బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్ అంటే వలస కూలీల పాలిట ఓ హీరో. "మేం ఫలానా చోట చిక్కుకుపోయాం" అని అయనకి సమాచారం అందిస్తే చాలు వారిని తమ స్వస్థలాలకు చేరవేస్తున్నారు. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి వారిని సొంత గ్రామాలకు పంపిస్తూ వారి పాలిట దేవుడయ్యారు. తాజాగా సోనూసూద్ వలస కూలీల కోసం చేసిన మరో సాయం ఊహకు కూడా అందనిది. మానవత్వంతో వ్యవహరించి అందరి మెప్పు పొందారు. బతుకు తెరువు కోసం కేరళకు వలస వచ్చి ఇరుక్కుపోయిన 169 మహిళలను ప్రత్యేక విమానం ద్వారా తమ స్వస్థలమైన ఒడిశాకు చేర్చారు.
కేరళలోని ఓ టెక్స్‌టైల్స్ ఫ్యాక్టరీలో ఒడిశాకు చెందిన 150 మంది మహిళలు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా వీరంతా కుటుంబ సభ్యులకు దూరంగా అక్కడే ఉండిపోవాల్సిన వచ్చింది. ఈ మహిళలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసేశారు. రవాణా సౌకర్యం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రామిక్ రైలు వెంటనే అందుబాటులో లేకపోవడం, చేతిలో ఉన్న డబ్బులు అయిపోవడం వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరి కష్టం తెలుసుకున్న సోనూసూద్ చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు. దేశంలో వలస కార్మికుల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.