తెలంగాణ

telangana

ETV Bharat / sitara

''పుష్ప'లో ఆ మూడు సీన్లు చూసి సుకుమార్​-బన్నీకి దణ్ణం పెట్టేశా' - samantha item song pushpa

'పుష్ప' పాటల కోసం ఎంతలా కష్టపడ్డానో గేయరచయిత చంద్రబోస్ వివరించారు. అలానే సినిమాలోని మూడు సీన్లు చూసి బన్నీ-సుకుమార్​కు దణ్ణం పెట్టేశానని అన్నారు.

allu arjun pushpa movie
పుష్ప సినిమాలో అల్లు అర్జున్

By

Published : Dec 10, 2021, 6:47 AM IST

Updated : Dec 10, 2021, 9:16 AM IST

Pushpa movie: "నా దృష్టిలో కవి అనేవాడు ఒక్క మనిషి కాదు. పైకి ఒక్కడిలా కనిపిస్తాడు కానీ.. అనేక మనుషుల సంకలనం కవి. అందరి లోకాల్లోకి వెళ్లి.. వాళ్లందరి మానసిక స్థితిని అనుభవిస్తాడు. అలా అనుభవించగలిగినప్పుడే ఎలాంటి పాటనైనా అర్థవంతంగా రాయగలం" అని గీత రచయిత చంద్రబోస్‌ అన్నారు. ఇప్పుడాయన 'పుష్ప' కోసం పాటలందించారు. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రమిది. సుకుమార్‌ దర్శకుడు. రష్మిక కథానాయిక. ఈ సినిమా డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు చంద్రబోస్‌.

రైటర్ చంద్రబోస్

Chandrabose pushpa songs: * 'పుష్ప' అనే కాదు.. ప్రతి సినిమా సవాల్‌లాగే ఉంటుంది. సుకుమార్‌ స్వతహాగా కవి. చక్కటి కవిత్వం రాస్తుంటారు. కాబట్టి ఆయన సినిమాకు పాటలు రాయడమంటే అది మరింత సవాల్‌లా అనిపిస్తుంది. ఆయన్ని ఒప్పించేలా కాకుండా ప్రతి సందర్భంలోనూ మెప్పించేట్లు రాయాలని బలంగా నిర్ణయించుకుంటా. అది 'ఆర్య' నుంచి ఇప్పటి వరకు దిగ్విజయంగా పూర్తి చేస్తూ వస్తున్నా. 'రంగస్థలం' తర్వాత నుంచి మా కాంబినేషన్​కు బాధ్యత పెరిగింది. నిజానికి ఆ చిత్రంలో ఏ పాటను నేను రాయలేదు. వచించాను. సందర్భం చెబుతుంటే ఆసువుగా చెప్పేసేవాడిని. ఆ చిత్ర పాటలన్నీ విడుదలయ్యాక.. లిరికల్‌ షీట్స్‌ రిలీజ్‌ చేద్దామన్నప్పుడే పాటల్ని కాగితంపై రాశాను. అందుకే నా 27ఏళ్ల సినీ కెరీర్‌లో 'రంగస్థలం' ఓ మధురమైన అనుభూతినిచ్చిన చిత్రమైంది. ఈ సినిమాకు మాత్రం అన్ని పాటలు అంత ఈజీగా రాలేదు. ప్రతి గీతాన్ని ముందే రాసుకున్నా. వాటిలో కొన్ని సాహిత్యానికి తగ్గట్లుగా ట్యూన్‌ కట్టినవి ఉన్నాయి. ట్యూన్‌కు తగ్గట్లుగా సాహిత్యమందించినవి ఉన్నాయి.

అల్లుఅర్జున్ పుష్ప

* ఇది 'రంగస్థలం'కు పూర్తి భిన్నమైన కథ. అక్కడ చిట్టిబాబు వేరు.. ఇక్కడ పుష్పరాజ్‌ వేరు. అందులో రామలక్ష్మి వేరు.. ఈ సినిమాలో శ్రీవల్లి వేరు. కథా నేపథ్యమే చాలా కొత్తగా ఉంటుంది. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికీ ఒక ఆలోచన ఉంటుంది. ఒక జీవితం ఉంటుంది. వాళ్లదైన జీవన సంగీతముంటుంది. దాన్ని స్పృశించి.. వెలికితీసిన సినిమా ఇది. 'దాక్కో దాక్కో మేక' పాటది ఓ కొత్త రకమైన నేపథ్యం. ఆహారపు గొలుసుతో.. ఆధ్యాత్మిక తత్వాన్ని జోడించి రచించిన గీతమిది. ఈ సినిమా విషయంలో నేనెక్కువ సమయం వెచ్చించిన పాటిదే. శుక్రవారం విడుదలవుతున్న ప్రత్యేక గీతం 'ఊ అంటావా..' అందరికీ నచ్చేలా ఉంటుంది. సమాజంలోని ఓ అంశాన్ని కథగా మలచుకుని ఆ పాట రాశాం. దానికి సమంత, బన్నీ వేసిన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

Sukumar pushpa movie: * ఈ చిత్రంలోని ఓ మూడు సీన్లు సుకుమార్‌ నాకు చూపించారు. అది చూసి.. సుక్కుకు, అల్లు అర్జున్‌కు దణ్ణం పెట్టేశా. ముఖ్యంగా పుష్ప పాత్ర కోసం బన్నీ ఎంతటి అంకిత భావంతో పని చేశాడో చూసి ఆశ్చర్యమేసింది. చెన్నైలో పుట్టి.. హైదరాబాద్‌లో పెరిగిన ఆయన చిత్తూరు యాసను అంత అనర్గళంగా మాట్లాడుతుంటే నిర్ఘాంతపోయా. ఈ సినిమాలో 'శ్రీవల్లి' గీతం అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైంది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 10, 2021, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details