప్పాడు.
"తరాలుగా ప్రపంచమంతా జరుగుతున్న కథ ఇది. ఒక సామాజిక సమస్యను వాణిజ్య ప్రధాన కథతో చెప్పబోతున్నాం. 'సిటిజన్ కేన్' సినిమా తరహాలో ఈ కథను మూడు పాత్రలు చెబుతుంటాయి. నిత్యం మనం పత్రికల్లో చదివే సంగతులు, మనం నడుచుకుంటున్న విధానమే ఈ కథలో ప్రతిబింబిస్తుంది. ప్రతి ఐదు నిమిషాలకు కథ మారిపోతుంటుంది. చిత్ర పరిశ్రమలో చాలా మంది ఈ సినిమాను చూశారు. 25 ఏళ్ల కాలంలో ఇలాంటి కథ రాలేదని అన్నారు. కచ్చితంగా ప్రేక్షకుల మెప్పు పొందుతుందనే నమ్మకం ఉంది"
"‘మాది పలాస దగ్గరలోని కంట్రగడ. పేదరికంతో 15 ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి వెళ్లిపోయా. మద్రాస్ వెళ్లి హోటల్‌లో ప్లేట్లు కడగడం నుంచి జీవితాన్ని మొదలుపెట్టా. ఆఫీస్‌బాయ్, ఆఫీస్ అసిస్టెంట్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్... ఇలా చాలా పనులు చేశా. తెలియని ప్రాంతం, భాష కావడం వల్ల పుస్తకం ఒక్కటే నాకు అందుబాటులో ఉండేది. అలా సాహిత్యంపై మక్కువ పెరిగింది. క్రమంగా రాయడం అలవాటైంది. కొన్నేళ్ల తర్వాత తిరిగి ఇంటికొచ్చా. జీవనోపాధి కోసం రకరకాల వ్యాపారాలు చేస్తూ హైదరాబాద్ చేరుకున్నా. నేను రాసిన 'చున్నీ' అనే కథకు మంచి పేరొచ్చింది. 2016లో స్వచ్ఛభారత్ పోటీల్లో 'చెంబుకు మూడింది' అనే లఘు చిత్రం తీస్తే జాతీయ పురస్కారం వచ్చింది. రూ.12 వేలతో తీసిన ఆ చిత్రానికి రూ.5 లక్షల బహుమతి లభించింది. 'అ!' సినిమాకు రచనా సహకారం చేశా. మొత్తం 25 చిత్రాలకు పనిచేశా"