'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' లాంటి వరుస విజయాల తర్వాత నితిన్ కొన్ని పరాజయాలను చవిచూశారు. అలాంటి వాటిల్లో ముఖ్యంగా ఒక సినిమా ఫ్లాప్ అవుతుందనే విషయం నితిన్‌కు షూటింగ్ దశలోనే తెలుసని నటుడు హర్షవర్ధన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నితిన్ హీరోగా నటించిన పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేయడం కాకుండా రచయితగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన హర్షవర్ధన్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నితిన్‌తో తనకున్న అనుబంధం గురించి పలు విషయాల్ని చెప్పారు.
'ఫ్లాప్ అని తెలిసినా నితిన్ ఆ సినిమా చేశారు' - nithiin news
నితిన్‌తో తనకున్న అనుబంధాన్ని నటుడు, రచయిత హర్షవర్ధన్ పంచుకున్నారు. గతంలో ఓ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసినా సరే నితిన్ దాన్ని చేశారని అన్నారు.
"ఇష్క్'లో కొన్ని సన్నివేశాల కోసం నేను రచయితగా పనిచేశాను. నా పని నచ్చడం వల్ల వేరే సినిమాల్లో తప్పకుండా అవకాశమిస్తామని నితిన్, విక్రమ్ ఇద్దరూ మాటిచ్చారు. ఆ మాటల్ని నేను అంతగా నమ్మలేదు. మాట ప్రకారమే విక్రమ్.. 'మనం' రచయితగా పనిచేసే అవకాశాన్ని ఇచ్చారు. అలాగే నితిన్ 'గుండెజారి గల్లంతయ్యిందే'లో ఆఫర్ లభించింది. ఆ రెండు చిత్రాలకు నాకు లభించిన గుర్తింపు మాటల్లో చెప్పలేను"
"నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే. అతను నాకు సోదరుడితో సమానం. నాకెంతో ఇష్టమైన వ్యక్తి. నిజాయతీ ఉన్న మనిషి. నితిన్ వాళ్ల నాన్నకు డిస్టిబ్యూటర్, నిర్మాతగా మంచి అనుభవం ఉంది. దానివల్ల ఇతనికి సినిమాల విషయంలో ఓ సరైన అవగాహన ఉంది. కథ గురించి క్రియేటివ్ అంశాల గురించి ఆలోచిస్తాడు. 'ఇష్క్' తర్వాత మేమిద్దరం ఓ సినిమాలో కలిసి నటించాం. ఆ సినిమా పేరు చెప్పకూడదు. కానీ, ఆ సినిమా 20శాతం చిత్రీకరణ అయ్యేసరికి.. అది సక్సెస్ కాదని నితిన్‌కు అర్థమైపోయింది. ఆ విషయాన్ని నాతో చెప్పి.. ఏదైనా మార్పులు చేద్దామని అన్నాడు. వెంటనే నేను కొంచెం మార్పులు చెప్పాను. అది నితిన్‌కి బాగా నచ్చింది. ఆ మార్పుల గురించి దర్శకుడితో చెబితే.. వాళ్లు ఓకే చేయలేదు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. కథతోపాటు టెక్నికల్ అంశాలు కూడా నచ్చితేనే సినిమా ఓకే చేయాలని ఆయన అప్పుడే నిర్ణయించుకున్నాడు. అలా, వచ్చిందే 'భీష్మ'' అని హర్షవర్ధన్ వివరించారు.