Women Centric Movies 2021: మెనోపాజ్.. అందరి మాట అటుంచితే ఇంట్లో భర్త, పిల్లలతోనూ కూడా చెప్పుకోలేని అవస్థ అది. ఓవైపు కెరీర్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న మహిళ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొందో తెలిపే వెబ్‌సిరీస్ 'బాంబే బేగమ్స్'. నటి పూజా భట్ ఈ సమస్యను ఎదుర్కొన్న తీరు అద్భుతంగా ఉండటమే కాదు మెనోపాజ్ బాధపై అందరికీ అవగాహన కలిగించేదిగా ఉంటుంది. కీలకమైన సమావేశంలో ఉండగా శరీరంలోంచి వెలికివచ్చే హాట్‌ఫ్లాషెస్‌ని ఆమె ఎలా తమాయించుకుందో చెప్పే ఒక్క సీన్ చాలు.. మహిళల సమస్యలపై సినిమా ప్రపంచం ఎంత లోతుగా ఆలోచిస్తోందో తెలియడానికి. నలుగురు మహిళల చుట్టూ తిరిగే ఈ వెబ్‌సిరీస్ కెరీర్ ఒత్తిడిలో పడి వ్యక్తిగత జీవితాలని కోల్పోతున్న మహిళల గురించీ చెబుతుంది.
మరో కీలక అంశం.. అద్దెగర్భాలు. ఈ పేరుతో మనదేశంలో జరుగుతున్న అనేక దందాల గురించి చెప్పిన చిత్రం 'మిమి'. అద్దెగర్భమే అయినా బిడ్డను నవమాసాలు మోసిన పేగుబంధంతో ఆ బిడ్డకోసం పోరాడే అమ్మాయి 'మిమి'. పెళ్లికాకుండానే తల్లి అయి.. ఆ బిడ్డను వదల్లేక సమమతమవుతుంది. సరోగసీ కారణంగా బలవుతున్న మహిళలందరికీ ఈ పాత్ర ఒక ప్రతినిధిగా ఉంటుంది. ఎంతోమందిని ఆలోచింపచేసిన ఈ సినిమాలో కృతీసనన్ మిమీ పాత్రను పోషించింది.
ఎదురీదే పాత్రల్లో..
ఒకవైపు కెరియర్.. మరోవైపు కుటుంబం. స్త్రీలు ఈ రెండింటినీ సమర్థంగా నిర్వహించగలుగుతున్నారా? అనే దిశగా తీసిన చిత్రాలే 'షేర్నీ', 'అరణ్యక్'లు. బాలీవుడ్ నటి రవీనాటాండన్ నటించిన 'అరణ్యక్' చిత్రంలో పోలీసు ఆఫీసర్‌గా పని చేస్తూ, మరోవైపు ఇంటి బాధ్యతలనూ నిర్వర్తించే పాత్రలో నటించి నేటి మహిళలు కెరియర్‌లో రాణించేందుకు ఎంత శ్రమిస్తున్నారో చక్కగా చూపించింది. కెరియర్‌లో ఎదురయ్యే పురుషాధిక్యతకు ఎదురీదుతూ రాణించే మహిళల ప్రతినిధిగా 'షేర్నీ'లో విద్యాబాలన్ అందరి మన్ననలు అందుకుంది. భర్త నుంచి విడాకులు తీసుకొని ఒంటరిగా ఆడపిల్లను పెంచుతూ వ్యాపారంలో అడుగుపెట్టి విజయం సాధించిన కథ 'మాసాబా మాసాబా'. ఇందులో మసాబా, నీనాగుప్తా నటించారు. సమాజంలో ఎందరో ఒంటరి మహిళలకు ఎదురవుతున్న కష్టాలను ఈ సిరీస్‌లో చూపించారు.