అగ్ర కథానాయకుల వారసులను ప్రేక్షకులకు పరిచయం చేయడం అంటే ఆషామాషీ కాదు. ఫలానా నటుడి తనయుడు సినిమాల్లోకి వస్తున్నాడంటే అభిమానుల్లో అంచనాలు తారస్థాయికి చేరుతాయి. ముఖ్యంగా ఆ వారసుడ్ని పరిచయం చేయబోయే దర్శకుడిపైనే అందరి దృష్టి ఉంటుంది. అది ఎంతో సాహసంతో కూడుకున్న పని. అందుకే కొందరు దర్శకులు ఇటువైపు అడుగులేసేందుకు ఇష్టపడరు.
ఇలాంటి సంఘటనే మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్చరణ్ను వెండితెరకు పరిచయం చేసే సమయంలో చోటుచేసుకుంది. తనయుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేసే బాధ్యతను అగ్ర దర్శకుడు రాజమౌళికి ఇవ్వాలనుకున్నాడట చిరంజీవి. కానీ అప్పటికే జక్కన్న వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, చెర్రీ హావభావాలు ఎలా ఉంటాయో తెలియకపోవడం వల్ల ఏ కథ సరిపోతుందో? అని భావించి రెండో సినిమా చేస్తానని చెప్పాడట రాజమౌళి. ఈ కారణంగా ఆ అవకాశం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సొంతమైంది.