తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లాక్​డౌన్​ ఎత్తేసినా సినిమాల ప్రదర్శన ప్రశ్నార్థకమే!

ప్రతి ఏడాది ఈ​ సమయానికి.. లేదా మరో వారం పది రోజుల్లో చాలా మంది విద్యార్థులకు పరీక్షలు అయిపోతాయి. వేసవి సెలవులను ఎలా గడపాలా? అని ఇప్పటికే చాలా మంది ప్రణాళికలు వేసుకొని ఉంటారు. సినిమాలు, విహార యాత్రలతో గడిపేందుకు సిద్ధమవుతుంటారు. మరోవైపు ప్రతి శుక్రవారం బాక్సాఫీస్‌ కొత్త సినిమాలతో కళకళలాడుతుండేది. కరోనా పెట్టిన పెద్ద పరీక్ష ముందు ఆ పరీక్షలు, సినిమాలు, విహార యాత్రలు పక్కకు వెళ్లిపోయాయి. ఇప్పుడు ప్రజలందరి ముందు ఉన్న అతి పెద్ద పరీక్ష కరోనా వైరస్‌ను ఎదుర్కోవడం ఎలా? లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌ 14 వరకు ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి? యథావిధిగా అన్నీ సాగుతాయా? ముఖ్యంగా బాక్సాఫీస్‌ వద్ద సినిమాలు సందడి చేస్తాయా?

Will the movies be released in April after Corona Lockdown?
లాక్​డౌన్​ తర్వాత సినిమాల ప్రదర్శన ప్రశ్నార్థకమే!

By

Published : Apr 5, 2020, 7:55 AM IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న మొదటి చర్య.. సినిమా థియేటర్లు, షాపింగ్‌మాల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్‌లను పూర్తిగా మూసేసింది. దీంతో పలు సినిమాల విడుదల వాయిదా పడింది. మార్చి మొదటి రెండు వారాల్లో చిన్న చిన్న సినిమాలు విడుదలయ్యాయి. తెలుగులో 'ఓ పిట్ట కథ', 'పలాస 1978', 'మద', 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' తదితర సినిమాలు వెండితెరపై సందడి చేశాయి. కరోనా విజృంభిస్తుండటం వల్ల తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా థియేటర్లు మూసి వేసింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం అదే బాటలో పయనించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. చిత్ర పరిశ్రమ దీనికి మద్దతుగా నిలిచింది.

ఉగాది సందర్భంగా రావాల్సిన నాని, సుధీర్‌బాబుల 'వి', రాజ్‌ తరుణ్‌ 'ఒరేయ్‌ బుజ్జిగా' చిత్రాలు విడుదలను వాయిదా వేసుకున్నాయి. జనతా కర్ఫ్యూ, ఆ వెంటనే 21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ నెలలో విడుదలయ్యే సినిమాలూ వాయిదా పడ్డాయి. అనుష్క 'నిశ్శబ్దం', రానా 'అరణ్య', రామ్‌ 'రెడ్', వైష్ణవ్‌ తేజ్‌ 'ఉప్పెన', కీర్తి సురేశ్‌ 'మిస్‌ ఇండియా' చిత్రాలు ఏప్రిల్‌ ప్రథమార్ధంలో విడుదల కావాల్సి ఉండగా, ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి.

ఏప్రిల్​లో విడుదల కావాల్సిన సినిమాలు

బాలీవుడ్‌, హాలీవుడ్‌దీ అదే పరిస్థితి

లాక్‌డౌన్‌కు ముందు బాలీవుడ్‌ నుంచి వచ్చిన చివరి చిత్రం 'అంగ్రేజ్‌ మీడియం'. మార్చి చివరి వారంలో విడుదల కావాల్సిన అక్షయ్‌ 'సూర్యవంశీ'.. అలాగే ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన '83' సినిమాలు వాయిదా పడ్డాయి. కపిల్‌దేవ్‌ జీవిత కథ ఆధారంగా నాటి క్రికెట్‌ ప్రపంచకప్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. వీటితో పాటు పలు చిత్రాలూ తమ విడుదల తేదీని మార్చుకున్నాయి. ఇక హాలీవుడ్‌ చిత్రాలైతే ఈ ఏడాది చివరకు వెళ్లిపోయాయి. బాండ్‌ నటించిన 'నో టైమ్‌ టు డై', మార్వెల్‌ 'బ్లాక్‌ విడో' చిత్రాలు నవంబర్‌కు టామ్‌ క్రూజ్‌ 'టాప్‌గన్‌: ది మార్విరిక్‌' డిసెంబరుకు వెళ్లిపోయాయి.

ఏప్రిల్‌లో టికెట్లు తెగుతాయా?

అది కూడా అనుమానమే! ఎందుకంటే రోజురోజుకీ దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14తో ముగుస్తుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అంటే ఏప్రిల్‌లో సగం రోజులు అయిపోయినట్లే. మిగిలింది మరో 15 రోజులు మాత్రమే. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం లేకపోలేదు. ఒక వేళ లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14తో ముగిసినా, జన సమూహాలకు కారణమయ్యే థియేటర్లు, మల్టీప్లెక్సులకు అనుమతి ఇస్తారా? లేదా? అన్నది అప్పటి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

లాక్​డౌన్​ తర్వాత సినిమాల ప్రదర్శన ప్రశ్నార్థకమే!

ప్రేక్షకులు వస్తారా?

మోదీ ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా కరోనా కట్టడి సాధ్యమవుతుందని అందరూ భావించారు. ప్రజలు ఒకరినొకరు కలవకపోవడం వల్ల కరోనా లింకు తెగిపోతుందని అనుకున్నారు. అయితే, గత నాలుగైదు రోజులుగా పరిణామాలు వేగంగా మారిపోయాయి. మర్కజ్‌తో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోయాయి. కరోనా భయం ఉన్నా, అత్యవసరాలు, నిత్యావసరాల కోసం బయటకు వస్తున్న ప్రజలు ఈ దెబ్బతో మరింత తగ్గిపోయారు. సాయంత్రం 6 గంటల నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ తర్వాత సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు ఎంత వరకూ థియేటర్‌కు వస్తారన్నది ప్రశ్నార్థకమే.

థియేటర్ల వద్ద అరకొర సౌకర్యాలు

తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లలో కనీస సౌకర్యాలు లేవు. మంచి నీరు, మరుగుదొడ్లు, శుభ్రతలేని సీట్లు ఇలా అనేక సమస్యలతో థియేటర్లు సతమతమవుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరిశుభ్ర వాతావరణంలో థియేటర్లు ఉంటాయని అనుకోవడం నేతి బీర చందమే అవుతుంది. శానిటైజర్లు, ఉష్ణోగ్రత కొలిచే పరికరాలు సమకూర్చుకోవడం థియేటర్‌ యజమానులకు మరో సమస్య.

లాక్​డౌన్​ తర్వాత సినిమాల ప్రదర్శన ప్రశ్నార్థకమే!

పరిస్థితిని సమీక్షిస్తున్న సినీ పరిశ్రమ వర్గాలు

ప్రస్తుతం చిత్ర పరిశ్రమ మొత్తం కరోనాపై ప్రభుత్వాలు చేస్తున్న పోరుకు మద్దతుగా నిలుస్తోంది. ఆర్థికంగా తమ వంతు దేశానికి అందిస్తున్న సాయంతో పాటు, చిత్ర పరిశ్రమలోని కార్మికులను ఆదుకునేందుకూ నటులందరూ ముందుకు వస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదిక కరోనాపై అవగాహన కల్పిస్తూ, సందేశాలు ఇస్తున్నారు. ఎవరి ఇళ్లలో వాళ్లు ఉంటూనే తమ చిత్రాలకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చేస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై దర్శక-నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించిన వాయిదా పడిన చిత్రాలను ఎప్పుడు విడుదల చేయాలనే విషయంపై కూలంకషంగా చర్చిస్తున్నారు. వరుసగా ఐదారు పెద్ద సినిమాలు ఉండటం వల్ల ఒకేసారి కాకుండా ఎవరు? ఎప్పుడు? ఏ చిత్రాన్ని విడుదల చేయాలి? అన్న దానిపై ఒక అభిప్రాయాలు మరొకరు తీసుకుంటున్నట్లు సమాచారం. మరి ఏ సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలియాలంటే ముందు లాక్‌డౌన్‌ పూర్తి కావాలి. ఆ తర్వాత విడుదల తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చూడండి..'పౌరులంతా ఐక్యపోరాటంలో భాగం కావాలి'

ABOUT THE AUTHOR

...view details