బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య విషయంలో నటి రియా చక్రవర్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆమెకు మద్దతిచ్చే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. హీరోయిన్ తాప్సీ, నటి మంచు లక్ష్మి ఇప్పుడు రియాకు అనుకూలంగా మాట్లాడారు. ఆమె విషయంలో మీడియా పరిధి దాటి ప్రవర్తిస్తోందని అన్నారు.
"సుశాంత్, రియాతో నాకు పెద్దగా పరిచయం లేదు. నేరం రుజువు కాకముందే ఓ వ్యక్తిని దోషిగా చూపే ప్రయత్నాలు చేయడం చాలా తప్పు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి"
-తాప్సీ, హీరోయిన్
రియా ఇంటర్వ్యూను తాను చూశానని చెప్పిన నటి మంచు లక్ష్మి.. 'జస్టిస్ ఫర్ రియా చక్రవర్తి' అనే హ్యాష్ ట్యాగ్‌తో ఓ పోస్టు పెట్టింది.
"రియా చక్రవర్తి, రాజ్ దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూను పూర్తిగా చూశాను. నేను స్పందించాలా?వద్దా? అని ఎంతో ఆలోచించాను. రియాను ఇప్పటికే ఓ రాక్షసురాలిగా మీడియా చిత్రీకరించింది. దీనిపై చాలామంది సినీ పెద్దలు మౌనంగా ఉన్నారు. నిజం తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. అది బయటకు వస్తుందని కచ్చితంగా నమ్ముతున్నాను. భారత న్యాయ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉంది. సుశాంత్ సింగ్‌కు కూడా న్యాయం జరగాలి. అప్పటివరకూ అందరం సహనంతో ఉండాలి. నిజానిజాలు తెలియకుండా రియా కుటుంబంపై నిందలు వేయడం సరికాదు. ఈ సమయంలో వారు ఎంత బాధను అనుభవిస్తున్నారో ఊహించగలను. కనీసం నిజం వెలుగులోకి వచ్చేంత వరకైనా రియాను ఒంటరిగా వదిలేయండి. ఈ క్లిష్ట సమయంలో నేను రియాకు మద్దతుగా నిలుస్తున్నాను"
-మంచు లక్ష్మి, టాలీవుడ్ నటి
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నటి స్వరా భాస్కర్.. రియాకు మద్దతుగా నిలిచారు. వీరు కూడా మీడియాపై ధ్వజమెత్తారు. సుశాంత్ కేసును సీబీఐ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా రియా సహా పలువురు వ్యక్తులను విచారిస్తూ, వారి స్టేట్స్మెంట్స్ను రికార్డు చేస్తోంది.
ఇది చూడండి ట్రైలర్: బేర్‌గ్రిల్స్‌తో అక్షయ్ సాహసయాత్ర