తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఉమెన్స్ డే ప్రత్యేకం: సినీలాకాశంలో సగం - entertainment news

టాలీవుడ్​లో ప్రస్తుతం అన్ని విభాగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. మగాళ్లకు తాము తక్కువ కాదంటూ నిరూపిస్తున్నారు. ఇంతకీ వారెవరు? వారి కథేంటి? తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఉమెన్స్ డే ప్రత్యేకం: సినీలాకాశంలో సగం

By

Published : Mar 8, 2020, 7:24 AM IST

"దేన్నయినా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది.. ఒకటి నేలకి, రెండు వాళ్లకి..." అంటూ మహిళ భూదేవితో సమానమని చెప్పాడు దర్శకుడు త్రివిక్రమ్‌.. ఇటీవలే తాను తీసిన 'అల వైకుంఠపురములో' చిత్రంలో.

"బాధ అయినా గాయం అయినా తట్టుకునే శక్తి ఆడవాళ్లకు మాత్రమే ఉంది. అందుకేనేమో దేశాన్ని అమ్మతో పోలుస్తారు" - స్త్రీ శక్తినీ... స్త్రీ త్యాగాన్ని.. స్త్రీ ఓర్పునీ... 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని ఓ సంభాషణతో చాటి చెప్పాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి.

మహిళల్ని నేటి మన సినిమా చూస్తున్న విధానం ఇది. మహిళల పట్ల నేటి మన సినిమా ప్రదర్శిస్తున్న గౌరవం ఇది.

ప్రేక్షకుల్ని కదిలించే కథ, అందరికీ నచ్చే కథ అయితే చాలు... ఆ సినిమాలకు నిజంగా ఆకాశమే హద్దు. ఈ దశలో మేం చిత్రసీమలో కొనసాగుతుండడం ఆనందంగా ఉంది. హీరోయిన్ల పాత్రల్లో ఇంత గొప్ప మార్పు వస్తుందని అస్సలు ఊహించలేదు. చెప్పాల్సిన మహిళల కథలు చాలానే ఉన్నాయి. వాటిని చూసేందుకు ప్రేక్షకులూ సిద్ధంగా ఉన్నారు. - సమంత, హీరోయిన్

కథానాయిక అంటే ఆడిపాడటానికే పరిమితం... కథానాయిక అంటే ఒక కమర్షియల్‌ సూత్రం... కథానాయిక అంటే ఓ గ్లామర్‌ మంత్రం అనే ధోరణి నుంచి చిత్రసీమ క్రమంగా బయటికొస్తోంది.

వాళ్లకు పరిమితులంటూ ఏమీ లేవు... అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారనే విషయాన్ని గుర్తించింది. అందుకే ప్రస్తుతం కథల్ని నడిపించే దక్షత కలిగిన దీటైన నాయకత్వమైంది... మహిళ. కథానాయకుడి స్థాయిలో తెరపై కనిపిస్తూ నాయికా ప్రాధాన్యమున్న చిత్రాలతో సత్తా చాటుతోంది.

మెగాఫోన్‌ చేతపట్టి కెప్టెన్‌ కుర్చీకీ ఓ కొత్త అందాన్ని తీసుకొస్తోంది మహిళ. సున్నితమైన కథల్ని, భావోద్వేగాల్ని తెరపై ఆవిష్కరిస్తూ అన్ని చిత్ర పరిశ్రమలపైనా ప్రభావం చూపిస్తున్నారు.

ఒక విభాగమేమిటి? మేకప్‌ మొదలుకుని... నిర్మాణం వరకు సినిమాకు సంబంధించి ప్రతి విభాగంలోనూ మహిళల ప్రాధాన్యం, వాళ్ల ప్రతిభా పాఠవాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

నాయికా ఏలుకో

చిత్రసీమలో స్టార్‌... సూపర్‌స్టార్‌ అనే మాటలు కథానాయకుల విషయంలోనే ఎక్కువగా వినిపిస్తుంటాయి. తొలి తరం కథానాయికల తరహాలో స్టార్లుగా గుర్తింపు తెచ్చుకుని.. ఆ హోదాతో వెలుగుతూ పరిశ్రమపై ప్రభావం చూపించినవాళ్లు అరుదు. అగ్ర కథానాయకుల సరసన కొన్ని అవకాశాలు అందుకుంటున్నారంటే వాళ్లనే స్టార్‌ భామలుగా పరిగణించే పరిస్థితి కనిపించింది. కానీ మా ప్రతిభతోనూ స్టార్‌ హోదాకు చేరుకోగలమని... సరైన కథ లభించిందంటే కథానాయకుల స్థాయిలో ప్రేక్షకుల్ని థియేటర్‌కు రప్పించగలమని ఇటీవల కొద్దిమంది కథానాయికలు చాటి చెప్పారు. అందులో నయనతార, అనుష్క, సమంత, కీర్తిసురేశ్ తదితరులున్నారు. వీళ్ల కథల ఎంపిక చాలామంది కథానాయికలపై ప్రభావం చూపిస్తోంది. 'మాయ', 'కర్తవ్యం' తదితర కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చేసిన నయనతార తమిళంలో కథానాయకులకు దీటుగా పారితోషికం సొంతం చేసుకొంటోంది. అనుష్క అంతే. సినిమాలో అగ్ర హీరోలు ఎంతమంది ఉన్నా... ఆమె చేసిన పాత్రలు ప్రత్యేకంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అనుష్క సినిమా అనగానే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనాలు ఏర్పడుతుంటాయి. ఒక కథానాయిక ఎంతగా ఎదగొచ్చో, బాక్సాఫీసును ఏ స్థాయిలో ప్రభావితం చేయొచ్చో అనుష్క ప్రయాణాన్ని గమనిస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు వాణిజ్య ప్రధానమైన చిత్రాల్లోనే కనిపించిన సమంత.. తనదైన అభిరుచిని ప్రదర్శిస్తూ కథల్ని ఎంపిక చేసుకుంది. నటిగా తానేంటో నిరూపించుకుంది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఓ బేబి'.. రూ. 40 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సొంతం చేసుకుందంటే కథానాయిక ప్రాధాన్యమున్న కథల స్థాయి ఎంతో స్పష్టమవుతోంది. 'మహానటి'తో సత్తా చాటిన కీర్తిసురేశ్ మొదలుకొని... సాయిపల్లవి, నివేదా థామస్‌లాంటి నవతరం కథానాయికలూ బలమైన పాత్రల్లో కనిపిస్తున్నారు.

సమంత- అనుష్క శెట్టి

అన్నిచోట్లా ఆధిపత్యం

మగువలు దర్శకత్వంపై మక్కువ ప్రదర్శిస్తున్నారు. ఏటా ఒకరిద్దరు మహిళా దర్శకులు మెగాఫోన్‌ పడుతున్నారు. ఇప్పటికే నందినిరెడ్డి, సుధ కొంగర లాంటి మహిళా దర్శకులు తెలుగు ప్రేక్షకులపై వాళ్లదైన ప్రభావం చూపించారు. విజయాలు అందుకుని అగ్ర దర్శకుల జాబితాలోకి చేరారు. ఈ ఏడాది 'చూసీ చూడంగానే' చిత్రంతో శేష సింధురావు, 'మధ' చిత్రంతో శ్రీవిద్య మెగాఫోన్‌ పట్టారు. ఇప్పటికే 'మధ' పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకుంది. సినిమాకు సంబంధించి... డ్యాన్స్‌, మేకప్‌, కాస్ట్యూమ్స్‌, సంగీతం తదితర విభాగాల్లో మహిళలు కనిపించడం సహజమే. తాము కెప్టెన్లుగా కూడా సత్తా చూపించగలమని ఈమధ్య మరింత ఉత్సాహంగా ముందుకొస్తున్నారు మహిళలు.

"చిన్నప్పుడు నాన్నతోపాటు సెట్‌కు వెళితే డ్యాన్స్‌ విభాగంలో మహిళా కొరియోగ్రాఫర్లు మాత్రమే సెట్‌లో కనిపించేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతిచోటా కనిపిస్తున్నారు. నాకు తెలిసిన మరో అమ్మాయి త్వరలోనే దర్శకత్వం చేయనుంది. మహిళలు సినిమా నిర్మించినా, దర్శకత్వం చేసినా సున్నితమైన కథలు తెరపైకొస్తాయనేది నా అభిప్రాయం. అవి సమాజంపై మంచి ప్రభావం చూపిస్తాయి" అని అంటున్నారు మంచు లక్ష్మీప్రసన్న.

ABOUT THE AUTHOR

...view details