యువహీరో విజయ్ దేవరకొండ మరోసారి సాహసం చేస్తున్నాడా? హీరోలు శర్వానంద్, సాయి తేజ్ వద్దన్న కథను తాను తెరపై చూపించబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వాళ్లు వద్దన్న ప్రాజెక్టు మరేదో కాదు 'వరల్డ్ ఫేమస్ లవర్'.
'వరల్డ్ ఫేమస్ లవర్'లో విజయ్ దేవరకొండ ఓ వైవిధ్యమైన ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే వచ్చిన టీజర్.. అభిమానులను అలరిస్తోంది. ఇందులో ఐశ్వర్య రాజేశ్, రాశీఖన్నా, ఇస్బెల్లా, కేథరిన్ హీరోయిన్లతో రోమాన్స్ చేశాడు విజయ్. క్రాంతిమాధవ్ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోందీ చిత్రం. ప్రేమికుల దినోత్సవం కానుకగా వచ్చేనెల 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
దర్శకుడు క్రాంతి మాధవ్ తొలుత ఈ కథను సాయితేజ్‌కు వినిపించాడట. కానీ అతడికి దీనికి నో చెప్పాడు. తర్వాత శర్వానంద్ దగ్గరకు వెళ్లాడు. అయితే శర్వా.. తొలి సగం నచ్చినా, ద్వితీయార్థంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తపరిచాడట. ఈ కారణంతో వారి జోడి కుదరలేదు. అనంతరం దేవరకొండ వద్దకు తీసుకెళ్లాడట క్రాంతి. రౌడీ హీరో మాత్రం చిన్న చిన్న మార్పులతోనే కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.
అయితే మరొకరి కథలతో హిట్లు కొట్టడం విజయ్‌కు ఓ సెంటిమెంట్లా పనిచేస్తోంది. 'పెళ్లిచూపులు', 'అర్జున్‌రెడ్డి', 'గీత గోవిందం'.. ఇలా అన్నీ ముందుగా మరొక హీరో దగ్గరకు వెళ్లొచ్చిన కథలే. ఇప్పుడీ జాబితాలో 'వరల్డ్ ఫేమస్ లవర్' చేరినట్లయింది. మరి ఈ సినిమా అతడి సెంటిమెంట్‌ను కొనసాగిస్తుందా? లేదా? అన్నది తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.